
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయ్. సోమవారం 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావం, పలుచోట్ల కురిసిన తేలికపాటి వానలతో వాతావరణం చల్లబడటంతో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్యనే నమోదయ్యాయి. వాతా వరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా కనిపిస్తోంది.
సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడల మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.