![26 places in Telangana record temperatures above 46 degree celsius](/styles/webp/s3/article_images/2024/05/5/sun_3.jpg.webp?itok=MoXUZHqA)
మే నెలాఖరులో ఉండే స్థాయి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదు
పలుచోట్ల ఏకంగా 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఎండల మంటలు
అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరుగుదల
తొమ్మిది జిల్లాల్లో తీవ్రంగా వడగాడ్పులు వీచే అవకాశం
మరో మూడు రోజులు ఇదే తరహా పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే స్థాయిలోని గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలోనే నమోదవుతుండటం గమనార్హం. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలలో గరిష్ట ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.
దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో చూస్తే.. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
![](/sites/default/files/inline-images/pattika.jpg)
వడగాడ్పుల తీవ్రత పెరిగే చాన్స్
శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయని.. ఆది, సోమవారాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఉరుములు, మెరుపుల వానలకు చాన్స్
మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment