సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో మొదలైన బొగ్గు సంక్షోభం ఆ తరువాత కాస్త తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవిలో మరోసారి బొగ్గు కొరత ఏర్పడింది. వర్షాలు కురిసే వరకూ సాధారణ స్థితికి చేరలేదు. మూడోసారి వచ్చే ఆగస్టులో బొగ్గు సంక్షోభం ముంచుకురానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేయడంతో కేంద్రం అప్రమత్తమైంది.
దేశంలో ఇదీ పరిస్థితి: దేశ వ్యాప్తంగా 180 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుండగా ప్రస్తుతం వాటిలో 74 కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. కేవలం సొంత బొగ్గు గనులున్న కేంద్రాలు మాత్రమే 92 శాతం నిల్వలతో ఉన్నాయి. దిగుమతిపై ఆధారపడే కేంద్రాల్లో అవసరమైన దానిలో 45 శాతం మాత్రమే బొగ్గు ఉంది. ఆగస్టులో వర్షాలతో బొగ్గు తవ్వకాలకు ఆటంకం, రవాణాలో తలెత్తే ఇబ్బందుల వల్ల ఈ నిల్వలు మరింత తగ్గిపోనున్నాయి. బొగ్గు ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి 204.9 గిగావాట్లు కాగా, దీనిలో 17.6 గిగావాట్లు విదేశీ బొగ్గుతో జరుగుతోంది. ఇందుకోసం 64.89 మిలియన్ టన్నుల బొగ్గును జూన్‌లో సరఫరా చేశారు. గతేడాది కంటే ఇది 30.8 శాతం ఎక్కువ. అయితే దేశంలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 1,500 మిలియన్ టన్నులుంటే దానిలో సగమే జరుగుతోంది.
రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గతేడాది ఇదే సమయానికి రోజు 140 మిలియన్ యూనిట్లు వినియోగం జరిగింది. ఈ ఏడాది 35 శాతం డిమాండ్ పెరిగింది. జెన్‌కో థర్మల్ కేంద్రాల నుంచి 50 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో యూనిట్ రూ. 6.45 చొప్పున 21.81 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు.
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ఇక్కడ ప్రస్తుతం 68,457 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3 రోజులకు సరిపోతాయి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ (కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నులు ఖర్చవుతుండగా 3,25,129 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 17 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
ఏపీ సన్నద్ధం
ఆగస్టులో బొగ్గు సంక్షోభం, విద్యుత్ డిమాండ్ వల్ల వచ్చే విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ సన్నద్ధమవుతున్నాయి. ఏపీ జెన్‌కో, ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)లు 31 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయి. దీనిని నిల్వ చేసి సంక్షోభం తలెత్తే సమయానికి వినియోగించనున్నారు.
అదే విధంగా రాష్ట్రానికి బొగ్గును సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్వాపింగ్ విధానంలో ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఇచ్చిపుచ్చుకునేలా ఇంధన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టులో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనేందుకు వీలుగా షార్ట్‌టెర్మ్ టెండర్లు పిలిచారు.
దేశంలో మళ్లీ బొగ్గు సంక్షోభం.!
Published Wed, Jul 27 2022 4:07 AM | Last Updated on Wed, Jul 27 2022 4:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment