కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్‌మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది.
వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్
నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్‌లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్‌ను చూస్తే అర్థమవుతోంది.
జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్‌మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి
. అపార్ట్‌మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్‌మెంట్‌లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
పచ్చని చెట్లు కనుమరుగు
పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్‌లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్‌మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది.
పల్లెకు పోదాం..
పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు.
అభిరుచికి అనుగుణంగా వెంచర్లు
కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం.
ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం
పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు
ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment