కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్ హెచ్‌వోడీ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఆదివారం వివరించారు.
♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి. వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్ హార్ట్ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం.
♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్ ఫెయిల్యూర్‌తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్ కవాటం చెడిపోయింది. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్‌లు గుర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్ ఆపరేషన్ చేయాలి. మైట్రల్ కవాటాన్ని ప్లాస్టిక్ కవాటంగా మార్చడమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్ చేయడం వంటి ప్రక్రియను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్ టెన్షన్ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది.
♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్ బాల్ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment