నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తున్న సీఎం జగన్
అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం
87 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది
సాకారం కోసమే పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం
కర్నూలు జిల్లాలో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి భూమి పూజ చేసిన సీఎం జగన్
150 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్లకుపైగా వ్యయంతో నిర్మాణం.. హైకోర్టు భవనాన్ని సైతం అక్కడే నెలకొల్పేలా సదుపాయాలు
త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్ కర్నూలుకు తరలింపు
కర్నూలు (సెంట్రల్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు.
లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్
1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హైకోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూనివర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు
కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్‌లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్ సృజన పేర్కొన్నారు.
తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు
కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మునగాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ కరణం కిశోర్‌కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, జేసీఎస్ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్
శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి. – సీఎం జగన్
కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్
అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్ అందలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వారా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు.
– పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె
Comments
Please login to add a commentAdd a comment