రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం
ఉరుములు, ఈదురు గాలులుంటాయన్న వాతావరణ శాఖ
జీహెచ్‌ఎంసీ హెల్ప్‌డెస్క్ డయల్ 040–21111111, 9001136675
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయి. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వానలు, జల్లులు పడుతుండగా... మంగళ, బుధ, గురువారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
రుతుపవనాలు రాష్ట్రం మీదుగా సోమవారం మహారాష్ట్రలోని నాసిక్, సుకుమా తదితర ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో అటు దక్షిణ మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.
రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్‌పేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హెచ్చరించింది.
వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హెల్ప్ డెస్క్ (ఫోన్ నంబర్లు: 040–21111111, 9001136675)ను ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment