సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పెద్దగా లేకపోయినా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడిందని, ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా, బుధవారానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా–పశి్చమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుపానుగా ఉత్తర ఒడిశా, పశి్చమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తుపాను సన్నద్ధతపై సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో ఏపీ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment