సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు.
శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
చదవండి: కరీంనగర్‌లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment