
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది.
వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మరోవైపు రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా ఏర్పడుతుందని తెలిపింది. కాగా.. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతోంది. అరకు లోయలో 7.1, పెద ఉప్పరాపల్లి (చిత్తూరు) 8.8, ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి) 9, బెలుగుప్ప (అనంతపురం) 9.5, పెద్ద తిప్పసముద్రం (అన్నమయ్య) 10.3, హలహర్వి (కర్నూలు) 10.5, వల్లివేడు (తిరుపతి)ల్లో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment