సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు, మరో 10 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. 13 మండలాల్లో 46 డిగ్రీలు, 39 మండలాల్లో 45 డిగ్రీలు, 255 మండలాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
40 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 148 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 46.7 శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు మండుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నేడు 20 మండలాల్లో వడగాడ్పులు
బుధవారం 20 మండలాల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలో 2 మండలాలు, గుంటూరు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 3, పల్నాడులో 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment