
రోజూ వంటల్లోకి కూరగాయలో, ఆకుకూరలో కావాల్సిందే. కానీ త్వరలోనే కూరగాయలు, ఆకుకూరలు మాయమైపోయే పరిస్థితి నెలకొందట. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు కూరగాయలంటే తెలియని పరిస్థితి వస్తుందట. అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గత 40 ఏళ్లలో (1975–2016 మధ్య) ప్రచురితమైన అధ్యయనాలన్నింటినీ సమీక్షించి ఈ అంచనాకు వచ్చింది. వాతావరణ మార్పులు, గాలిలో కార్బన్‌డయాక్సైడ్ మోతాదు పెరగడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో కూరగాయల దిగుబడులు 35 శాతం వరకూ తగ్గిపోతాయని తేల్చింది.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పింది. ఇక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో భూమి లోతుల్లోంచి తోడుతున్న నీటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటం కూడా దిగుబడులపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
నష్టమే ఎక్కువ?
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ ఎక్కువైతే కొన్ని పంటలకు మేలు జరుగుతుందని గతంలోనే కొన్ని అంచనాలుండగా.. తాజా పరిస్థితులను చూస్తే నష్టమే ఎక్కువని శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో.. 174 పరిశోధనలు, 1,540 ప్రయోగాలను తాము సమీక్షించామని వారు వెల్లడించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చినా.. కాయగూరలు, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు లండన్ యూనివర్సిటీ అధ్యాపకుడు అలన్ డాన్‌గౌర్.
పర్యావరణ మార్పులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన తక్షణావశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే.. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారమైన ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడుజాతి గింజల కొరత తలెత్తుతుందని.. ఇది ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.