విషం మింగి..ఇంధనం ఇస్తుంది!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కార్బన్‌డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతూ వాతావరణ మార్పులకు కారణమవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.. మరోవైపు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమేమిటా అనే ఆలోచనా సతమతం చేస్తోంది.. కానీ ఈ రెండు సమస్యల్నీ తీర్చేశానంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డేనియల్ నోసెరా. తాను అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను ఇస్తుందని ఆయన చెబుతున్నారు. ఆయన ఇంతకుముందే మొక్కల ఆకుల మాదిరిగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా హైడ్రోజన్‌ను తయారు చేసే కృత్రిమ ఆకుల్ని సృష్టించారు.
తాజాగా ఈ సరికొత్త బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. హైడ్రోజన్, కార్బన్‌డయాక్సైడ్‌లను పీల్చుకుని అడినైన్ ట్రైఫాస్పేట్ (ఏటీపీ)ని తయారుచేసే రాల్‌స్టన్ రాల్ యుట్రోఫా బ్యాక్టీరియాలోకి మరిన్ని జన్యువులను జొప్పించడం ద్వారా అది నేరుగా ఐసోప్రొపనాల్, ఐసోబ్యూటనాల్‌లను విడుదల చేసేలా మార్చారు. ఒక లీటర్ పరిమాణమున్న ఈ బ్యాక్టీరియా ఫ్యూయల్‌సెల్ ద్వారా రోజుకు 500 లీటర్ల పరిమాణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించవచ్చని నోసెరా అంటున్నారు. తాను రూపొందించిన కృత్రిమ ఆకు టెక్నాలజీ మురుగునీటి నుంచి కూడా హైడ్రోజన్‌ను సృష్టించగలదని, దీనికి రాల్‌స్టన్ యూట్రోఫా బ్యాక్టీరియా తోడైతే ప్రపంచంలో ఏ మూలనైనా విద్యుత్ వెలుగులు సృష్టించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌సభ్యుడు కూడా అయిన నోసెరా... ఇలాంటి టెక్నాలజీలు భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచి ఫలితాలు కనబరుస్తాయని, అందుకే తాను ఇక్కడి నుంచి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొంటున్నారు.