‘రాతి’గా విష వాయువు!
ఈ ఫొటోలోని యువతి చేతిలో ఉన్నదేంటో తెలుసా..? ఆ ఏముంది ఏదో రాయి అంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మామూలు రాయి కాదు.. కార్బన్ డయాక్సైడ్ రాయి! వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన ఈ విష వాయువును వదిలించుకునేందుకు చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్న శాస్త్రవేత్తలు.. చివరికి ఇలా రాయి రూపంలోకి మార్చగలిగారు.
ఐస్‌ల్యాండ్‌లోని ఓ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ప్రయత్నాల ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు ఘన రూపాన్ని సంతరించుకుంది. 2012 నుంచి వారు ఆ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్ వాయువును నీటితో కలిపి భూమి లోపలి పొరల్లోకి జొప్పించడం మొదలుపెట్టారు. బసాల్ట్ రాతి నిర్మాణం ఉన్నచోటుకు చేరిన ఆ మిశ్రమం రెండేళ్లలో గట్టిపడి రాయిగా మారిపోయింది. వాస్తవానికి ఇలా జరిగేందుకు వందల ఏళ్లు పడుతుందని ఇప్పటివరకు భావించడం గమనార్హం.