london university
-
పగటి పూటా ఓ కునుకేయండి
సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్‌లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. అతి నిద్ర ప్రమాదకరం తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ సమయంతోనే ముప్పు స్క్రీనింగ్ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది. ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు. -
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్న భారత మాజీ పేసర్
క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు. భారత క్రికెట్లో అయితే ఆ సంఖ్య మరీ తక్కువనే చెప్పాలి. భారత క్రికెట్ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కనీసం డిగ్రీ కూడా చదవలేదు. ఈ మధ్య జనరేషన్లో టీమిండియా తరఫున రాణించి, మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఓ క్రికెటర్ లేటు వయసులో చదువుపై దృష్టి సారించాడు. రిటైర్మెంట్ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసి చదువు మధ్యలోనే ఆపేసిన చాలామంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. అతనే టీమిండియా మాజీ పేసర్, భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ ప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక లండన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్లో పీజీ పట్టా పొందాడు. Never stop learning, because life never stops teaching. It was an honour and privilege to receive PG Cert in International Sports Management from @UoLondon . Look forward to contributing more in the field of Sports. pic.twitter.com/NYkdxQ1QK1 — Venkatesh Prasad (@venkateshprasad) July 15, 2022 ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో పీజీ పట్టా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మరింత సేవ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, దాదాపు రెండు దశబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ప్రసాద్.. 1996 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా హైలైట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అమీర్ సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత ప్రసాద్ ప్రదర్శించిన హావభావాలు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్‌లో ప్రసాద్ బౌలింగ్‌లో సోహైల్ బౌండరీ బాది వార్నింగ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే ప్రసాద్.. సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. చదవండి: 'కోహ్లిని గాడిలో పెట్టగల వ్యక్తి సచిన్ మాత్రమే' -
స్కామ్ సొమ్ముతో వర్సిటీ ఫీజు.. నగర వాసిని మోసం చేసిన ఎన్నారై
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ స్కిమ్మింగ్ గ్యాంగ్‌తో చేతులు కలిపిన ఓ ఎన్నారై నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేశాడు. ఆయన కుమారుడి లండన్ యూనివర్శిటీ ఫీజులో కొంత తన కార్డు ద్వారా చెల్లిస్తానని, ఆ మొత్తాన్ని హైదారాబాద్‌లోని తన సోదరుడి ఖాతాలో వేయాలన్నాడు. పన్నులు కలిసి వస్తాయని భావించిన బాధితులు అలానే చేశారు. ఆనక లండన్ పోలీసులు వచ్చి వర్శిటీ నుంచి సొమ్ము రికవరీ చేసుకుపోతే కానీ అసలు విషయం తెలీదు. ఈ వ్యవహారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చేరడంతో కేసు నమోదైంది. నగరంలో ఉన్న ఎన్నారై తమ్ముడు అరెస్టు వరకు వ్యవహారం వెళ్లడంతో బాధితులకు నగదు తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. ►నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లండన్‌లోని బీపీపీ యూనివర్శిటీలో పీజీ సీటు వచ్చింది. మొత్తం ఫీజు 11 వేల యూరోలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో తొలి విడత రూ.6 లక్షలు యూరోలుగా మార్చి కట్టడానికే ఎక్స్ఛేంజ్, పన్నుల చెల్లించాల్సి వచ్చింది. ఈ కుటుంబానికి పరిచయమున్న కరుణాకర్‌రెడ్డి అనే ఎన్నారై ఆ సమయంలో రంగంలోకి దిగాడు. ►అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్, స్కిమ్మింగ్ ద్వారా నకిలీవి తయారు చేసే ముఠాతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం దాచి పెట్టిన కరుణాకర్ బాధిత కుటుంబంతో తన కార్డులో రూ.5 లక్షలు యూరోలుగా చెల్లిస్తానని, తనకు రివార్డ్స్ పాయింట్స్‌గా, బాధిత కుటుంబానికి ఎక్స్ఛేంజ్, పన్నులు మిగిలి లాభం ఉంటుందని చెప్పాడు. ►నిజమేనని నమ్మిన బాధితులు అంగీకరించి రూ.5 లక్షల్ని నగరంలో ఉన్న కరుణాకర్ సోదరుడు ప్రశాంత్ ఖాతాలో జమ చేశారు. కరుణాకర్ మాత్రం క్లోన్డ్ క్రెడిట్ కార్డుతో బీఆర్ఆర్ వర్శిటీకి మిగిలిన ఫీజు చెల్లించేశాడు. రూ.5 లక్షల్లో 30 శాతం మినహాయించి మిగిలింది ప్రశాంత్ ఢిల్లీలో ఉన్న సుశాంత్ అనే వ్యక్తి ఖాతాకు పంపాడు. ఇతడు కూడా గ్యాంగ్‌లో సభ్యుడిగా అనుమానిస్తున్నారు. ►షెడ్యూల్ ప్రకారం లండన్ వెళ్లిన నగర యువకుడు వర్శిటీలో చేరాడు. ఓ రోజు హఠాత్తుగా వర్శిటీకి వచ్చిన అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. మరో వ్యక్తి క్రెడిట్ కార్డు స్కిమ్మింగ్ చేసి ఫీజు కట్టిన నేరంపై కేసు నమోదైందని చెప్పారు. దీంతో ఖంగుతిన్న నగర యువకుడు వారికి విషయం చెప్పాడు. ►దీంతో అతడిని వదిలిపెట్టిన పోలీసులు వర్శిటీ నుంచి రూ.5 లక్షలు (యూరోల రూపంలో) రికవరీ చేసుకువెళ్లారు. సీటు కాపాడుకోవడానికి నగరంలోని అతడి కుటుంబం ఆ మొత్తం తక్షణం చెల్లించాల్సి వచ్చింది. ఆపై వీళ్లు ప్రశాంత్‌ను నిలదీసి తమ డబ్బు తిరిగి చెల్లించాలని కోరారు. దీనికి ససేమిరా అన్న అతగాడు ఆ మొత్తం తన సోదరుడు చెప్పినట్లు ఢిల్లీకి బదిలీ చేశానన్నాడు. ►బాధితులు గత నెల్లో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అధికారులు ప్రశాంత్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. అతడు కరుణాకర్‌ను సంప్రదించినా స్పందన లేదు. దీంతో ఆ మొత్తం తాను చెల్లిస్తానంటూ బాధితులతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం ముట్టిన తర్వాత కేసు ఉపసంహరించుకుంటామని బాధితులు సైబర్ ఠాణాకు సమాచారం ఇచ్చారు. -
కూరగాయలకు కష్టకాలం
రోజూ వంటల్లోకి కూరగాయలో, ఆకుకూరలో కావాల్సిందే. కానీ త్వరలోనే కూరగాయలు, ఆకుకూరలు మాయమైపోయే పరిస్థితి నెలకొందట. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు కూరగాయలంటే తెలియని పరిస్థితి వస్తుందట. అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గత 40 ఏళ్లలో (1975–2016 మధ్య) ప్రచురితమైన అధ్యయనాలన్నింటినీ సమీక్షించి ఈ అంచనాకు వచ్చింది. వాతావరణ మార్పులు, గాలిలో కార్బన్డయాక్సైడ్ మోతాదు పెరగడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో కూరగాయల దిగుబడులు 35 శాతం వరకూ తగ్గిపోతాయని తేల్చింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పింది. ఇక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో భూమి లోతుల్లోంచి తోడుతున్న నీటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటం కూడా దిగుబడులపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. నష్టమే ఎక్కువ? వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ఎక్కువైతే కొన్ని పంటలకు మేలు జరుగుతుందని గతంలోనే కొన్ని అంచనాలుండగా.. తాజా పరిస్థితులను చూస్తే నష్టమే ఎక్కువని శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో.. 174 పరిశోధనలు, 1,540 ప్రయోగాలను తాము సమీక్షించామని వారు వెల్లడించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చినా.. కాయగూరలు, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు లండన్ యూనివర్సిటీ అధ్యాపకుడు అలన్ డాన్‌గౌర్. పర్యావరణ మార్పులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన తక్షణావశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే.. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారమైన ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడుజాతి గింజల కొరత తలెత్తుతుందని.. ఇది ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. -
డ్రోన్లలో కీటకాల టెక్నాలజీ
లండన్: ఎంతో వేగంతో దూసుకొచ్చే కీటకాలు చెట్లకుండే చిన్ని రంధ్రాల్లోకి అంత నేరుగా ఎలా దూసుకుపోతాయి? దట్టమైన అడవుల్లో ఎగురుతున్నా వేటికీ తాకకుండా అంత కచ్చితంగా తమ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తల్లో కొత్త ఆలోచనలకు పురుడుపోస్తున్నాయి. డ్రోన్లలో కూడా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తే ఇక వాటిని మనిషి ఆపరేట్ చేయాల్సిన అవసరమే ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసం కీటకాల కళ్లపై పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. దట్టమైన అడవుల్లో ఎంత వేగంగా దూసుకుపోయినా చిన్నపాటి ప్రమాదాన్ని కూడా కీటకాలు ఎదుర్కోకపోవడానికి కారణం వాటి కంటి నిర్మాణమేనని గుర్తించారు. కాంతి తీవ్రతను వేగంగా అంచనా వేయగలశక్తి కీటకాల కళ్లకు ఉందని, అందుకే అవి తమ గమ్యాన్ని అంత కచ్చితంగా చేరతాయని చెబుతున్నారు. 360 డిగ్రీలు చూడగల కీటకాల కంటి నిర్మాణాన్ని పోలిన కెమెరాలను డ్రోన్లకు అమర్చి, వాటి సంకేతాల సాయంతో అవి ప్రయాణించేలా చేయగలిగితే డ్రోన్లు సైతం మనుషుల సాయం లేకుండానే కచ్చితమైన వేగంతో గమ్యాన్ని చేరతాయంటున్నారు. అయితే ఇది సాకారం కావడానికి పది నుంచి పదిహేనేళ్లు పట్టొచ్చని స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మరణాన్నీ వాయిదా వెయ్యొచ్చు!
లండన్: నిండు నూరేళ్లు చల్లగా జీవించమని పెద్దలు అప్పుడప్పుడూ దీవిస్తూ ఉంటారు. దీవెన వరకూ బాగానే ఉన్నా నూరేళ్లూ జీవించడం అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతమున్న కాలుష్య పూరిత వాతావరణంలో అరవయ్యేళ్లు బతికితే గొప్పే. అయితే తాజాగా ఓ పరిశోధన వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా నివారించవచ్చని నిరూపించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామెటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకూ ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేయొచ్చు. పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. వీటిలోకి ట్రామెటినిబ్ డ్రగ్‌ను ప్రవేశపెట్టారు. ఇవి సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువ కాలం జీవించాయి. ‘‘ఈగలతో పాటు జంతువులు, మానవుల్లో ఉండే ఆర్ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ఈ డ్రగ్ ఆర్ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలదు’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. రాబోయే 10-20 ఏళ్లలో పూర్తిస్థాయి చికిత్సావిధానాలు అందుబాటులోకి రాగలవని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.