మరణాన్నీ వాయిదా వెయ్యొచ్చు!
లండన్: నిండు నూరేళ్లు చల్లగా జీవించమని పెద్దలు అప్పుడప్పుడూ దీవిస్తూ ఉంటారు. దీవెన వరకూ బాగానే ఉన్నా నూరేళ్లూ జీవించడం అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతమున్న కాలుష్య పూరిత వాతావరణంలో అరవయ్యేళ్లు బతికితే గొప్పే. అయితే తాజాగా ఓ పరిశోధన వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా నివారించవచ్చని నిరూపించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామెటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకూ ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేయొచ్చు.
పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. వీటిలోకి ట్రామెటినిబ్ డ్రగ్‌ను ప్రవేశపెట్టారు. ఇవి సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువ కాలం జీవించాయి. ‘‘ఈగలతో పాటు జంతువులు, మానవుల్లో ఉండే ఆర్‌ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ఈ డ్రగ్ ఆర్‌ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలదు’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. రాబోయే 10-20 ఏళ్లలో పూర్తిస్థాయి చికిత్సావిధానాలు అందుబాటులోకి రాగలవని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.