సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ స్కిమ్మింగ్ గ్యాంగ్‌తో చేతులు కలిపిన ఓ ఎన్నారై నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేశాడు. ఆయన కుమారుడి లండన్ యూనివర్శిటీ ఫీజులో కొంత తన కార్డు ద్వారా చెల్లిస్తానని, ఆ మొత్తాన్ని హైదారాబాద్‌లోని తన సోదరుడి ఖాతాలో వేయాలన్నాడు. పన్నులు కలిసి వస్తాయని భావించిన బాధితులు అలానే చేశారు. ఆనక లండన్ పోలీసులు వచ్చి వర్శిటీ నుంచి సొమ్ము రికవరీ చేసుకుపోతే కానీ అసలు విషయం తెలీదు. ఈ వ్యవహారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చేరడంతో కేసు నమోదైంది. నగరంలో ఉన్న ఎన్నారై తమ్ముడు అరెస్టు వరకు వ్యవహారం వెళ్లడంతో బాధితులకు నగదు తిరిగి రావడానికి మార్గం సుగమమైంది.
►నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లండన్‌లోని బీపీపీ యూనివర్శిటీలో పీజీ సీటు వచ్చింది. మొత్తం ఫీజు 11 వేల యూరోలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో తొలి విడత రూ.6 లక్షలు యూరోలుగా మార్చి కట్టడానికే ఎక్స్‌ఛేంజ్, పన్నుల చెల్లించాల్సి వచ్చింది. ఈ కుటుంబానికి పరిచయమున్న కరుణాకర్‌రెడ్డి అనే ఎన్నారై ఆ సమయంలో రంగంలోకి దిగాడు.
►అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్, స్కిమ్మింగ్ ద్వారా నకిలీవి తయారు చేసే ముఠాతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం దాచి పెట్టిన కరుణాకర్ బాధిత కుటుంబంతో తన కార్డులో రూ.5 లక్షలు యూరోలుగా చెల్లిస్తానని, తనకు రివార్డ్స్ పాయింట్స్‌గా, బాధిత కుటుంబానికి ఎక్స్‌ఛేంజ్, పన్నులు మిగిలి లాభం ఉంటుందని చెప్పాడు.
►నిజమేనని నమ్మిన బాధితులు అంగీకరించి రూ.5 లక్షల్ని నగరంలో ఉన్న కరుణాకర్ సోదరుడు ప్రశాంత్ ఖాతాలో జమ చేశారు. కరుణాకర్ మాత్రం క్లోన్డ్ క్రెడిట్ కార్డుతో బీఆర్‌ఆర్ వర్శిటీకి మిగిలిన ఫీజు చెల్లించేశాడు. రూ.5 లక్షల్లో 30 శాతం మినహాయించి మిగిలింది ప్రశాంత్ ఢిల్లీలో ఉన్న సుశాంత్ అనే వ్యక్తి ఖాతాకు పంపాడు. ఇతడు కూడా గ్యాంగ్‌లో సభ్యుడిగా అనుమానిస్తున్నారు.
►షెడ్యూల్ ప్రకారం లండన్ వెళ్లిన నగర యువకుడు వర్శిటీలో చేరాడు. ఓ రోజు హఠాత్తుగా వర్శిటీకి వచ్చిన అక్కడి పోలీసులు ఇతడిని అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. మరో వ్యక్తి క్రెడిట్ కార్డు స్కిమ్మింగ్ చేసి ఫీజు కట్టిన నేరంపై కేసు నమోదైందని చెప్పారు. దీంతో ఖంగుతిన్న నగర యువకుడు వారికి విషయం చెప్పాడు.
►దీంతో అతడిని వదిలిపెట్టిన పోలీసులు వర్శిటీ నుంచి రూ.5 లక్షలు (యూరోల రూపంలో) రికవరీ చేసుకువెళ్లారు. సీటు కాపాడుకోవడానికి నగరంలోని అతడి కుటుంబం ఆ మొత్తం తక్షణం చెల్లించాల్సి వచ్చింది. ఆపై వీళ్లు ప్రశాంత్‌ను నిలదీసి తమ డబ్బు తిరిగి చెల్లించాలని కోరారు. దీనికి ససేమిరా అన్న అతగాడు ఆ మొత్తం తన సోదరుడు చెప్పినట్లు ఢిల్లీకి బదిలీ చేశానన్నాడు.
►బాధితులు గత నెల్లో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అధికారులు ప్రశాంత్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. అతడు కరుణాకర్‌ను సంప్రదించినా స్పందన లేదు. దీంతో ఆ మొత్తం తాను చెల్లిస్తానంటూ బాధితులతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తం ముట్టిన తర్వాత కేసు ఉపసంహరించుకుంటామని బాధితులు సైబర్ ఠాణాకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment