నిజామాబాద్: గల్ఫ్ ఏజెంట్లు నయా స్కాంకు తెరలేపారు. గతంలో కొందరు నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసేవారు. మరికొందరు విజిట్ వీసాపై పంపించి.. పనిచూపించకుండా.. వర్క్ పర్మిట్ ఇప్పించకుండా మోసం చేసేవారు. తాజాగా కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారు. వీసాలు ఇప్పించి దుబా య్‌కు పిలిపించుకుని కొన్ని రోజుల పాటు తమ వద్ద ఉంచుకొని.. వీరి పేర్ల మీద క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకొని వారిని తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు.
దుబాయ్‌కు చెందిన క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంక్ సిబ్బంది ఈఏంఐలు చెల్లించాలని బెదిరింపులకు దిగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో తాము తీసుకోని రుణాలకు ఈఎంఐ లు ఎలా చెల్లిస్తామని బాధితులు మంగళవారం పోలీస్‌కమిషనర్ కల్మేశ్వర్‌ను ఆశ్రయించారు. స్పందించిన సీపీ వెంటనే విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్‌రాజును ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
దుబాయ్‌లో ఉద్యోగం కల్పిస్తామని ప్రతినెలా రూ. 40వేల నుంచి రూ. 50వేల వేతనంతో పాటు రూ. 50 లక్షల క్రెడిట్ కార్డు సౌకర్యం ఉంటుందని జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌కు చెందిన ఏజెంట్ పబ్బ భూమేశ్ అలియాస్ దండిగాళ్ల భూమేశ్ అలియాస్ భూమారెడ్డి సబ్ ఏజెంట్లను నమ్మబలికాడు. దీంతో డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన భోజారాం మరో ఇద్దరు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలకు చెందిన 82 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 6లక్షల చొప్పున వీసాకు వసూలు చేశారు. వీరి నుంచి వసూలు చేసిన సుమారు రూ. 5కోట్లను దఫాల వారీగా పబ్బ భూమేశ్ సూచించిన వారికి చెల్లించారు.
డొంకేశ్వర్ మండలం అన్నారంనకు చెందిన భోజారం నిజామాబాద్‌లోని శ్రీదేవి ట్రావెల్స్‌కు చెందిన బెజ్జం సుబ్బారెడ్డికి రూ. 2కోట్లను చెల్లించాడు. వెంటనే డబ్బులు చెల్లించినట్లు భోజారాం పబ్బ భూమేశ్‌కు వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ చేశారు. తర్వాత ఆర్మూర్‌కు చెందిన అరెపల్లి మోహన్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు రూ. 3కోట్లు భోజారం చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వీరికి దుబాయ్ విజిట్ వీసాలను దశల వారీగా ఇప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వీసాలు వచ్చిన బాధితులు గ్రూపులుగా దుబాయ్‌కి వెళ్లారు. వీరిని పబ్బ భూమేశ్ ఏర్పాటు చేసిన రూంలో ఉంచారు.. 82 మందిలో 30 మందికి మాత్రమే వర్క్ పర్మిట్ ఇప్పించి.. క్రెడిట్ కార్డులు ఇప్పించాడు.
బాధితుల క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు విత్‌డ్రా..
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 82 మందిలో 30 మందికి వర్క్ వీసాలు రావడంతో పబ్బ భూమేశ్ అక్కడి క్రెడిట్ కార్డు బ్యాంక్ సిబ్బందితో అరబ్బీ, ఇంగ్లిష్‌లలో ఉన్న ఫారాలపై సంతకాలు చేయించాడు. తన అడ్రస్‌పైనే క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అవి రాగానే వాటి నుంచి మరో రూ. 5 కోట్లు డ్రా చేసినట్లు బాధితులు సీపీకి విన్నవించారు. క్రెడిట్ కార్డులకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిఫాల్ట్ కావడంతో పబ్బ భూమేశ్ 30 మందిని ఇండియా వెళ్లిపోవాలని.. వీసా సమస్య తలెత్తిందని.. లేదంటే జైలుకు వెళ్తారని భయభాంత్రులకు గురిచేశారు.
దీంతో బాధితులు భోజారాంనకు ఫోన్ చేసి తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో త్వరగా ఇండియాకు వెళ్తే.. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తిరిగి ఇచ్చేస్తానని పబ్బ భూమేశ్ బాధితులకు చెప్పి పంపించేశాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడు. అంతేకాకుండా దుబాయ్‌లోని క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకు సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు సీపీని ఆశ్రయించారు.
వైద్యానికి డబ్బులు లేక..
రూ. 6 లక్షలు చెల్లించిన ఓ గల్ఫ్ బాధితుడి కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక కొడుకును కాపాడుకోలేకపోయాడు. అలాగే మరో బాధితుడు అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని సబ్ ఏజెంట్ భోజారం తెలిపారు. బాధితులు చెల్లించిన రూ. 5కోట్లు వారికి అందేలా చూడాలని సీపీ కల్మేశ్వర్‌ను కోరినట్లు భోజారం చెప్పారు. నాలుగు నెలల క్రితం ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
విచారణ చేపడుతున్నాం
సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు గల్ఫ్‌లో జరిగిన మోసంపై విచారణ చేపట్టాం. సబ్ ఏజెంట్ భోజారం డబ్బులు ఎవరికి ఇచ్చారనే దానిపై విచారిస్తాం. బెజ్జం సుబ్బారెడ్డి, ఆరెపల్లి మహేశ్, ఆరెపల్లి నరేశ్, మోచ(బాడ్సి) రాజులకు డబ్బులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని అంశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేని ఏజెంట్లకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు. – రాజశేఖరరాజు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment