బయో ఆగ్రానిక్, బయో డీగ్రేడబుల్ బ్యాటరీల తయారీ కోసం ‘నెక్సెస్ పవర్’ అనే కంపెనీ స్థాపించి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్(ఈవీ) మార్కెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా నిలుస్తున్న ట్విన్ సిస్టర్స్ నిషిత బాలియర్ సింగ్ (23), నికిత బాలియర్ సింగ్ (23) పరిచయం... భువనేశ్వర్ (ఒడిశా)కు చెందిన ట్విన్ సిస్టర్స్ నిషిత, నికితలు ‘నలుగురిలాగే నా ఆలోచన కూడా’ అనుకోకుండా కొత్తగా ఆలోచించడం అలవాటు. ఆ అలవాటే వారిని తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ యువప్రతిభావంతుల జాబితాలో చోటుదక్కేలా చేసింది.
2015లోనే ‘ఫెలిస్ లియో వెంచర్స్’ యాప్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ సర్వీస్‌ను ప్రారంభించి విజయకేతనం ఎగరేశారు. ఇరవై రెండేళ్ల వయసులో పర్యావరణానికి హాని కలిగించని ‘హీటింగ్’ ‘కూలింగ్’ విధానాన్ని అభివృద్ధి పరిచారు. పరిశ్రమలలో సంప్రదాయమైన బాయిలర్లు, ఏసీల స్థానంలో వీటిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి నష్టం జరగకపోవడమే కాకుండా ఏటా 25 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అదేమిటోగానీ ఒక పుస్తకం మాత్రం ఎలక్ట్రానిక్ వెహికిల్(ఇవీ) మార్కెట్‌కు ఊతం ఇచ్చే ‘నెక్సెస్ పవర్’ పుట్టుకకు కారణం అయింది.
ఆ రాత్రి...
ఆమాట ఈమాట మాట్లాడుకుంటున్న క్రమంలో వారి దృష్టిలో ఒక పాత బయోకెమిస్ట్రీ పుస్తకం పడింది. దాన్ని పూర్తిగా తిరిగేసి చర్చించడం మొదలు పెట్టారు. ఆ చర్చ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వైపు వెళ్లింది. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ స్థాపించాలనుకున్నారు. అయితే మార్కెట్ స్టడీలో వారికి తెలిసిన విషయం ఏమిటంటే పాశ్చాత్యదేశాలతో పోల్చితే మన దేశంలో ‘ఇవీ మార్కెట్’ వేగం చాలా తక్కువని. కారణాలు ఏమిటి? అనే విశ్లేషణలో వారికి ప్రధానంగా కనిపించిన కారణం: బ్యాటరీ. రెండు, మూడు గంటలు రీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటివి మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ముందు బ్యాటరీ సమస్యకు పరిష్కారం వెదికితే ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికిల్ మార్కెట్ వేగం పెంచడం పెద్ద కష్టం కాదనే నిర్ణయానికి వచ్చారు. బ్యాటరీ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించారు.
ఈ క్రమంలోనే ప్రోటిన్ బేస్డ్ బ్యాటరీలు తయారుచేయడానికి 2019లో ‘నెక్సెస్ పవర్’ కంపెనీ స్థాపించారు. వ్యవసాయ వ్యర్థాలతో ఇక్కడ తయారయ్యే ప్రొటీన్ బేస్డ్ బ్యాటరీలను పది నిమిషాల వ్యవధిలోనే రీచార్జ్ చేయవచ్చు. 450 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మరో విషయం ఏమిటంటే తమ వ్యవసాయ వ్యర్థాలను అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేతికి అందుతుంది. ఇద్దరితో మొదలైన ‘నెక్సెస్ పవర్’ ఇప్పుడు 11 మంది సభ్యుల కంపెనీగా మారింది. ఈ కంపెనీ రూపొందించే వేగవంతమైన చార్జింగ్, పర్యావరణ హితమైన బ్యాటరీలు వచ్చే సంవత్సరం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
‘ఎప్పుడూ ఒకేరకమైన విషయాల గురించి కాకుండా కొత్త విషయాల గురించి ఆలోచించడం ఇష్టం’ అని చెబుతున్న ఈ సోదరీమణులు ‘యంగ్ గ్లోబల్ అంబసిడర్’ ‘ఇనవెటివ్ ఎంటర్‌ప్రైజేస్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్స్‌తో పాటు ఎన్నో అవార్డ్‌లు సొంతం చేసుకున్నారు. స్కూలు, కాలేజీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, విజయం వైపు నడిపించడానికి వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ స్టడీ ప్రకారం మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వెహికిల్స్ మార్కెట్‌కు ఉజ్వలభవిష్యత్ ఉంది. ‘నెక్సెస్ పవర్’ వినూత్న ఆవిష్కణలతో ఆ మార్కెట్ వేగం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
చదవండి:
ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?
Comments
Please login to add a commentAdd a comment