
ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఒక కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ అవమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో జరిగింది. కాగా, పోలసర గ్రామానికి చెందిన బిమల్ నాయక్(45), చిరికిపాడ సాసన్ వద్ద మంత్రాలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. అందుకే, గడిచిన నెలన్నర కాలంలో సాసన్‌లో.. 6 గురు చనిపోయారని తెలిపారు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్తులంతా కలిసి నిన్న(ఆదివారం) మూకుమ్మడిగా బిమల్‌నాయక్ ఇంటిపై దాడిచేశారు. అతడిని బయటకులాగి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వినలేదు. గ్రామస్తుల దాడిలో నాయక్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చిరికిపాడ పోలీసులు నాయక్‌ను, అతని కుటుంబ సభ్యులను బెర్హంపూర్‌లోని ఎంకేసీఐ ఆసుపత్రికి తరలించారు.
ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు 30 మంది గ్రామస్తులపై కేసును నమోదుచేసి, 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని బెర్హంపూర్ పోలీసు అధికారి సూర్యమణి ప్రధాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment