భువనేశ్వర్: రాష్ట్రంలో పలుచోట్ల కాలవైశాఖి మంగళవారం బీభత్సం సృష్టించింది. మరో 24 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని స్థానిక వాతావరణ కేంద్రం సమాచారం జారీ చేసింది. ఈ వ్యవధిలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పిడుగులు పడే సంకేతాలు జారీ చేసింది.ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో కాల వైశాఖి తాండవించనున్న సంకేతాలు ఉన్నాయి.
బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడ, కటక్, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, కొందమాల్, బౌధ్, ఢెంకనాల్, మయూర్‌భంజ్ జిల్లాలకు ఆరంజ్ వార్నింగ్, సుదరగడ్, ఝార్సుగుడ, బర్‌గడ్, సంబల్‌పూర్, దేవ్‌గడ్, అనుగుల్, కెంజొహార్, సువర్ణపూర్, నువాపడ, బలంగీరు, కలహండి, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
పిడుగులు పడి ముగ్గురి మృతి
3 జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక మహిళ ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొంతోంది. బలంగీరు జిల్లాలో ఇద్దరు మహిళలు స్నానం చేసేందుకు చెరువుకి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో పాణిబుడి మేష్వా (65) ఘటనా స్థలంలోనే మరణించింది. భూమిసుత మేష్వా అనే మహిళ పిడుగుపడి కాలిపోవడంతో ప్రాణాపాయ పరిస్థితిలో స్థానిక భీమభోయి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కెంజొహార్ జిల్లాలోని కాశీపూర్ గ్రామంలో సాగు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా రాయిదాస్ ముండా అనే రైతు పిడుగు పడి మరణించాడు. అనుగుల్ జిల్లా అఠొమల్లిక్ ప్రాంతంలో ఇద్దరు పిడుగుపాటుకు గురికాగా ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మరణించాడు. మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలవైశాఖి ప్రభావంతో 20 మిల్లీవీుటర్లు పైబడిన వర్షపాతం రాష్ట్రంలో 9 చోట్ల నమోదైంది.
చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి
Comments
Please login to add a commentAdd a comment