వాతావరణ సంక్షోభం సముద్రాలనూ అల్లకల్లోలం చేస్తోంది. వినాశకరమైన మార్పులకు కారణమవుతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు సముద్ర మట్టాల పెరుగుదల ఊపందుకుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ ధోరణి నానాటికీ కలవరపెడుతోంది. ఏకంగా ‘ప్రపంచ విపత్తు’ స్థాయికి చేరి పసిఫిక్ దీవుల అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది! దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మనిషి చేజేతులా తెచి్చపెట్టుకున్న సంక్షోభమిది. ఇది గనుక పరాకాష్టకు చేరితే మనం సురక్షితంగా బయటపడేందుకు లైఫ్‌బోట్ కూడా మిగలదు’’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ప్రపంచం స్పందించాలని పిలుపునిచ్చారు...
పసిఫిక్ ద్వీప దేశం టోంగా రాజధాని నుకులోఫాలో ఇటీవల పసిఫిక్ ఐలండ్స్ ఫోరం సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచే, ‘మన సముద్రాలను కాపాడండి (సేవ్ అవర్ సీస్)’ పేరిట అంతర్జాతీయ స్థాయి పెనుప్రమాద హెచ్చరిక (గ్లోబల్ ఎస్‌ఓఎస్)ను ఐరాస చీఫ్ విడుదల చేశారు. ‘‘పసిఫిక్ ఉప్పొంగిపోతోంది. అక్కడి బలహీన దేశాలు అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆర్థిక సాయాన్ని, మద్దతును భారీగా పెంచండి’’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
మూడింతల ముప్పు!
నైరుతీ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1980 నుంచి ప్రపంచ సగటు కంటే ఏకంగా మూడు రెట్లు వేగంగా పెరిగినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేర్కొంది. దీంతో గత 30 ఏళ్లలో అక్కడ సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు పెరిగాయట. సముద్ర వడగాలులూ రెట్టింపయ్యాయి. మున్ముందు అవి మరింత తీవ్రంగా, మరింత సుదీర్ఘకాలం కొనసాగుతాయి’’ అని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన ఉద్గారాల తాలూకు వేడిలో ఏకంగా 90 శాతం సముద్రాలే గ్రహించాయని నివేదిక వెల్లడించింది. దాంతో సముద్రపు ఉష్ణోగ్రతలు, ఫలితంగా సముద్ర మట్టం ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు, భారీ మంచు పలకలు ఇందుకు తోడవుతున్నాయి!
‘‘మున్ముందు సముద్రాలు కోలుకోలేని మార్పులకు లోనవుతాయి. మనుగడ కోసం మనిషి చేస్తున్న వినాశనమే
ఈ ముప్పుకు కారణం’’
– డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో
‘‘ఇప్పుడు పసిఫిక్ వంతు. మున్ముందు అన్ని సముద్రాలకూ ఈ ముప్పు పొంచి ఉంది. ఇప్పుడే కళ్లు తెరిచి పసిఫిక్‌ను కాపాడు కుంటే మొత్తం మానవాళినీ కాపాడుకున్నవాళ్లం అవుతాం. అందుకే ప్రపంచం పసిఫిక్ వైపు చూడాలి. ఈ హెచ్చరికల్ని వినాలి’’
– ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్
మహానగరాలకూడేంజర్ బెల్స్...
సముద్రమట్టం పెంపు తాలూకు ముప్పు ప్రభావం ప్రస్తుతానికి పసిఫిక్ ద్వీపాలపైనే కన్పిస్తున్నా అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా లోతట్టు ద్వీపాలన్నింటికీ పాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోతున్న తీర ప్రాంత మహా నగరాలు, ఉష్ణమండల వ్యవసాయ డెల్టాలు తదితరాల భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్నట్టేనని అంటున్నారు. ‘‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచాలి. అంతకంటే ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపుకు పరిమితం చేయడంపై మరింత దృష్టి పెట్టాలి. అందుకోసం కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించాలి’’ అని రెండు నివేదికలూ ముక్త కంఠంతో పేర్కొన్నాయి.
ఆ దీవులకు పెను ముప్పే..
వాతావరణ సంక్షోభం, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల పసిఫిక్‌కు త్వరలోనే పెను ముప్పు పొంచి ఉందని ఐరాస వాతావరణ కార్యాచరణ బృందం మంగళవారం ప్రచురించిన రెండో నివేదికలో కూడా పేర్కొంది. అందులో ఏం చెప్పిందంటే...
👉 దీనివల్ల తువలు, మార్షల్ ఐలాండ్స్ వంటి పసిఫిక్ దీవులు ప్రభావితమవుతున్నాయి.
👉 సముద్ర తాపం, సముద్ర మట్టం పెరుగుదల, ఆమ్లీకరణ... ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాయి.
👉 ఫలితంగా పర్యావరణ వ్యవస్థలు, పంటలు దెబ్బ తినడమే గాక మంచినీటి వనరుల కలుషితమవుతున్నాయి.
👉 జీవనోపాధి కూడా భారీగా దెబ్బ తింటోంది.
👉 తీవ్ర వరదలు, ఉష్ణమండల తుఫాన్లు ఇప్పటికే ఆ ద్వీపాలను నాశనం చేస్తున్నాయి.
👉 2023లో 34 భారీ తుఫాన్లు, వరద సంబంధిత ఘటనలు భారీ సంఖ్యలో మరణాలకు దారితీశాయి.
👉 ఈ ప్రాంతంలో ఏకంగా 2.5 కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
👉 సముద్ర మట్టానికి కేవలం 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉన్న పసిఫిక్ ప్రాంతంలో 90 శాతం ప్రజలు తీరానికి 5 కి.మీ. పరిధిలోనే నివసిస్తున్నారు.
👉 ఇక్కడి మౌలిక సదుపాయాల్లో సగానికి సగం సముద్రానికి 500 మీటర్ల లోపలే ఉన్నాయి.
👉 ప్రస్తుత 3 డిగ్రీల సెల్సియస్ వేడి పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి పసిఫిక్ దీవుల వద్ద సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది.
👉 ఏటా 30 రోజులకు పైగా తీరప్రాంత వరదలు ముంచెత్తుతాయి.
👉 సముద్ర మట్టం పెరుగుదల అనుకున్న దానికంటే వేగవంతమవుతుంది.
👉 ఫలితంగా పసిఫిక్ దీవులకు ముంపు ముప్పు కూడా వేగవంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment