
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై పోరాటానికి వేగవంతమైన పటిష్ట కార్యాచరణ అవసరమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతటా ఈ కార్యాచరణ పెద్ద ఎత్తున సాగాలని సూచించారు. ఈ సవాలును ఎదిరించే విషయంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా గురువారం నిర్వహించిన వర్చవల్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 40 దేశాల అధినేతలు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కరోనా అనంతరం ఆర్థిక రథం మళ్లీ పట్టాలెక్కాలంటే మూలాలకు మళ్లడం (బ్యాక్ టు బేసిక్స్)అవసరమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను కలిసి ‘ఇండియా–యూఎస్ క్లైమేట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్‌నర్‌షిప్’ను ప్రారంభించినట్లు తెలిపారు. వాతావరణ మార్పులు అందరినీ భయపెడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రకృతి మాత ఇక ఎంతో కాలం వేచి చూడలేదని, మనకు హరిత గ్రహం (గ్రీన్ ప్లానెట్) కావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సులో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment