Climate Change Performance Index
-
Global Warming: ఇలాగయితే ముంబై, కాకినాడ కనుమరుగే!
కడ్తాల్: గ్లోబల్ వార్మింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముంబై, కాకినాడ వంటి తీర ప్రాంతాలు భవిష్యత్తులో కనిపించవని పూర్తిగా నీట మునిగిపోతాయని ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఆన్మాస్పల్లిలో ఉన్న ఎర్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్లాస్కో నగరంలో 2021 అక్టోబరు 31 నుంచి నవంబరు 12 పర్యావరణ మార్పులపై జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)-26వ అంతర్జాతీయ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్యారిస్ హామీ ఏమైంది ? 2005లో జరిగిన ప్యారిస్ సమావేశంలో క్లైమెట్ ఛేంజ్‌పై విస్త్రృతంగా చర్చించారని ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి గుర్తు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న 194 దేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు అంగీకరించాయన్నారు. అందులో భాగంగా 2005లో వెలువడుతున్న కర్బణ ఉద్ఘారాల్లో 33 శాతం నుంచి 35 శాతం వరకు తగ్గిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ వాస్తవంలో ప్రభుత్వంలో ఈ పని చేయడం లేదన్నారు. అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చిన హామీలకు దేశీయంగా అవి అమలవుతున్న తీరుకు పొంతన లేదన్నారు. దుష్పరిణామాలు ప్యారిస్ సమావేశంలో 2 సెల్సియస్ డిగ్రీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అది అమలు చేయడంలో విఫలమయ్యాయని ఫలితంగా ఇప్పటికే భూవాతావరణం 1.12 సెల్సియస్ డిగ్రీలు వేడెక్కిందన్నారు. ఇటీవల కాలంలో కెనడా, ఆస్ట్రేలియా, సైబీరియాలో కార్చిర్చులు చెలరేగి లక్షలాది హెక్టార్ల అటవీ నాశనమైందని, ఊర్లకు ఊర్లే తగలబడి పోయాయన్నారు. అంతేకాదు మన దేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తిన విషయాన్ని ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి గుర్తు చేశారు. ఈ దుష్పరిణామాలకు గ్లోబల్ వార్మింగే కారణమన్నారు. ఒత్తిడి తేవాలి క్లైమెట్ ఛేంజ్ విషయంలో మన నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే ఇరవై ఏళ్లలో 2 సెల్సియస్ డిగ్రీల వరకు భూవాతావరణం వేడేక్కే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే తీవ్ర ఉత్పతాలు సంభవిస్తాయని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలైన కాకినాడ, ముంబై, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ వంటివి ఉండబోవన్నారు. ఈ విపత్తు రాకుండా నివారించాలంటే భూతాపాన్ని 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాల మీద పౌర సమాజం ఒత్తిడి తేవాలని సూచించారు. 36 లక్షల మొక్కలు వాతావరణ సమతుల్యత లక్ష్యంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అన్నారు. గడిచిన పదకొండేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల పరిధిలో 36 లక్షల మొక్కలను నాటినట్టు తెలిపారు. తూర్పు కనుమల పరిరక్షణకు సీజీఆర్ తరఫున నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. భావితరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి వాతావరణ ఇవ్వాల్సిన అవవసరం ఉందని సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎర్త్ సెంటర్ ప్రాంతీయంగా జరుగుతున్న వాతావరణ మార్పులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు కడ్తాల్ సమీపంలో ఎర్త్ సెంటర్‌ని ఏర్పాటు చేశామని బయెడైవర్సిటీ నిపుణులు తులసీరావు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యంతో పాటు పర్యావరణ చైతన్యం కూడా పెరగాల్సి ఉందన్నారు. గ్లాస్కో సమావేశ వివరాలను ఎప్పటిప్పడు అందించేందుకు ఎర్త్‌సెంటర్‌లో ప్రత్యేక న్యూస్‌రూమ్ ఏర్పాటు చేసినట్టు ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయి భాస్కర్‌రెడ్డి తెలిపారు. సీజీఆర్ ఒక్కటే పర్యావరణం, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దేశం మొత్తం మీద స్థిరంగా పని చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఒక్కటే ఉందని ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రజలపై ఇప్పటికే పడిందన్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై ప్రజలు తమంతట తాముగా గొంతెత్తే సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా గ్లాస్కోలో జరుగుతున్న సీఓపీ 26 సమావేశ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు సీజీఆర్ తరఫున అందిస్తామన్నారు. -
‘వాతావరణ’ పెట్టుబడులు.. టాప్ 10 దేశాల్లో భారత్..
లండన్: గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో నిల్చింది. దేశీ క్లైమేట్ టెక్ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్ ఒప్పందం అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్ అండ్ పార్ట్నర్స్, డీల్రూమ్డాట్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నంబర్ వన్ అమెరికా తాజా నివేదిక ప్రకారం ప్యారిస్ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ టెక్ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్ 10 దేశాల్లో 48 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్ డాలర్లతో స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది. పర్యావరణంపై బహుళజాతి బ్యాంకులు దృష్టి పెట్టాలి - నిర్మాలాసీతారామన్ న్యూఢిల్లీ: పర్యావరణం, తత్సబంధ ప్రాజెక్టులు, పురోగతిపై ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వంటి బహుళజాతి బ్యాంకులు దృష్టి సారించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఇందుకు ప్రైవేటు మూలధనం సమకూర్చడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీకి భారత్ అన్ని విషయాల్లో తగిన సహకారం అందిస్తుందన్నారు. రెసిడెంట్ బోర్డ్, రీజినల్ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐఐబీకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బ్యాంక్ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందన్నారు. -
వాతావరణ పోరుపై పటిష్ట కార్యాచరణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై పోరాటానికి వేగవంతమైన పటిష్ట కార్యాచరణ అవసరమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతటా ఈ కార్యాచరణ పెద్ద ఎత్తున సాగాలని సూచించారు. ఈ సవాలును ఎదిరించే విషయంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా గురువారం నిర్వహించిన వర్చవల్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 40 దేశాల అధినేతలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కరోనా అనంతరం ఆర్థిక రథం మళ్లీ పట్టాలెక్కాలంటే మూలాలకు మళ్లడం (బ్యాక్ టు బేసిక్స్)అవసరమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను కలిసి ‘ఇండియా–యూఎస్ క్లైమేట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్’ను ప్రారంభించినట్లు తెలిపారు. వాతావరణ మార్పులు అందరినీ భయపెడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రకృతి మాత ఇక ఎంతో కాలం వేచి చూడలేదని, మనకు హరిత గ్రహం (గ్రీన్ ప్లానెట్) కావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సులో వ్యాఖ్యానించారు. -
‘పర్యావరణ’ సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు
మరాకేస్(మొరాకో): పర్యావరణ మార్పుల పనితీరు సూచీ(సీసీపీఐ)లో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి 20 ర్యాంకుకు చేరింది. 58 దేశాలకు ‘జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెటవర్క్ యూరప్’ విడుదల చేసిన 2016 సూచీ.. వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలు పాటించాలని సూచించింది. ‘ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుంది. పునరుత్పాదక ఇంధన వినియోగంలో స్కోరు మెరుగుపడింది. బొగ్గు నుంచిసాంప్రదాయేతర వనరుల్లోకి పెట్టుబడులు మళ్లించడం మంచి చేస్తుంది. ఉద్గారాలు తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, బ్రెజిల్, చైనాల వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటోంది’ అని పేర్కొంది.