World Earth Day
-
పది కాలాలు పదిలంగా ఉండాలంటే...
భూమి మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి ఆందోళన రానురానూ పెరుగుతున్నది. పర్యావరణ విధ్వంసం తగ్గించే ప్రయత్నాలు జరుగు తున్నా కూడా ప్రకృతి వనరుల భక్షణ మీద దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం కొనసాగడం వల్ల ఫలితాలు రాలేదు. ఈ రోజు అవే ఆర్థిక వ్యవస్థలు కాలుష్య దుష్పరిణామాల భారంతో కుప్పకూలుతున్నాయి. విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఆహార లేమి బాధిస్తున్నది. నీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. మానవ సమాజ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ప్రకృతి వనరుల సుస్థిర ఉపయోగంలో పాటించాల్సిన సమన్యాయం అంతకంతకూ కొరవడుతున్నది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా పరిణతి కలిగిన ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం ఉంది. అనేక రూపాలలో, అనేక విధాలుగా పుడమి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ సంక్షోభానికి దీటుగా అంతర్జాతీయ ప్రతిస్పందన ఉండాలనే ఆకాంక్ష ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది. అయితే ప్రభుత్వాల స్పందన చాలా నెమ్మదిగా ఉంది. భారతదేశం పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులు, ఇతర జలవనరులతో విలసిల్లుతోంది. 91,000 జాతులకు పైగా జంతువులు, 45,000 జాతుల మొక్కలకు ఇది నిలయం. వీటి ఉనికికి ముప్పు ఉంది. ఫలితంగా, ఆహార ఉత్పత్తికి విఘాతం కలుగు తున్నది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలు, సాలెపురుగులు, పగడాలు, చెట్లు మానవ మనుగడకు వివిధ పాత్రల ద్వారా దోహదపడుతున్నాయి. దాదాపు 1,000 జాతులు ప్రమాదంలో పడ్డాయి. ప్రాంతాల వారీగా, ఆయా పరిస్థితుల ప్రభావంతో క్రమంగా అంతరించి పోతున్నాయి. వీటిలో అనేకం ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్’లో చేర్చారు. వీటిని ఇప్పుడు కాపాడుకోలేకపోతే భూమిపై శాశ్వతంగా అదృశ్యమవుతాయి. పర్యావరణవాదుల ఒత్తిడి మేరకు 2015లో పారిస్‌లో 197 దేశా లకు చెందిన ప్రపంచ దేశాధినేతలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పారిస్ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించడం, 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం. పారిస్ ఒప్పందం మేరకు చేసిన వాగ్దానాలపై ప్రభుత్వాలు వేగంగా వ్యవహరిస్తే, వాతా వరణ మార్పుల వలన ఏర్పడుతున్న విపరిణామాలను నివారించ వచ్చు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే ప్రభుత్వ విధా నాలను నిలువరించడానికి కొన్ని వర్గాలు సర్వ ప్రయత్నాలు చేస్తు న్నాయి. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ‘సీఓపీ 26’లో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి శిలాజ ఇంధనాల మీద ఒప్పం దానికి రాకుండా, శిలాజ ఇంధనాల మీద అంతర్జాతీయ నిషేధం రాకుండా సఫలీకృతం అయినారు. విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో వాతావరణ మార్పుల గురించి ఏడాదికేడాది స్పష్టత వస్తున్నప్పటికీ, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు (కార్బన్ ఉద్గారాలు అధిక భాగం వాటివల్లే) శిలాజ ఇంధ నాల కోసం డ్రిల్లింగ్, బర్నింగ్ కొనసాగిస్తున్నాయి. శిలాజ ఇంధన వ్యవస్థ ద్వార లాభాలు పొందుతున్న సంస్థలు, వర్గాలు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి పుడమి భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి. ఈ సంవత్సరం పుడమి దినోత్సవ సందర్భంలో సుస్థిర భవి ష్యత్తు కొరకు పెట్టుబడులు పెంచాలని నినాదం ఇచ్చారు. ప్రధాన మైన మూల పరిష్కారాలు మూడున్నాయి. అన్ని దేశాలు అనుసరిం చాల్సిన మార్గాలు ఇవి. శిలాజ వనరులను భూమిలోనే ఉంచాలి. శిలాజ ఇంధనాలలో బొగ్గు, చమురు, సహజ వాయువు ఉన్నాయి. వీటిని వెలికితీసి కాల్చినకొద్దీ, పర్యావరణం మీద, పంచ భూతాల మీద దుష్ప్రభావం పెరుగుతున్నది. అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా శిలాజ ఇంధనాల నుండి ప్రత్యా మ్నాయ ఇంధనాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. పునరుత్పా దక శక్తిలో పెట్టుబడులు కూడా వేగంగా పెంచాలి. ప్రధాన ఇంధన వనరులను పరిశుభ్రమైన, పునరుత్పాదక శక్తిగా మార్చడం శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపడానికి ఉత్తమ మార్గం. వీటిలో సోలార్, విండ్, వేవ్, టైడల్, జియోథర్మల్ పవర్ వంటి వనరులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఈ మార్గాల ద్వారా చేసుకోవడం ఉత్తమమైన పరిష్కారం. పెట్రోల్, డీజిల్ వాహనాలు, విమానాలు, ఓడలు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తాయి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం, విమాన ప్రయాణాన్ని తగ్గించడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. సుస్థిర రవాణా వ్యవస్థకు మారడం చాలా అవసరం. రాజకీయ నాయకులు, పార్టీలు ఈ దిశగా ఆలోచన చేసే విధంగా పర్యావరణ స్పృహ పెంచుకున్న ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఎన్నికల వేళ పునరుత్పాదక శక్తి వనరుల మీద విధానాల మార్పునకై కృషి చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డై ఆక్సైడ్‌ను సహజంగా గ్రహించే వ్యవస్థలలో కీలకమైనవి రెండు: దట్టమైన అడవులు, సము ద్రాలు. అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించాలి. పచ్చదనాన్ని కాపాడితే, కాలుష్య ఉద్గారాలను ప్రకృతి పరిమితిలో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో దట్టమైన అడవులు కీలకం. వాటిని రక్షించడం ఒక ముఖ్యమైన వాతావరణ పరి ష్కారం. 30 నుంచి 100 ఏళ్ళ పైన వయసు గల చెట్లు చాలా ముఖ్యం. పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత పుడమి వాసుల మీద ఉన్నది. సముద్రాలు వాతావరణం నుండి పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. సముద్రాల జీవావరణ వ్యవస్థ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించే ఏకైక అతిపెద్ద పెట్టుబడి అవసరం లేని సహజ వ్యవస్థ. ఈ ప్రక్రియ పుడమి వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సముద్రాలలో ఉన్న జీవావరణ వ్యవస్థల మీద భూతాపం ప్రభావం కూడా ఉంటుంది. సముద్రాలు వేడెక్కడం వలన అందులోని కోట్లాది జీవాలు అతలాకుతలం అయ్యి, అంతరించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూ సీఓపీ 26లో ఈ వ్యవస్థ సంరక్షణ మీద చర్చ కూడా చేపట్టలేదు. పారిశ్రామికీకరణ, భూతాపాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్ర వేత్తలు చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు. విధానకర్తలు, పెట్టుబడి దారులు, కంపెనీలు డీకార్బనైజేషన్ మార్గంలో వెళ్ళడానికి కలిసి కట్టుగా పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవాలి. నూతన పారిశ్రామిక విప్లవం పర్యావరణహితంగా ఉండాలంటే, వనరుల దోపిడీతో కూడిన ప్రస్తుత పారిశ్రామిక ఉత్పత్తి మారాలి. అటువంటి మార్పు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న సాంప్రదాయ వస్తూత్పత్తి వ్యవస్థల ద్వారా సాధ్యం అవుతుంది. చేనేత వస్త్రోత్పత్తికి ఊతం ఇవ్వడం ద్వారా పర్యావరణం మీద దుష్ప్రభావం గణనీయంగా తగ్గ డంతో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. సహజ నూలు ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే ఆధునిక జౌళి పరిశ్రమ వల్ల పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలను సులభంగా తగ్గించవచ్చు. విని మయ జీవన శైలిలో తీవ్ర మార్పులు రావాలి. పరిశ్రమల ఉత్పత్తులను సమీక్షించి కాలుష్యాన్ని పెంచే వస్తువుల ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం ద్వారా నిరంతర కార్బన్ కాలుష్యం తగ్గించ వచ్చు. పుడమి సుస్థిరతకు చేపట్టవలసిన చర్యలు ధనిక దేశాలు, ధనిక వర్గాలు మొదలు పెట్టాలి. సుస్థిర మార్పు దిశగా చేయాల్సిన కార్యక్రమాలకు అత్యవసరమైన త్యాగాలు వాళ్ళు చెయ్యాలి. నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంది. కాలుష్య ఉద్గారాల వల్ల, భూతాపం పెరగడం వల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా పేద వర్గాల పైననే ఉంటున్నది. ఆహారం దొరకని అభాగ్యుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి, పుడమిని కాపాడు కోవడానికి అందరూ నడుం బిగించాలి. భూతాపం వల్ల ఏర్పడుతున్న సామాజిక ఆర్థిక సమస్యల పట్ల, వాటి పరిష్కారాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు, జీవ వైవిధ్య విస్తృతికి, ఆహార భద్రతకు, సహజ వనరుల ఉపయోగంలో సమన్యాయానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేసే దిశగా పరిణతి కలిగిన ప్రజలు ఈ పుడమి దినోత్సవ సందర్భంగా ముందుకు కదులుతారని ఆశిద్దాం. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు (నేడు ధరిత్రీ దినోత్సవం) -
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
వాతావరణ పోరుపై పటిష్ట కార్యాచరణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై పోరాటానికి వేగవంతమైన పటిష్ట కార్యాచరణ అవసరమని భారత ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతటా ఈ కార్యాచరణ పెద్ద ఎత్తున సాగాలని సూచించారు. ఈ సవాలును ఎదిరించే విషయంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై అగ్రరాజ్యం అమెరికా గురువారం నిర్వహించిన వర్చవల్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 40 దేశాల అధినేతలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కరోనా అనంతరం ఆర్థిక రథం మళ్లీ పట్టాలెక్కాలంటే మూలాలకు మళ్లడం (బ్యాక్ టు బేసిక్స్)అవసరమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాను కలిసి ‘ఇండియా–యూఎస్ క్లైమేట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్’ను ప్రారంభించినట్లు తెలిపారు. వాతావరణ మార్పులు అందరినీ భయపెడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రకృతి మాత ఇక ఎంతో కాలం వేచి చూడలేదని, మనకు హరిత గ్రహం (గ్రీన్ ప్లానెట్) కావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సదస్సులో వ్యాఖ్యానించారు. -
గ్లోబల్ ‘వార్నింగ్’! నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ముప్పు అని ఏళ్లుగా వింటునే ఉన్నాం.. నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ఈ సందర్భంగా ఓసారి మన ధరిత్రిపై ఓ లుక్కేద్దామా.. దాని ప్రస్తుత పరిస్థితి ఏంటో తరచి చూద్దామా.. పెనంపై కాల్చినట్లు.. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మొదట్లో కాస్త మెల్లగా మార్పు వచ్చినా.. గత ముప్పై నలభై ఏళ్లుగా వేడి వేగం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి (అంటే సుమారు 250 ఏళ్ల నుంచి) పరిశీలిస్తే.. టాప్–20 అత్యంత వేడి సంవత్సరాల్లో 19 సంవత్సరాలు 2001–2021 మధ్య నమోదైనవే. ఇప్పటివరకూ భూమ్మీద నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా 2020 నిలిచింది. 1981 నుంచి సగటున ఏటా 0.18 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. అంతకు ముందటితో పోలిస్తే ఇది రెండింతలు పెరుగుదల. మంచు మరుగుతోంది.. భూమి మీద మంచు కప్పి ఉండే ప్రాంతాల విస్తీర్ణం ఏటా పడిపోతోంది.భూమి ఉత్తర అర్ధభాగంలో మంచు ఏర్పడటం బాగా తగ్గిపోయిందని ఉపగ్రహ పరిశీలనలో గుర్తించారు. నిత్యం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలో ఏటా 15 వేల కోట్ల టన్నులు, గ్రీన్‌ల్యాండ్‌లో 27,800 కోట్ల టన్నుల మంచు కరిగిపోతోంది. హిమాలయాలు సహా ప్రపంచవ్యాప్తంగా పర్వ తాలపై హిమనీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రం పోటెత్తుతోంది.. భూమ్మీద మంచు కరిగిపోతుండటంతో ఏటా సముద్ర జలాల ఎత్తు పెరిగి.. భూభాగం మునిగిపోతోంది. సముద్రాలు 2006 నుంచి సగటున ఏటా 3.6 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. అంతకుముందటితో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. ఈ శతాబ్దం ముగిసే సమయం అంటే.. 2100 నాటికి సముద్ర జలాలు 35 సెంటీమీటర్లు, అంతకన్నాపైగా పెరుగుతాయని అంచనా. గత శతాబ్దంలో పెరిగింది 20 సెంటీమీటర్లే. నీళ్లు నిప్పులా మండుతున్నాయి.. భూమ్మీద 70 శాతం ఉపరితలం సముద్రాలదే. భూమిపై అదనంగా పెరిగిపోతున్న వేడిలో 90 శాతం వరకు సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో పైన సుమారు 100 మీటర్ల మేర నీటిపొర గత 40 ఏళ్లలో 0.33 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. అంతా కార్బన్‌డయాక్సైడే.. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 1958 నాటితో పోలిస్తే ఇప్పుడు 25 శాతం ఎక్కువగా ఉంది. 60 ఏళ్లతో పోల్చితే ఏటా కార్బన్ డయాక్సైడ్ పెరిగే శాతం ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. సముద్రంపై యాసిడ్ దాడి.. వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాౖMð్సడ్‌లో రోజు సగటున 2 కోట్ల టన్నుల మేర సముద్రాలు పీల్చుకుంటున్నాయి. దీనితో సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగిపోతోంది. పారిశ్రామిక విప్లవం వచ్చాక అంటే సుమారు గత 70, 80 ఏళ్లలో సముద్ర ఉపరితల జలాల ఆమ్లత్వం (యాసిడిటీ) 30 శాతం పెరిగింది. ఇది అంతకుముందటితో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల సముద్ర ప్రాణుల మనుగడపై ప్రభావం పడుతోంది. -
Earth Day: తల్లీ భూదేవి
తన మీద వొత్తిడి కలిగించినందుకే కర్ణుడిని భూమాత శపించిందట. భూమి ఇక పాపం మోయలేదు అనుకున్నప్పుడల్లా దేవదూతో, ప్రవక్తో ఉదయించారు రక్షణకు. ఒక నాగలి మొనకు సీతనే ఇచ్చింది ఈ తల్లి. తన కడుపున పంటలు, పాలుగారే నదులు మోసుకుంటూ తిరుగుతుంది రోజుకు 24 గంటలు. గోడ మీద పిల్లలు పిచ్చిగీతలు గీసినా ఒక అందం ఉంటుంది. కాని భూమి మీద మనిషి గీస్తున్న పిచ్చిగీతలు వినాశకరమైనవి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డా కాపాడుకోవాలి. ఇంట్లో ప్రతి తల్లి ఈ విషయమై పాఠం చెప్పాలి. వశం తప్పిన పిల్లాణ్ణి దండించైనా సరే దారికి తేవాలి. అందరి కోసం ధరిత్రి. ధరిత్రి కోసం అందరూ. పురాణాలు ఎప్పుడూ సంకేతాలలోనే మాట్లాడతాయి. ‘భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా అవతరించమని దేవుణ్ణి రుషులు మొరపెట్టుకున్నారని’ చెబుతాయి. భూమికి భారం పెరగకూడదని పురాణాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. భూమి క్షోభ పడకూడదని కూడా చెబుతూ వచ్చాయి. భూమ్మీద నేరాలు, ఘోరాలు, పాపాలు పెరిగినప్పుడు భూమి రోదిస్తుంది. ఆ రోదన మంచిది కాదు. కనుక ఆ పాపాల్ని రూపుమాపే అవతారపురుషులు అవసరమవుతారు. ఇక్కడ పాపాలు అంటే మనిషికి అపకారం చేసే పాపాలు మాత్రమే కాదు. ప్రకృతికి అపకారం చేసే పాపాలు కూడా. ఇవాళ భూమ్మీద ప్రకృతి పరంగా పెరిగిన పాపాల కంటే మించి పాపాలు లేవు. ప్రకృతి వెంటనే తిరిగి మాట్లాడదని, వెంటనే తిరిగి ప్రతీకారం తీర్చుకోదనే ధైర్యంతో మనిషి ఇది చేస్తాడు. చెట్టును నరికితే చెట్టు వెంటనే గొడ్డలి పట్టుకుని వెంట పడదు. నదికి అడ్డంగా ఆనకట్ట కడితే నది బయటకు వినపడేలా శాపాలు పెట్టదు. పర్వతాలను పిండి పిండి చేసి చదును చేస్తే అవి కన్నెర్ర చేస్తున్నట్టు కనిపించవు. కాని ఒకరోజు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు శిలల కింద నక్కి ఉండాల్సిన విష క్రిములు బయటపడి మనుషుల మీద దాడి చేస్తాయి. సముద్రాల కింద భూకంపాలు వచ్చి అంతులేని జలరాశి భూమిని ముంచెత్తుతుంది. నదులు ఉగ్రరూపం ధరించి ఊళ్లలోకి వస్తాయి. పర్వతాలు తమ కొండ చరియలు కూల్చి దారులు మూసేస్తాయి. అడవులు తమకు తామే ఎండిపోతాయి. నేల తడారిపోయి లోలోపల ముడుచుకుపోతుంది. మన దగ్గర డబ్బుంటుంది.. నీరు ఉండదు. డబ్బుంటుంది.. తిండి ఉండదు. డబ్బుంటుంది.. మంచి గాలి ఉండదు. భూమి తాలూకు సకల సరంజామాను పాడు చేసి భూమ్మీద ఉండాలని మనిషి మాత్రమే అనుకుంటాడు. అది ఏ తార్కిక శాస్త్రం ప్రకారం కూడా సాధ్యం కాదు. భూమికి నువ్వు గౌరవం ఇస్తే భూమి నీకు జీవితం ఇస్తుంది. తల్లి భూదేవి జీవం ఇచ్చేది ఏదైనా తల్లే. భూమి జీవం ఇస్తుంది. విత్తు వేస్తే ఫలం ఇస్తుంది. లోతుకు తవ్వితే జలం ఇస్తుంది. నీ నివాసపు గోడకు గుణాద్రం అవుతుంది. నీ ప్రయాణానికి వీపు అవుతుంది. నీ సమూహానికి ఊరు అవుతుంది. తల్లి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. బిడ్డలకు పచ్చటి చేల తోడు ఇస్తుంది. అందుకే భూమిని మనిషి తల్లిగా చేసుకున్నాడు. తల్లిగా ఆరాధించాడు. కాని క్రమక్రమంగా నేటి కొందరు కొడుకులకు మల్లే ఆ తల్లి గొప్పదనాన్ని మరిచాడు. ఆమె పట్ల చూపించాల్సిన ప్రేమను మరిచాడు. తల్లి ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా దాటే స్థితికి తెచ్చాడు. తల్లి ఏమంటుంది? భూమి తల్లి చెప్పేది మనిషి విననపుడు ప్రతి స్త్రీ భూమితల్లిగా మారి కుటుంబం నుంచి భూమి పట్ల ఎరుక కలిగించే సంస్కారాన్ని పాదు చేయాలి. పిల్లలకు మొక్కలు నాటడం నేర్పాలి. నీరు వృధా చేయకపోవడం నేర్పాలి. విద్యుత్తును ఆదా చేయడం నేర్పాలి. కాగితాన్ని వృధా చేయకూడదని నేర్పాలి. పరిసరాలు మురికి మయం చేయకూడదని నేర్పాలి. అనవసర ఇంధనం వృథా చేసే పద్ధతులను పరిహరించాలని చెప్పాలి. కారు అవసరమే. సైకిల్ తొక్కడం కూడా చాలా అవసరం అని తల్లి చెప్పాలి. ఏసి అవసరమే. కాని కిటికి తెరిచి ఆ వచ్చే గాలికి సహించేంత వేడిని సహించడం కూడా అవసరమే అని చెప్పాలి. ఆహార దుబారా, దుస్తుల దుబారా, ప్లాస్టిక్ దుబారా ఇవన్నీ తగ్గించి తద్వారా భూమి తల్లికి భారం తగ్గించాలని చెప్పడం అవసరమే అని చెప్పాలి. అమ్మ చెప్తేనే కొన్ని మాటలు చెవికి ఎక్కుతాయి. కొన్నిసార్లు అమ్మ గట్టిగా చెప్తే. ఆ తల్లి ఆదర్శం ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. అందరూ వచ్చి అక్కడి పేపర్ ప్లేట్లను తీసుకుని భోజనం చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఆహ్వానం అందుకున్న ఒక తల్లి తన భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఒక సంచిని తోడుగా తెచ్చింది. ఆ సంచిలో నాలుగు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లేట్లలో తను, భర్త, ఇద్దరు పిల్లలు భోం చేశారు. వారు ఎంత తినగలరో అంతే ప్లేట్లలో పెట్టుకున్నారు. భోజనం పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు అవసరం లేకుండా ఆ ప్లేట్లు శుభ్రమయ్యాయి. తిరిగి ఆ స్టీల్ ప్లేట్లను వారు సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. వాళ్లు నాలుగు పేపర్ ప్లేట్ల వృధాను తగ్గించారు. తిన్నంతే తినడం వల్ల ఆహార దుబారా, తక్కువ నీటిని వాడటం వల్ల నీటి దుబారా తగ్గించారు. ఇవి చిన్న ప్రయత్నాలు. కాని ఇవి మొత్తం భూమి మీద భారం తగ్గించేవే. ఆ నాలుగు పేపర్ ప్లేట్లకు ఎంత చెట్టు గుజ్జు అవసరం. అలా అందరూ చేస్తే ఎంత అడవి మిగులుతుంది. ఆలోచించాలి. అంటే ప్రతి చిన్న పనిలోనూ భూమికి సంబంధించిన ఎరుక ఉండాలి. ఈ పని భూమికి భారం అవుతుందా మేలు అవుతుందా అనేది ఆలోచించాలి. తల్లులే జాతికి సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. భూమి తల్లిని కాపాడుకోవాలనే సంస్కారాన్ని కూడా వారి ఒడి నుంచి తొలిపాఠంగా అందించాలి. అది నేటి నుంచే మొదలు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్!
సాక్షి, హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకుంటే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హాని వల్లేనని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్లు సోకడం ముమ్మరమవుతుందనేది మహ్మమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు. (భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ) మానవ తప్పిదాల వల్లే వైరస్లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పర్యావరణ విధ్వంసంతోనే గతంలో మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. (పుడమి తల్లికి ప్రణామం) భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని మంత్రి అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ‘చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్కలను నాటండి’ అని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. (వరమా.. శాపమా!) -
భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని ఈ భూమి మీద నుంచి తరిమికొట్టడానికి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం భూమాతకి కృతజ్ఞతలు తెలుపుదామని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ‘అపారమైన ప్రేమతో సమస్త జీవకోటిని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాతకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనకు రక్షణ కల్పిస్తున్న భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భూగ్రహాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, అంత్యంత శ్రేయస్కరంగా ఉండేలా చూసుకుంటామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని ప్రధాని పిలుపునిచ్చారు. (జన విశ్వాసమే మోదీ ఆయుధం) 1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగిందని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రధాని పేర్కొన్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. (పుడమి తల్లికి ప్రణామం) On International Day of Mother Earth, we all express gratitude to our planet for the abundance of care & compassion. Let us pledge to work towards a cleaner, healthier & more prosperous planet. A shout out to all those working at the forefront to defeat COVID-19. #EarthDay2020 — Narendra Modi (@narendramodi) April 22, 2020 ప్రకృతిని ప్రేమిద్దాం: ఉప రాష్ట్రపతి ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నేలను, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలి. మన పెద్దలు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని, యథావిధిగా మన ముందు తరాలకు అందించేందుకు ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉంటూనే ప్రకృతితో మమేకమయ్యే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పునరంకితమౌదాం.’ అని పిలుపునిచ్చారు. -
అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్’ పంటలు!
ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్ జల్’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు. కూరగాయలు.. పండ్లు.. ముంబై నగరంలోని మాజ్గవ్ టెర్రస్ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు, బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి. ఇతర భవనాల టెర్రస్లపైనా... మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్లపైనా మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా. అపార్ట్మెంట్లో అందరి అనుమతితోనే.. వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్ లీవ్స్ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. . – డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీ, ముంబై ముంబైలో అర్బన్ లీవ్స్ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్ – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
సైకిల్‌పై సవారీ
గచ్చిబౌలి,న్యూస్‌లైన్: ‘నేను మంచి రన్నర్‌ని మాత్రమే. సైకిల్ రైడ్‌లో ఎప్పుడూ పాల్గొనలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువ హీరో రామ్‌చరణ్. ‘వరల్డ్ ఎర్త్ డే’ పురస్కరించుకొని గచ్చిబౌలి బైక్ స్టేషన్ వద్ద హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్‌ను రామ్‌చరణ్ ప్రారంభించాడు. ‘బయటకు వెళ్లేప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా ఇంట్లో లైట్లు ఆపి విద్యుత్ ఆదా చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంబాసిడర్‌గా ఉన్న నేను పర్యావరణ పరిరక్షణకు ఏం చేయడానికైనా సిద్ధం’ అని రామ్‌చరణ్ వెల్లడించాడు. హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, శోభన కామినేని, హెచ్‌బీసీ చైర్మన్ డీవీ మనోహర్, చిరక్ పబ్లిక్ స్కూల్ ఎండీ రత్నారెడ్డి పాల్గొన్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ వరకు సాగిన సైకిల్ రైడ్ తిరిగి బైక్ స్టేషన్ వద్ద ముగిసింది.