సైకిల్‌పై సవారీ
గచ్చిబౌలి,న్యూస్‌లైన్: ‘నేను మంచి రన్నర్‌ని మాత్రమే. సైకిల్ రైడ్‌లో ఎప్పుడూ పాల్గొనలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువ హీరో రామ్‌చరణ్. ‘వరల్డ్ ఎర్త్ డే’ పురస్కరించుకొని గచ్చిబౌలి బైక్ స్టేషన్ వద్ద హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్‌ను రామ్‌చరణ్ ప్రారంభించాడు. ‘బయటకు వెళ్లేప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా ఇంట్లో లైట్లు ఆపి విద్యుత్ ఆదా చేయాలి.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంబాసిడర్‌గా ఉన్న నేను పర్యావరణ పరిరక్షణకు ఏం చేయడానికైనా సిద్ధం’ అని రామ్‌చరణ్ వెల్లడించాడు. హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, శోభన కామినేని, హెచ్‌బీసీ చైర్మన్ డీవీ మనోహర్, చిరక్ పబ్లిక్ స్కూల్ ఎండీ రత్నారెడ్డి పాల్గొన్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ వరకు సాగిన సైకిల్ రైడ్ తిరిగి బైక్ స్టేషన్ వద్ద ముగిసింది.