సమయం లేదు మిత్రమా! | United Nations Climate Change Conference Cop-27 2022 | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా!

Published Tue, Nov 8 2022 12:35 AM | Last Updated on Tue, Nov 8 2022 12:35 AM

United Nations Climate Change Conference Cop-27 2022 - Sakshi

‘మానవాళి సమష్టిగా పోరాడాలి. లేదంటే అది సామూహిక ఆత్మహత్యా సదృశమే!’ ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి చేసిన ఈ హెచ్చరిక అందరినీ ఆలోచింపజేస్తుండగా, ఐరాస సారథ్య ‘పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్‌–కాప్‌–27) ఆదివారం ఆరంభమైంది. ఈజిప్టులో సముద్రతీరంలోని రేవుపట్నమైన షర్మ్‌ ఎల్‌–షేక్‌లో 12 రోజుల ఈ సదస్సు మరోసారి పర్యావరణ సమస్యలపై దృష్టి సారించేలా చేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య ప్రపంచం మళ్ళీ బొగ్గు వాడకం వైపు వెళుతున్న పరిస్థితుల్లో, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సైతం బొగ్గువాడకం ఆపేస్తామనే పాత వాగ్దానం నుంచి పక్కకు తప్పుకొంటున్న వేళ ఈ సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉండే ఈజిప్ట్‌లో, లక్ష్యాల్లో భాగస్వాములు కావాల్సిన స్వతంత్ర పౌర సమాజం పట్ల వ్యతిరేకత చూపే ప్రభుత్వ హయాంలో సదస్సు సాగడం విచిత్రం.

యుఎన్‌–కాప్‌లోని 195 సభ్యదేశాలతో పాటు వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమకారులు – ఇలా సుమారు 45 వేల మందికి పైగా ఈసారి సదస్సులో పాల్గొంటున్నారు. పెరుగుతున్న వాతావరణ సంక్షోభం నేపథ్యంలో దశాబ్దాలుగా ఏటా సాగుతున్న ఈ మెగా ఈవెంట్‌ మరోసారి ప్రాథమిక అంశాలపై చర్చకు తెర తీసింది. ధరిత్రి ఉష్ణోగ్రతలో పెంపు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించరాదనేది ప్యారిస్‌ ఒప్పందం చేసుకున్నాం. మరి, ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? వాస్తవానికి ఈ శతాబ్ది చివరకు 2 డిగ్రీల మించి తాపం పెరుగుతుందంటూ వాతావరణ మార్పులపై ఐరాస ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) చేసిన తాజా హెచ్చరిక మన మొద్దునిద్రకు దర్పణం. లక్ష్యాలు పెట్టుకోవడం కాదు... వాటిని సాధించడానికి నిజాయతీగా కృషి అవసరమని అది చెప్పకనే చెబుతోంది. అందుకే వాతావరణ నష్టనివారణకు ధనిక దేశాలు నిధులివ్వాలంటూ వర్ధమాన ప్రపంచం పట్టుబట్టే పరిస్థితి ఈసారి నెలకొంది. 

వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల రీత్యా 2020 నుంచి 2025 వరకు ఏటా 100 బిలియన్‌ డాలర్ల సహాయం అందిస్తామని ధనిక దేశాలు ఎప్పుడో వాగ్దానం చేశాయి. 2009లో కోపెన్‌హాగెన్‌ (కాప్‌15)లో ఇచ్చిన ఆ మాటనే 2015లో ప్యారిస్‌ (కాప్‌21)లోనూ పునరుద్ఘాటించాయి. కానీ, అతీగతీ లేదు. ఆ ‘వాతావరణ ద్రవ్యసహాయం’ కిందకు ఏవేం వస్తాయో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, పారదర్శకంగా ఆ రుణాలిచ్చే వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం విడ్డూరం. భూగోళంపై వాతావరణ మార్పుల పర్యవసానం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. ఈ మార్పులకు ప్రధాన కారణమవుతున్న ధనిక దేశాలు తమ పొరుగునున్న బాధిత దేశాలపై సానుభూతి చూపితే సరిపోదు. దేశాల పరస్పర సహకారంతోనే వాతావరణ విపర్యయాల నుంచి బయటపడి మానవాళి మనుగడ సాగించగలదని గుర్తించాలి. ‘వాతావరణంపై సంఘీభావ ఒప్పందం’ అన్న ఐరాస పెద్ద తాజా అభిభాషణను ఆ కోణం నుంచి అర్థం చేసుకోవాలి.

ఈ ఏడాది వివిధ దేశాల్లో తలెత్తిన వాతావరణ సంక్షోభాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్‌లో వచ్చిన భారీ వరదల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆహార భద్రత సైతం చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. పెనుతుపాను ఇయాన్‌ దెబ్బకు క్యూబాలో ప్రాథమిక వసతులన్నీ ఛిన్నాభిన్నమై, రోజుల తరబడి విద్యుచ్ఛక్తి లేకుండా గడపాల్సి వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల 55 బాధితదేశాలు ఇప్పటికే 525 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోతున్నా యని లెక్క. 2030 కల్లా అది మరింత పెరగనుంది.

ధనిక దేశాల వాతావరణ విధ్వంసం దెబ్బకు, తమకే సంబంధం లేని వర్ధమాన దేశాలు 2040కి 1 ట్రిలియన్‌ డాలర్ల దాకా నష్టపోతాయట. అభివృద్ధి చెందిన దేశాలే ఈ నష్టాన్ని భర్తీ చేయాలని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కోరుతున్నాయి. నష్టపరిహార నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజా ‘కాప్‌27’లో దీనిపై చర్చ జరగడం అభిలషణీయమే!

గ్రీన్‌హౌస్‌ వాయువులను భారీగా విడుదల చేస్తున్న అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) మంకుపట్టు పడుతున్నాయి. నిరుడు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన ‘కాప్‌26’లో శాశ్వత నష్టం, సరిదిద్దుకోగల నష్టాల గురించి చర్చ జరపాలని వర్ధమాన దేశాలు కోరాయి. అమెరికా, ఈయూల తీవ్ర అభ్యంతరంతో అది జరగనే లేదు. ఇప్పుడు పాకిస్తాన్‌ మొదలు సోమాలియా, పసిఫిక్‌ మహా సముద్ర ద్వీపదేశాల దాకా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

వాతావరణ మార్పులతో అతలాకుతలమవుతుండడంతో ‘చిరు ద్వీపదేశాల కూటమి’ సైతం ఆ బాధను బాపేలా ప్రపంచ ‘ప్రతిస్పందన నిధి’ కావాలని ప్రతిపాదిస్తోంది. భారత్‌ సైతం ఈ బాధల నివారణను భుజానికెత్తు కోవాలి. అభివృద్ధి చెందిన దేశాలను చర్చలకు రప్పించే నైతిక బాధ్యత వహించాలి. 

ఉక్రెయిన్‌ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాల్ని సాకుగా చూపి, గ్లోబల్‌ నార్త్‌ దేశాలు వాతావరణ మార్పుల నివారణకు పెట్టుకున్న లక్ష్యాలను వెనక్కి నెట్టడం అభిలషణీయం కాదు. దాని పర్యవసానం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులతో, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా తదితర దేశాల గ్లోబల్‌ సౌత్‌కే ఎక్కువ. నిజానికి, అమెరికాలో అనావృష్టి, ఆఫ్రికాలో కరవు, యూరప్‌లో వడగాడ్పులు ధనిక దేశాలకూ ప్రమాదఘంటికలే. ఇప్పుడు భూతాపోన్నతి నివారణ, నిధులపై మీనమేషాలు లెక్కిస్తే మొదటికే మోసం. సమయం లేదు మిత్రమా! త్వరపడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement