Sea Level Rise Threatens New York City - Sakshi
Sakshi News home page

కలల నగరం, నిద్రపోని నగరం న్యూయార్క్‌ .. మునిగిపోనుందా?

Published Fri, May 19 2023 3:56 AM | Last Updated on Fri, May 19 2023 11:09 AM

Sea Level Rise Threatens New York City - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యమైన సిటీ న్యూయార్క్‌. ఖరీదైన కలల నగరంగా, నిద్రపోని నగరంగా పేరుగాంచింది. న్యూయార్క్‌ సిటీ ఇప్పుడు ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణాలు సిటీలో ఉన్న వేలాది ఆకాశహర్మ్యాలు, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతుండడం.

ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్‌ ప్రతిఏటా 2 మిల్లీమీటర్ల మేర కుంగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌ సైంటిస్టుల తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘అడ్వాన్సింగ్‌ ఎర్త్, స్పేస్‌ సైన్స్‌’ పత్రికలో ప్రచురించారు. సముద్ర మట్టం పెరుగుదలకు తోడు భారీ భవనాల వల్ల న్యూయార్క్‌లో భూమిపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే నగరం మునిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటికైనా మేల్కొని నివారణ చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఈ ముంపు తీవ్రత ఇంకా ఉధృతమవుతుందని అంటున్నారు. నగరం నివాస యోగ్యం కాకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం న్యూయార్క్‌ సిటీకే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు ముంపు బారిన పడుతున్నాయని పేర్కొంటున్నారు.  

భారతదేశంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని జోషీమఠ్‌ పట్టణంలో ఇటీవల ఇళ్లు కూలిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. పగుళ్లు ఏర్పడడంతో చాలా ఇళ్లను కూల్చేయాల్సి వచ్చింది. జోషీమఠ్‌లో భూమి అంతర్భాగంలో ఒత్తిడి వల్లే ఇళ్లు కూలిపోయినట్లు గుర్తించారు. న్యూయార్క్‌లోనూ ఈ తరహా ఉత్పాతం పొంచి ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.  
న్యూయార్క్‌ నగర జనాభా 80 లక్షల పైమాటే. ఆకాశాన్నంటే భారీ భవనాలతో సహా 10 లక్షల దాకా భవనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఏటా 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే భూమిలోకి కూరుకుపోతున్నాయి.  
ఉత్తర అమెరికాలో అట్లాంటిక్‌ తీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ముంపు ముప్పు న్యూయార్క్‌కు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు తెలియజేశారు.  
 మరో 80 ఏళ్లలో.. అంటే 2100వ సంవత్సరం నాటికి న్యూయార్క్‌ సిటీ 1,500 మిల్లీమీటర్లు కుంగిపోతుందని అధ్యయనంలో గుర్తించారు.  
న్యూయార్క్‌పై ప్రకృతి విపత్తుల దాడి కూడా ఎక్కువే. 2012లో సంభవించిన శాండీ తుపాను కారణంగా సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకువచ్చింది. చాలా ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. 2021లో సంభవించిన ఇడా తుఫాను వల్ల సిటీలో మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది.  
♦ కోస్టల్‌ సిటీలకు ముంచుకొస్తున్న ప్రమాదానికి న్యూయార్క్‌ ఒక ఉదాహరణ అని ‘యూనివర్సిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌’కు చెందిన గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫీ సైంటిస్టులు చెప్పారు. ఈ సమస్య ప్రపంచానికి ఒక సవాలు లాంటిదేనని అన్నారు. సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని, సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాల్లో భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించాలని సూచించారు.  
సముద్ర తీరంలో, నది ఒడ్డున, చెరువుల పక్కన నిర్మించే భారీ భవనాలు భవిష్యత్తులో వరద ముంచెత్తడానికి, తద్వారా ప్రాణ నష్టానికి కారణమవుతాయని వివరించారు.  
 అన్నింటికంటే ముఖ్యంగా మితిమీరిన నగరీకరణ, పట్టణీకరణ అనేవి ప్రమాద హేతువులేనని తేల్చిచెప్పారు.   
అడ్డూ అదుపూ లేకుండా నగరాలు, పట్ట ణాలు విస్తరిస్తున్నాయి. వర్షం పడితే అవి చెరువుల్లా మారుతుండడం మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం.   – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement