ఇదివరకటి చలికాలాలు వజవజ వణికించేవి. జనాలను చలిమంటలు వేసుకునేలా పురిగొల్పేవి. ఏడాదంతా బీరువాల్లో మగ్గిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు ఒంటి మీదకు వచ్చేవి. ఏటా అక్టోబర్‌లో శరన్నవరాత్రులు మొదలయ్యే నాటికే వాతావరణంలో తేడా స్పష్టంగా తెలిసేది. గాలి పొడిబారడం, సాయంత్రం అయ్యేసరికి చిరుచలి ప్రారంభం కావడం జరిగేది. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు ఊరూరా వీథుల్లో వెలిసేవి. ఆ దుకాణాలు జనాలతో కళకళలాడేవి. ఇక డిసెంబరు వచ్చిందంటే రాత్రంతా దుప్పట్లో ముసుగుతన్ని పడుకున్న మనుషులు ఉదయాన్నే లేచి బయటకు రావడానికి వెనుకాడే పరిస్థితులు ఉండేవి. కొన్నేళ్లుగా చలికాలాలు బాగా మారిపోయాయి. క్రమంగా నులివెచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. చలికాలాలు మనుషులను వజవజ వణికించడం అటుంచితే, ఇప్పుడవి చిరుచెమటలు పట్టిస్తున్నాయి. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు గిరాకీల్లేక వెలవెలబోతున్నాయి.
చలికాలాలు కాలక్రమేణా వెచ్చబడుతుండటం మన దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా అనుభవపూర్వకంగా తెలుసు. చలికాలాల్లో హిమపాతంతో వణికిపోయే చాలా దేశాల్లో కొద్ది సంవత్సరాలుగా చలి తీవ్రత తగ్గుముఖం పడుతూ వస్తోంది.
భూతాపం పెరుగుతుండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా శీతకాలాల్లో చలితీవ్రతలు తగ్గుముఖం పడుతుండటం, వేసవుల్లో ఉష్ణోగ్రతలు ఇదివరకటి కంటే గణనీయంగా పెరుగుతుండటం సంభవిస్తున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గడచిన యాభయ్యేళ్లుగా వేసవులు వేడెక్కుతుండటంతో పోల్చి చూస్తే, చలికాలాలు ఎక్కువగా వెచ్చబడుతూ వస్తున్నాయని అమెరికాలోని నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ డికీ ఆరంట్ వెల్లడించడం విశేషం. పారిశ్రామిక విప్లవం తర్వాతి నుంచి ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి.
అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన ‘గాడాడ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్’ లెక్కల ప్రకారం 1880 నుంచి చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు కనీసంగా 1.1 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగాయి. ఈ పెరుగుదలలో దాదాపు మూడొంతులు 1975 తర్వాతి నుంచే నమోదవుతూ వస్తోంది.
చలికాలాలు వెచ్చబడుతుండటం మన భారత్ వంటి ఉష్ణమండల దేశాలకు మాత్రమే పరిమితమైన పరిణామం కాదు, హిమపాతంతో వణికిపోయే చలి దేశాల్లోనూ ఈ దిశగా మార్పులు కనిపిస్తున్నాయి. హిమపాతం పరిమాణంలో గణనీయమైన తగ్గుదల నమోదవుతోంది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ:
చలి దేశాల్లో హిమపాతం పరిమాణం
►136 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 6.9 అంగుళాలు
►50 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 5.7 అంగుళాలు
►10 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 4.1 అంగుళాలు
భూతాపం పెరుగుదలే కారణం
భూతాపం పెరుగుదల కారణంగానే చలికాలాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉష్ణమండల దేశాల్లోనైతే, కొన్ని ప్రాంతాల్లో చలికాలంలో కూడా చిరుచెమటలు పట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా భూతాపం పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, పద్దెనిమిదో శతాబ్ది చివర్లో పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక యంత్రాల వినియోగం పెరగడం వల్ల 1830–50 నాటికే భూతాపం పెరుగుదలలో తొలి సూచనలు కనిపించసాగాయి.
జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం ఫలితంగా అడవుల నరికివేత, వ్యవసాయం సహా రకరకాల అవసరాల కోసం పశుపోషణ పెరగడం, మోటారు వాహనాల ఉత్పత్తి, వినియోగం పెరగడం వల్ల పెట్రో ఉత్పత్తుల వినియోగంలో పెరుగుదల, వీటన్నింటి ఫలితంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాల పెరుగుదల భూతాపాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో భూతాపం పెరుగుదల కొన్ని దశాబ్దాలుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1880 నాటికి 13.6 డిగ్రీల సెల్సియస్ ఉండగా, 1960 నాటికి 13.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇప్పుడిది 14.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలలో 1970 తర్వాతి నుంచి మరింతగా దిగజారింది.
1970 నుంచి 2000 వరకు ప్రతి దశాబ్దికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదవుతూ రాగా, 2000 తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఈ పెరుగుదల ప్రతి దశాబ్దికి సగటున 2.07 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
వెచ్చని చలికాలాలతో వెతలుతప్పవు
చలికాలాల్లో ఉష్ణోగ్రతలు ఎప్పటి మాదిరిగా పడిపోకుండా, కొంత వెచ్చగా ఉంటే చలి బాధలు లేకుండా బాగానే అనిపించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెచ్చని చలికాలాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తాయి.
ఈ వ్యాధులు కొందరికి ప్రాణాంతకం కూడా కావచ్చు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువై, అలెర్జీల వంటి బాధలు కూడా పెరుగుతాయి. కొన్నిరకాల వృక్షజాతులు గాలిలోకి పుప్పొడి వెదజల్లే కాలం మరింతగా పెరగడం వల్ల కంటి జబ్బులు, చర్మంపై దద్దుర్లు, రకరకాల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి.
దీనివల్ల పిల్లలు బడులకు, పెద్దలు పనులకు వెళ్లలేని రోజులు పెరుగుతాయి. విలువైన పనిదినాలు వ్యర్థమవుతాయి. నులివెచ్చని చలికాలాలు ఆరోగ్యంపై నేరుగాను, ఆర్థిక వ్యవస్థలపై పరోక్షంగాను దుష్ప్రభావం చూపుతాయి. చలికాలాలు వెచ్చబడటం వల్ల హిమాలయాలు సహా ప్రపంచంలోని పలు మంచు పర్వతాలపై పేరుకునే మంచు మందం తగ్గిపోతుంది. పర్వతాలపై మందంగా పేరుకునే మంచు వేసవికాలంలో నదుల్లోని నీటికి ఆధారం.
మంచు మందం తగ్గిపోవడం వల్ల నదుల్లోకి నీటి ప్రవాహం కూడా ఆ మేరకు తగ్గిపోతుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడి, కరవు కాటకాలు తలెత్తుతాయి. నేలలోని తేమ ఇంకిపోయి సున్నితమైన పలు వృక్షజాతులు అంతరించిపోతాయి. అంతేకాదు, ఈ పరిస్థితుల వల్ల కార్చిచ్చులు కూడా పెరుగుతాయి.
వెచ్చని చలికాలాలు వేసవి తీవ్రతను మరింతగా పెంచుతాయి. వేసవి రోజులను కూడా మరింత పెంచుతాయి. ఇప్పటికైనా భూతాపాన్ని అరికట్టలేకపోతే, 2050–2100 మధ్య కాలానికి పరిస్థితులు మరింతగా దిగజారి, వేసవి బాధలు మూడురెట్లు పెరుగుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలో పరిస్థితి
మన దేశంలో ఈసారి చలికాలం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. మన దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదివరకటి స్థాయిలో పడిపోయే పరిస్థితులు లేవని ఐఎండీ అంచనా.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో ప్రకటించారు.
మంచు ప్రదేశాల మీదుగా వీచే పడమటి గాలుల తీవ్రత తగ్గడమే కాకుండా, మరోవైపు ‘లా నినా’ పరిస్థితి నెలకొనడం వల్లనే ఈసారి చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ చలికాలం వెచ్చగానే ఉంటుందని ఆయన వెల్లడించారు.
మన దేశంలో 1901 నుంచి రికార్డులను చూసుకుంటే, తొలిసారిగా 1912–13 చలికాలంలో సాధారణం కంటే 0.69 సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, 1926లో సాధారణం కంటే 0.70 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శతాబ్దిలో 2009 శీతాకాలంలో సాధారణం కంటే ఏకంగా 1.25 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
స్థూలంగా చూసుకుంటే, 1901–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. గంగా నది పరివాహక ప్రాంతంలోని నగరాల్లో పరిశ్రమల పెరుగుదల, దేశవ్యాప్తంగా మోటారు వాహనాల వినియోగంలో పెరుగుదల తదితర అంశాలు మన దేశంలో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఫలితంగా చలికాలాలు ఏడాదికేడాది వెచ్చబడుతూ వస్తున్నాయి.
వాతావరణ మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ జాబితాలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో నమోదవుతున్న పెరుగుదలను అరికట్టేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే ఈ దేశాల్లో 2050 నాటికి అత్యంత విపత్కర పరిస్థితులు తప్పవని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జల వనరులకూ చేటు
చలికాలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జలవనరులకూ చేటు తప్పదు. వెచ్చని చలికాలాలు గాలిలో తేమను పెంచుతాయి. ఫలితంగా మంచు కురిసే ప్రాంతాల్లో హిమపాతం తగ్గుతుంది. తీర ప్రాంతాల్లో అకాల వర్షాలు, తుఫానులు పెరుగుతాయి. సముద్ర తీరానికి సుదూరంగా ఉండే ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయి.
తీర ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా నదులు, సరస్సుల్లోకి నీటి ప్రవాహం ఉధృతమవుతుంది. ‘యూఎస్ గ్లోబల్ చేంజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్’ వాతావరణ మార్పులపై విడుదల చేసిన మూడో నివేదిక ప్రకారం... భూగర్భజలాల్లో అవసరమైన పోషకాలు తగ్గిపోయి, నాణ్యత లోపిస్తుంది. సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతుంది. నదుల్లోని మంచినీటిని మానవ అవసరాల కోసం మళ్లించడం వల్ల నదుల్లో తగ్గిన నీటిమట్టాన్ని భర్తీ చేయడానికి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది.
చెరువులు, సరస్సులు, నదుల్లో ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘హైపోక్సియా’ పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా జలవనరులను ఆశ్రయించుకుని పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. సముద్రాల్లో నీటిమట్టాలు పెరగడం, తరచు తుఫానులు, వరదలు ముంచెత్తడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి కోతకు గురవుతుంది.
ఆహార ధాన్యాల పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. జలవనరులు కలుషితమై వ్యాధులు విజృంభిస్తాయి. నీటి లభ్యత, నీటి నాణ్యత క్షీణించడం వల్ల వ్యవసాయానికే కాకుండా, విద్యుదుత్పాదన రంగానికి, ఇతర మౌలిక రంగాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ప్రజారోగ్యం గడ్డు సమస్యలుగా పరిణమిస్తాయి.
వ్యవసాయానికీ నష్టాలు
వెచ్చని చలికాలాలు వరుసగా వస్తుంటే వ్యవసాయానికి కూడా నష్టాలు తప్పవు. ఉత్తరార్ధ గోళంలోని దేశాల్లో నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు మొదటి వారానికల్లా చలి తీవ్రత స్పష్టంగా పెరగడం సహజం. అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లయితే, పంట దిగుబడుల్లో దాదాపు 25 శాతానికి పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని బ్రిటన్‌కు చెందిన జాన్ ఇనిస్ సెంటర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పంటల పెరుగుదల నెమ్మదించి, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని, ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా పెరిగే నూనెగింజల పంటలకు మరింతగా నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పొలాల్లో నాటిన మొక్కలు చురుకుదనాన్ని కోల్పోతాయి.
ఫలితంగా వ్యవసాయ పంటల దిగుబడి చేతికి రావాల్సిన కాలం పెరుగుతుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి గణనీయంగా క్షీణిస్తుంది. దోమలు, నల్లులు వంటి కీటకాల బెడద ఎక్కువవుతుంది. ఈ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు పాడి పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వెచ్చని చలికాలాల వల్ల కార్చిచ్చుల ముప్పు పెరిగి పంట భూములకు, గడ్డి భూములకు తీరని నష్టం వాటిల్లుతుంది.
ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా చలికాలంలోని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా పెరిగినా, ఆ ప్రాంతంలో పంటల దిగుబడి కనీసం 6 శాతం వరకు పడిపోతుందని, ఈ పరిస్థితి ఆహార భద్రతకు చేటు కలిగిస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండు మూడు దశాబ్దాలలో పంట దిగుబడులకు వాటిల్లే నష్టం 12 శాతం వరకు పెరగవచ్చని, ఈ శతాబ్ది చివరి నాటికి ఈ నష్టం 25 శాతానికి చేరుకోగలదని ఎఫ్‌ఏఓ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌ఏఓ అంచనాల ప్రకారం చలికాలాలు వెచ్చబడుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటలైన మొక్కజొన్న, గోధుమలు, వరి, బంగాళదుంపలు, అరటి దిగుబడులు ఏడాదికేడాది తగ్గిపోయే పరిస్థితులు తలెత్తుతాయి.
చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే, వరి దిగుబడులు 5.5 శాతం, గోధుమ దిగుబడులు 3 శాతం, మొక్కజొన్న దిగుబడులు 3 శాతం, బంగాళదుంపల దిగుబడులు 6 శాతం, అరటి దిగుబడులు 15 శాతం మేరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చలికాలం దుస్తుల దుకాణాలు వెలవెల
మన దేశంలో ఏటా దసరా రోజులు పూర్తి కాగానే నగరాల్లోను, పట్టణాల్లోనూ వీథుల పక్కన చలికాలం ధరించే స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, మంకీ క్యాప్‌లు, రగ్గులు, రజాయిలు వంటి చలికాలం దుస్తులు విక్రయించే తాత్కాలిక దుకాణాలు వెలుస్తాయి. ఇదివరకు ఈ దుకాణాలు నవంబర్ ప్రారంభంలోనే జనాలతో కళకళలాడేవి. అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగేవి.
గడచిన దశాబ్దకాలంలో చలికాలాల్లో ఉండాల్సినంత చలి లేకపోతుండటంతో జనాలు చలికాలం దుస్తుల కొనుగోళ్లను తగ్గించుకున్నారు. ఫలితంగా చలికాలం దుస్తుల తాత్కాలిక దుకాణాలు బేరాలు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సైతం స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, వింటర్ కోట్లు వంటి వాటి అమ్మకాలు దాదాపుగా జరగడం లేదు.
మాల్స్‌లో ఈ దుస్తులు ఏళ్ల తరబడి అలాగే పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో కంటే చలి ఎక్కువగా ఉండే అమెరికాలోను, పలు యూరోప్ దేశాల్లోనూ కనిపిస్తోంది. ‘కొద్ది సంవత్సరాలుగా మా స్టోర్స్‌లో స్వెటర్లు, వింటర్ జాకెట్లు, కోట్లు వంటివి పేరుకుపోయి ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి డిస్కౌంట్లు భారీగానే ప్రకటించాం.
అయినా, వీటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు’ అని అమెరికాలోని హెచ్ అండ్ ఎం స్టోర్స్ సీఈవో హెలీనా హెల్మర్సన్ మీడియా వద్ద వాపోవడం వెచ్చని చలికాలాల పరిస్థితికి అద్దంపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment