
వాతావరణ మార్పులే ప్రధాన కారణం
క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం
తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం
వాతావరణ మార్పులు. భూమిపై జీవుల మనుగడకే సవాలు విసురుతున్న విపరిణామం. ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌పై వీటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం చేసింది.
రుతపవనాల సీజన్‌లో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు తేల్చింది. వాతావరణ మార్పులు వర్షాల గతినే పూర్తిగా మార్చేస్తున్నట్లు వెల్లడైంది. సాధారణ వర్షాలు పడాల్సిన సమయంలో అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అసలు వర్షాలే లేకపోవడం వంటి విపరీత పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
→ దేశవ్యాప్తంగా 729 జిల్లాల్లో క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2024 రుతుపవనాల సీజన్‌లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతంలో వైవిధ్యం కనిపించింది.
→ 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
→ 158 జిల్లాల్లో భారీ వర్షాలు, 48 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మరోవైపు 178 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వీటిలో 11 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది.
→ గత ఐదేళ్లలో చూస్తే ఈ ఏడాది తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురిసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వర్షపాతంలో మార్పులతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ఇందోళనకర పరిణామం అని చెబుతున్నారు. దీనివల్ల వరదలు, తద్వారా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుందని అంటున్నారు.
→ ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 తర్వాత ఇదే అత్యధికం.
→ భూమి ఉపరితలం, సముద్రాల ఉష్ణోగ్రతల్లో మధ్య వ్యత్యాసాలు రుతుపవనాలను ప్రభావితం చేస్తుంటాయి. సముద్రాలతో పోలిస్తే భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా భూమి క్రమంగా వేడెక్కుతుండడంతో రుతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. గత పదేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
→ 2023లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. భూమిపై సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రుతుపవనాల్లో ప్రతికూల మార్పు మొదలైందని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆర్తి ఖోస్లా చెప్పారు.
→ వ్యవసాయం, నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతకు రుతుపవనాలే అత్యంత కీలకం. కోట్లాది మంది ప్రజల జీవితాలు రుతుపవనాలపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు పూర్తిగా గతి తప్పితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే వాతవరణ మార్పులను అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్