
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది.
అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.