ఒంటికి సెగ తగిలినా కదలరా? | Dileep Reddy Article On Climate Change | Sakshi
Sakshi News home page

ఒంటికి సెగ తగిలినా కదలరా?

Published Fri, Sep 20 2019 1:12 AM | Last Updated on Fri, Sep 20 2019 1:12 AM

Dileep Reddy Article On Climate Change - Sakshi

బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారోతో సహా ఇప్పటికీ చాలా మంది ‘వాతావరణ మార్పు’ను అతిశయోక్తిగా పరిగణిస్తున్నారు. మనదేశంలోనూ చాలా మంది ‘భూతాపోన్నతి’, ‘వాతావరణ మార్పు’, ‘కర్బన ఉద్గారాలు’ వంటి మాటల్ని ఏ జర్నలిస్టులో, న్యాయవాదులో, పర్యావరణ కార్యకర్తలకో పరిమితమైన పదజాలంగా భావిస్తున్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. కాలుష్యాల వల్ల వాతావరణ వేడి పెరిగి వింత జబ్బులు రాజ్యమేలుతూ ప్రజానీకాన్ని ఆస్పత్రుల పాల్జేస్తున్నాయి. భరించలేని వేడి–చలి. రుతువులు గతి తప్పడం, అడవులు అంతరించడం, జబ్బులు శృతిమించడం.... ఇలా ప్రజలకిప్పుడిప్పుడే ఈ వేడి తెలిసివస్తోంది. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయమిది. విశాల జనహితంలో... ప్రజాభిప్రాయానికి విలువిస్తేనే ప్రజాస్వామ్యం!

‘జనం కిక్కిరిసిన థియోటర్లో ‘ఫైర్‌ ఫైర్‌’ అని, మంట లేకున్నా ఉత్తుత్తిగా అరవడం ఎంత తప్పో మనందరికీ తెలుసు. అగ్గి అంటుకొని అది నలువైపుల విస్తరిస్తున్నా ఏమీ జరుగనట్టు చూస్తూ మౌనంగా కూర్చోవడం కూడా అంతే తప్పనీ మనకు తెలుసు....’’– రిచర్డ్‌ ఆలె, జియోసైన్సెస్‌ ప్రొఫెసర్, పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ (యూఎస్‌)

పృధ్వికి అనేక విపత్తులు కలిగిస్తున్న వాతావరణ మార్పు, అందుకు కారణమవుతున్న భూతాపోన్నతి గురించి మనందరికీ తెలుసు. కాలుష్యాల వల్ల భూమి, భూమ్యావరణం వేడెక్కి అనేక సమస్యలకు దారితీస్తోంది. తగు ప్రత్యామ్నాయాలతో పరిస్థితిని సమర్థంగా ఎదు ర్కోకుంటే మున్ముందు ప్రమాద తీవ్రత ఎన్నో రెట్లు ఉంటుందనీ తెలుసు. ముఖ్యంగా మన ప్రభుత్వాలు, పాలకులకు బాగా తెలుసు. అయినా, నిమ్మకు నీరెత్తినట్టు కదలిక లేకుండా కూర్చోవడమే విస్మయం కలిగిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) నేతృత్వంలో జరిగిన పారిస్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ ప్రకటించిన ‘జాతి కట్టుబడ్డ కృషి సంకల్పం’(ఐఎన్‌డీసీ) అమలు కూడా అంతంతే! అక్కడి మన హామీలను నిలబెట్టుకునేందుకు చేస్తున్న కృషి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!’ అన్నట్టుంది. భూగోళాన్ని ఉద్దరించడానికి మనం చేసే కృషి సంగతలా ఉంచితే, మనకు మనం ఈ విపత్తు నుంచి తప్పించుకునేందుకు చేస్తున్నదేమిటి? ప్రకృతి వైపరీత్యాల వల్ల సగటు మనిషి బతుకు దుర్భరం కాకుండా తీసుకుంటున్న నివా రణ చర్యలేవి? అని ప్రశ్నించుకోవాలి.

వేగంగా ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పు, దాని దుష్పరిణామాలు నేరుగా మనకు తగులు తున్నా గ్రహించే తెలివిడి, స్పందించే సున్నితత్వం ప్రభుత్వాల్లో కొర వడుతోంది. గాలి కాలుష్యమై ఊపిరాడక మొన్న ఢిల్లీ ఉక్కిరిబిక్కిర యింది. తాగునీరే కరువై నిన్న చెన్నై తల్లడిల్లింది. వర్షపు నీటికే జనజీవనం స్తంభించి నేడు ముంబాయి మూలుగుతోంది. వైద్యులకే అంతుబట్టని వింత జబ్బులు పలు రాష్ట్రాల్లో జనావళిని మంచమెక్కిం చాయి. అయినా... తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత పరి ష్కారాలు లేవు. దీర్ఘకాలిక ప్రణాళికలు శూన్యం. అందుకే, పౌర సమాజం క్రమంగా చైతన్యమౌతోంది. పలువిషయాల్లో ప్రభుత్వా లపై ఒత్తిడి తీసుకువస్తోంది. దేశంలో ఇప్పుడు ‘వాతావరణ అత్య యిక పరిస్థితి’ విధించమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. దేశవ్యాప్తంగా సదస్సులు, సమాలోచనలు సాగుతున్నాయి. వెంటనే అత్యయిక స్థితి ప్రకటించి, నిర్దిష్ట చర్యలు ప్రతిపాదించి, ఓ ప్రణా ళికతో కార్యాచరణ చేపట్టాలనేది మౌలిక డిమాండ్‌. వాతావరణ మార్పులకు ప్రకృతి ప్రకోపిస్తే... చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు.

అత్యయిక పరిస్థితితో జరిగేదేంటి?
ప్రపంచంలో పలు దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. మొదట 2016 డిసెంబర్‌ 5న, ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ నగరం ప్రకటించింది. 2019 మే 1న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంట్‌ ఒక తీర్మానంతో ఈ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. అదే క్రమంలో కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రియా, స్పెయిన్, స్కాట్లాండ్, పోర్చుగల్‌ తదితర దేశాలు ఈ జాబితాలో చేరాయి. దేశాలుగానే కాకుండా సిడ్నీ, న్యూయార్క్‌తో సహా ప్రపం చంలోని చాలా నగరాలు ఇప్పటికే అత్యయిక పరిస్థితిని ప్రకటించి, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తట్టుకునే, ఎదుర్కోగల ప్రణాళికలు చేపట్టాయి. ముంచుకు వస్తున్న సమస్య తీవ్రత గుర్తించి ఎక్కడికక్కడ ఇలా అప్రమత్తం కావడమంటే, ‘ప్రపంచ సమస్యకు స్థానిక పరిష్కారం’ చూడటమన్న మాట! గత నెల 29న ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల్లోని వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో 983 పరి ధుల్లో వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. 21.2 కోట్ల జనాభా ఈ పరిధుల్లో ఉంది. మన దేశంలోనూ అత్యయిక పరిస్థితి ప్రకటించాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

కేవలం ప్రకటనతోనో, హామీలతోనో పని జరుగదు. వాతావరణ మార్పులను దీటుగా ఎదు ర్కోవడానికి, ప్రతికూలతలు తట్టుకోవడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. మెట్రో నగరాలకు వనరులు, అధికారాలు కల్పిం చాలి. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి, 2025 నాటికి ‘జీరో’ ఉద్గా రాల స్థాయి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల కల్పనతో పాటు లక్ష్య సాధనకు షరతులు విధించాలి. భూతాపోన్నతి వల్ల తలెత్తే ప్రమాదాన్ని తప్పించడానికి, మనుషుల, ఇతర జీవరాశి రక్ష ణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. బొగ్గు, పెట్రోలు వంటి శిలాజ ఇంధ నాల వినియోగం తగ్గించి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్విని యోగ యోగ్య వనరులపైనే ఆధారపడాలి. కాలుష్య నియంత్రణ, ఉద్గారాల అదుపు కోసం ఇంధన, వ్యవసాయ, భూవినియోగ, పారి శ్రామిక రంగాల్లో ప్రాధాన్యతా చర్యలు వెంటనే చేపట్టాలి. ఏ ఇతర విధాన నిర్ణయం తీసుకునేటప్పుడైనా, పథకాలు రూపొందించేప్పు డైనా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ‘వాతావరణ మార్పు’ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసమే వాతావరణ అత్య యిక పరిస్థి తిని ప్రకటించాలి. ప్రభుత్వం అలా ప్రకటించినా, నిర్దిష్ట హామీలి       చ్చినా... వాటి అమలును తిరిగి పౌరసమాజమే పర్యవేక్షించాలి.

గరిష్ఠ బాధితులం మనమే!
భూతాపోన్నతి, ఫలితంగా తీవ్రమౌతున్న వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నది, నష్టపోయేది మనమే! ఉష్ణమండలాల లెక్కన చూస్తే.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాలు అధి కంగా ప్రభావితం కానున్నాయి. ఆహారోత్పత్తి తగ్గడంతో పాటు అనా రోగ్యం, అతివృష్ట–అనావృష్టి దెబ్బ వంటి సమస్యలు ఇక్కడ పీడించ నున్నాయి. ఇక సాంకేతికత, ఆర్థికవనరుల లేమితో సతమతమయ్యే మూడో ప్రపంచ దేశాల జాబితాలోనూ ఎక్కువ నష్టం మనకే! అమె రికా జాతీయ శాస్త్ర అధ్యయనాల సంస్థ (ఎన్‌ఏఎస్‌) ప్రకారం, గత 50 ఏళ్లలో వచ్చిన ‘వాతావరణ మార్పు’ ప్రపంచంలోని అత్యధిక దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసింది. సంపన్న దేశాలు మరింత సంపన్నమయ్యాయి. పేద, అభివృద్ది చెందుతున్న దేశాలు మరింత పేదరికంలోకి జారిపోయాయి. ఇదే సమీకరణంతో ఇది మున్ముందు మరింత జోరుగా దుష్ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల మంది (ఆసియా, ఆఫ్రికా వాసులే అధికం) అత్యంత నిరుపేదలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ‘వాతావరణ సంక్షోభంపై పోరుకు దక్షిణాసియా ప్రజా సంఘటన’ (ఎస్‌ఏపీఏ సీసీ) ఇటీవల ఏర్పడింది. దక్షిణాసియా దేశాల ప్రభు త్వాలపై ఒత్తిడి తెచ్చి, ఎక్కడికక్కడ వాతావరణ అత్యయిక పరిస్థితిని ప్రకటింప జేయాలన్నది ఈ సంఘటన ఎజెండా. దాని మూడు రోజుల సదస్సు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారత్‌లో వాతావరణ అత్యయిక పరిస్థితి ప్రకటించాలని కేంద్ర ప్రభత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఒక జాతీయ సదస్సు, క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ (ఢిల్లీ), కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ (హైదరాబాద్‌) సంయుక్త నిర్వహణలో శుక్రవారం ఢిల్లీలో జరుగుతోంది.

ఆ దశ ఎప్పుడో దాటిపోయింది!
బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారోతో సహా ఇప్పటికీ చాలా మంది ‘వాతావరణ మార్పు’ను అతిశయోక్తిగా పరిగణిస్తున్నారు. మన దేశంలోనూ చాలా మంది ‘భూతాపోన్నతి’, ‘వాతావరణ మార్పు’, ‘కర్బన ఉద్గారాలు’ వంటి మాటల్ని ఏ జర్నలిస్టులో, న్యాయవాదులో, పర్యావరణ కార్యకర్తలకో పరిమితమైన పదజాలంగా భావిస్తున్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. దేశంలో కోట్లాది మంది ప్రత్యక్షంగా ప్రభావితులవుతున్నా వారికీ సమస్య పట్టడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగి మనుషుల మనుగడ కష్టమైన పరిస్థితి. నిన్నటికి నిన్న చెన్నైలో తాగునీటి సమస్య తారాస్థాయికి చేరి గొంతు తడా రింది. భారీ వర్షాలకు ఇప్పుడు ముంబాయి నీట మునికి వణుకు తోంది. కాలుష్యాల వల్ల వాతావరణ వేడి పెరిగి వింత జబ్బులు రాజ్యమేలుతూ ప్రజానీకాన్ని ఆస్పత్రుల పాల్జేస్తున్నాయి. భరించలేని వేడి–చలి. రుతువులు గతి తప్పడం, అడవులు అంతరించడం, జబ్బులు శృతిమించడం.... ఇలా ప్రజలకిప్పుడిప్పుడే ఈ వేడి తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయమిది. విశాల జనహితంలో... ప్రజాభిప్రాయానికి విలువిస్తేనే ప్రజాస్వామ్యం!


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement