
కనీసం నలభై, యాభై ఏళ్ళుగా ఎన్నడూ చూడనంతటి వర్షం. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ – కశ్మీర్‌లలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. ఉత్తర భారతావనిలో అనేక చోట్ల ఎత్తైన ఆలయ శిఖరాలను సైతం ముంచేస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు. పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన ఆవాసాలు. ఆకస్మిక వరదలతో సిమ్లాలో కుప్పకూలిన భవనాలు. చమోలీలో కొట్టుకుపోయిన బ్రిడ్జీలు. విరిగిపడ్డ కొండచరియలు, కోతపడ్డ రహదారులు.
ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నదితో దేశ రాజధాని ఢిల్లీకి సైతం వరద ముప్పు. హిమాచల్‌లో 70 మందికి పైగా దుర్మరణం. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం. వరదలో చిక్కుకున్న వందలాది గ్రామాలు, వేలాది జనం. ప్రకృతి కోపిస్తే, మనిషి పిపీలకమేనని ఇవన్నీ మరోసారి ఋజువు చేస్తున్నాయి.
వాతావరణ మార్పుతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసమూ ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో మన డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి.
హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్కేంద్రాలే మునిగిపోయి, మట్టి పేరుకుపోవడంతో కరెంట్ లేదు. సాయం చేసే మనిషి లేడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు. విమాన సర్వీసులు లేవు. దోవ, ధైర్యం చెప్పే నాథుడు లేడు.
కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.కుల్లూ, మనాలీ లాంటి ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్కపిడతల్లా కొట్టుకుపోయాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
పదేళ్ళ క్రితం 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్‌ను వణికించిన ‘హిమాలయన్ సునామీ’ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలూ తలపిస్తున్నాయి. దృశ్యాలే కాదు... ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలూ దాదాపు అప్పటి లాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా, ఇప్పుడైనా ఒక పక్కన ఋతుపవనాలు, మరోపక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి, ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుపాను – రెండూ ఏకకాలంలో కలగలసి ఈ ముప్పు తెచ్చాయి.
జూన్ చివరి వరకు వర్షపాతం 10 శాతం కొరవ పడితే, వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2 శాతం అధిక వర్షపాతం స్థాయికి చేరుకున్నామన్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరమేమిటంటే, భూతాపం రోజురోజుకూ పెరుగుతున్నవేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీదపడడం పోనుపోనూ ఎక్కువవుతుందట! అలాగే, పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకుంటే వినాశనం తప్పదనడానికి తాజా ఘటన మరో హెచ్చరిక.
తాజా ఘటనలు ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికీ అద్దం పడుతున్నాయి. వర్షం పడదు. పడితే కాసేపే భారీ వర్షం, ఆ వెంటే వరద. ఆకస్మిక వాన, వరదల్ని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తూ, ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టా లంటే రాడార్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తల మాట.
దానివల్ల 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే, ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరుగుతాయన్న హెచ్చరికను చెవికెక్కించుకోవాలి. నిరుడు జనవరి మొదటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య మొత్తం 273 రోజుల్లో ఏకంగా 242 రోజుల్లో ఏదో ఒక ప్రకృతి విలయం తప్పలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కథనం. అంటే, తరచూ ఎదురయ్యే ముప్పు రీత్యా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.
ఇక, దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటి దాకా ఎర్రటి ఎండతో, ఆపైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీవీఐపీలు తిరిగే ఇండియా గేట్, జనక్‌పురి సహా మూడు ప్రధానమైన చోట్ల గత వారంలో రహదారులు కుంగిపోయాయి. కొన్నిచోట్ల 8 అడుగుల లోతు గుంటలుపడ్డాయి. ఇవన్నీ మన పట్టణ ప్లానింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అద్దం పడుతున్నాయి.
ఇప్పటికే ముంబయ్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో పదే పదే ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువులు – నదీతీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి వీటికి కారణం. కాసింత వానకే మురుగునీటి పారుదల వ్యవస్థ కుప్పకూలుతోంది.
ఇవన్నీ మన పాపాల ఫలితమే. ఇకనైనా, పాలకులు ఉష్ట్రపక్షి స్వభావాన్ని విడనాడాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకూ పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్టు సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళిక చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి.
వాటిని సవ్యంగా కాపాడి, నిర్వహిస్తేనే అర్బన్ ఫ్లడ్స్‌ను నివారించవచ్చు. అలాగే, ఇప్పటికే భారీ అప్పుల్లో పీకల లోతు కూరుకుపోయిన హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జలవిలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైనా కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది.