సాక్షి, విజయవాడ: విండ్, సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కారణంగా గడచిన 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుత్పత్తి సరిగ్గాలేదని తెలిపారు. పీక్ అవర్స్‌లో విద్యుత్ జెనరేట్ కావడం లేదని.. గడచిన 10 రోజుల్లో 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు గాను ఒకరోజు మాత్రమే కొద్దిసేపు గరిష్టంగా 815 మెగావాట్లు వచ్చిందన్నారు. కనిష్టంగా 28 మెగావాట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు.
గత ఏడాది కన్నా అధికంగా నిల్వ చేసాం..
బొగ్గు నిల్వలపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. గత ఏడాదితో పోలిస్తే అధికంగానే బొగ్గును నిల్వచేసామని చెప్పారు. 2018 సెప్టెంబరు 30న జెన్‌కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, 2019 సెప్టెంబరు 30న బొగ్గు నిల్వలు 46,486 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు.. ముందుస్తుగా ప్లాన్ చేసుకోవడం వలనే దాదాపు 16 వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఉండేలా చూసుకున్నామన్నారు.
విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం..
2018 జూన్, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తి చేశామని వెల్లడించారు. బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాల సమయంలో ఈ అదనపు నిల్వలు కొంతమేర ఊరటనిచ్చాయని తెలిపారు. కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లింపులు పూర్తిచేశామని తెలిపారు. విద్యుత్ ఎక్స్చేంజి నుంచి నేటి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామన్నారు. వచ్చే 7 రోజులపాటు రోజుకు 8 ర్యాక్ల చొప్పున సింగరేణి నుంచి బొగ్గు వస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment