ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పునకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రకృతి ప్రకోపం అనండి లేదా ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. భూమ్మీదమనిషి మనుగడ క చ్చితంగా ప్రమాదంలో పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన నివేదిక ప్రకారం పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఉన్న సమయం కూడామించిపోయింది. ఇకపై ఏం జరుగుతుందన్నది చెప్పడంతమ చేతుల్లోనూ లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
సెప్టెంబర్ 2023
డేనియల్ తుపాను లిబియాసహా ఆగ్నేయ యూరప్‌లోని కొన్నిప్రాంతాల్లో అకాల వరదలకుకారణమైంది. వేల మంది నిర్వాసితులయ్యారు. ఆస్తినష్టం రూ.16,658 కోట్ల పైమాటే!
2023 స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్
‘ఎంటరింగ్ అన్‌చార్టడ్ టెరిటరీ’పేరుతో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రెస్ గత నెలలో ఓ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఇక తప్పించుకునే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులు వస్తాయని, అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతాయని, కార్చిచ్చులు దహించి వేస్తాయని, పంట దిగుబడులు తగ్గడంతోపాటు సముద్రమట్టాలు పెరిగిపోయి భూమ్మీద మనిషి బతకడం అసాధ్యంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం తదితర అనేక చర్యల ద్వారా ఈ మార్పులను అడ్డుకోవచ్చని, భూతాపోన్నతిని కట్టడి చేయొచ్చని నిన్న మొన్నటివరకూ అనుకునేవారు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రకృతి వైపరీత్యాలను పరిశీలిస్తే.. అవేవీ సహజసిద్ధమైన వాతావరణ మార్పుల వల్ల వ చ్చినవి కావని, మానవ చర్యల పర్యవసానంగానే ఇవన్నీ జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ నివేదికను 2020లో రిపల్ అండ్ వూల్ఫ్‌లు మొదటిసారి సమర్పించినప్పటికీ తాజాగా 15,000 మంది శాస్త్రవేత్తలు ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రికార్డులు బద్ధలు
2023లో అసాధారణ ప్రకృతి వైపరీత్యాలు నమోదయ్యాయి. వాతావరణానికి సంబంధించి పలు రికార్డులు బద్ధలయ్యాయి. ప్రాంతాలకు అతీతంగా వడగాడ్పులు, రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఒక హెచ్చరికైతే.. సముద్ర ఉపరితల జలాల వేడి కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. అంటార్కిటికాలోనూ మునుపెన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై మొదట్లో భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే జూన్–ఆగస్టు మధ్యమునుపటితో పోలిస్తే ఎక్కువ వేడి ఉన్నట్లు రికార్డు అయ్యింది. బహుశా ఇది లక్ష ఏళ్ల చరిత్ర కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంచనాలకు అందని దశకు..
పారిశ్రామిక విప్లవ సమయానికి ముందునాటి ఉష్ణోగ్రతల కంటే భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత 2000 సంవత్సరం వరకూ ఏనాడూ 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ నమోదు కాలేదు. తరువాతి కాలంలోనూ అడపాదడపా ఈ స్థాయిని దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కానీ.. 2023లో మాత్రం సెపె్టంబరు 12 నాటికే మొత్తం 38 రోజులు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఏడాది పూర్తయ్యే సరికి ఇది మరింత పెరుగుతుందని అంచనా. 2023 జూలై 7న అంటార్కిటిక్ సముద్రం పరిసరాల్లోని మంచు ప్రాంతం ఉపగ్రహ సమాచారం లభించడం మొదలైన తరువాత అతితక్కువ విస్తీర్ణంలో ఉన్నట్లు స్పష్టమైంది. 1991–2023 మధ్య మంచుప్రాంతం కంటే 26.7 లక్షల చదరపు కిలోమీటర్లు తక్కువ.
మానవ చర్యల ఫలితమే...
ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలకు మానవ చర్యలే కారణమన్నది సుస్పష్టం. ఉదాహరణకు అట్లాంటిక్ మహా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కేందుకు ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో రేగే దుమ్ము, కురిసే వర్షపాతానికి సంబంధం ఉండటం. ఇంకో ఆసక్తికరమైన అంశం.. నీటిలోపల ఉన్న అగ్నిపర్వతాల నుంచి కొన్ని కి.మీ. ఎత్తువరకూ ఎగజిమ్మే నీటి ఆవిరి (కర్బన ఉద్గారం మాదిరే ప్రమాదకరమైంది) మోతాదులో తేడా వ చ్చినా భూతాపోన్నతి సంభవిస్తుంది.
ఏడాది కాలంగా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కర్బన ఉద్గారాల నియంత్రణ చర్యల్లో భాగంగా సముద్రయానానికి గంధకం తక్కువగా ఉన్న ఇంధనాలను వాడటం తప్పనిసరి చేయడమూ కావచ్చు. ఇవేవీ కాదనుకున్నా ఈ ఏడాది ఎల్ నినో కారణంగానూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎల్–నినో, లా–నినా వంటి సహజ ప్రక్రియలు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఎక్కువవుతాయి.
కిం కర్తవ్యం...
పరిస్థితి చేయిదాటిపోతోంది.. మరి గట్టెక్కేందుకు ఏం చేయాలి? ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికాభివృద్ధి పేరుతో ఇప్పుడు మనం చేస్తున్న విచ్చలవిడి కార్యకలాపాలకు తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాలి. శిలాజ ఇంధనాలు, నేల వినియోగంలో మార్పుల వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాల కట్టడికి శక్తులన్నీ కూడగట్టుకుని యత్నించాలి. కర్బన ఉద్గారాలను సహజసిద్ధంగా నిల్వ చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలి.
అదే సమయంలో వాతావరణంలోకి చేరిన అదనపు కార్బన్‌డయాక్సైడ్‌ను వేగంగా తొలగించేందుకు అన్ని రకాల వ్యూహాలను వాడుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో భూమి కొంచెం చల్లగా ఉంటుంది. వాతావరణంలోకి చేరుతున్న కార్బన్‌డయాక్సైడ్‌లో 80 శాతానికి కారణమవుతున్న బొగ్గు వాడకాన్ని వీలైనంత వేగంగా తగ్గించే ప్రయత్నం జరగాలి. ఈ శతాబ్దపు చివరి నాటికి 300 నుంచి 600 కోట్ల మంది ప్రజలు జీవించేందుకు అనువుగా లేని ప్రాంతాల్లో ఉంటారని అంచనా. ఇలాంటి మహా విపత్తుల పరిష్కార మార్గాలు కూడా అంతే పెద్దవిగా ఉండాలనడంలో సందేహం లేదు.
అవీ.. ఇవీ..
♦ కోవిడ్–19 సమయంలో కర్బన ఉద్గారాలు కొంతమేరకు తగ్గినప్పటికీ ఆ తరువాతి కాలంలో మునుపటి కంటే ఎక్కువయ్యాయి.
♦ సౌర, వపన విద్యుత్తుల వాడకం 2021–22 మధ్య 17 శాతం వరకూ పెరిగింది.. కానీ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఈ పెరుగుదల చాలాచాలా తక్కువ.
♦ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం యూరప్‌లో చౌక రష్యన్ సహజవాయువు నుంచి బొగ్గు వాడకం వైపు మళ్లించింది. ఫలితంగా ఇప్పటికే శిలాజ ఇంధనాలపై ఇచ్చే సబ్సిడీ విలువ 53,100 కోట్ల డాలర్ల (2021) నుంచి 1,09,700 కోట్ల డాలర్లు (2022)కు పెరిగిపోయింది.
♦ 2021–22 మధ్య భూమ్మీద చెట్లు వ్యాపించి ఉన్న విస్తీర్ణం ఏకంగా 9.7 శాతం తగ్గిపోయి 2.28 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది.
♦ కెనడాలో మునుపెన్నడూ లే¯స్థాయి లో అడవులు కార్చిచ్చులకు బలవుతున్నాయి. ఈ ఏడాది కోటీ 66 లక్షల హెక్టార్లలో అడవులు బూడిదయ్యాయి.
♦ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల మోతాదు కూడా బాగా ఎక్కువైంది. కార్బన్‌డయాక్సైడ్ ప్రతి పది లక్షల భాగాలకు 420 భాగాల స్థాయికి చేరింది.
♦ సముద్రాల ఆమ్లత, హిమానీనదాల మందం, గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు.. అన్నీ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో సముద్రమట్టం, ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.
జూలై–ఆగస్టు 2023
చైనా
బీజింగ్‌లో 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షం. 12.9 లక్షల మందిపై ప్రభావం... 1,47,000 ఇళ్లు ధ్వంసం... 33 మంది మృతి!
భారత్..
రుతుపవనాల వర్షాలు కాస్తా ఆకస్మిక వరదలుగా మారిపోయాయి. ఉత్తర భారతంలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా చనిపోయారు.
అమెరికాలో...
హవాయి ప్రాంతంలోని మావుయిద్వీపంలో కార్చిచ్చు ప్రబలి 111 మందిమృత్యువాత పడ్డారు.
-(కంచర్ల యాదగిరిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment