వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అంతా కలిసి గ్లాస్గో వెళ్లారు. అక్కడ ‘కాప్’ సదస్సు జరుగుతోందంటేనూ మనుషులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోడానికి వెళ్లా రంతే. దేశాధినేతలు ఒకరి తర్వాత ఒకరు లేచి భూతాపాన్ని తగ్గించేస్తాం అని చెప్పినప్పుడల్లా గ్రీష్మకు నవ్వాగడం లేదు. వాతావరణంలో అనూహ్య మార్పులకు అడ్డుకట్ట వేయా ల్సిందేనని వక్తలు సూచించినపుడు హేమంత అయితే నవ్వాపుకోలేక కింద పడిపోయింది. వర్ష, వసంత కలిసి ఆమెను పైకి లేవదీసి కూర్చోబెట్టారు. కర్బన ఉద్గారాలను బాగా తగ్గించేస్తున్నాం, ఇక ఓజోను పొరకు ప్రమాదం ఏమీ ఉండదని మరో వక్త అనగానే శిశిరకు ఒళ్లు మండిపోయింది. ఇక చాల్లేవే వెళ్దాం, ఇక్కడి నుంచి వీళ్ల అబద్ధాలు అకాల వర్షాలు తెచ్చిన అనూహ్య వరదలను మించి పోటెత్తుతున్నాయి అని వర్ష అనేసరికి ఆరు గురూ నవ్వుకుంటూ సభా ప్రాంగణం నుండి బయటకు వచ్చేశారు.‘నిజంగానే భూతాపాన్ని తగ్గిస్తారంటావా?’ అని ఆశగా అడిగింది శరత్.
‘ఊరుకోవే పిచ్చిదానా! నమ్మక నమ్మక మనుషులనే నమ్ముతావా?’ అని హేమంతం విసుక్కుంది. ‘మనం ఒకప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్లం. చైత్రం, వైశాఖం వచ్చిందంటే చాలు చెట్లు చిగురించి పూల గుత్తులతో నవ్వుతోంటే మన బిడ్డలే కదా అని మురిసిపోయేవాళ్లం. జ్యేష్ఠం, ఆషాఢం వస్తే మంచి ఎండలతో హానికారక క్రిము లను సంహరించి ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించి సంతోషించేవాళ్లం. శ్రావణ, భాద్రపదాల్లో... ఎండా కాలంలో భుగ భుగమని వేడెక్కిపోయి సెగలు కక్కి ఉక్కిరి బిక్కిరైపోయిన భూమితో పాటు చెట్టూ చేమపై అమృత జల్లు కురిసినట్లు వర్షాలు కురిపించి లోకానికి చల్లటి కబురు అందించేవాళ్లం. మార్గశిరంలో మంచు కురిసే వేళలో లోకమంతా హాయిగా మైమరచి ఉంటే మన వల్లనే కదా ఈ సుఖం అని ఆనందించేవాళ్లం. కొత్త చిగుళ్లకు పునాది వేయ డానికి మాఘ, పాల్గుణ మాసాల్లో ఆకులు రాల్చి వృక్షాల తలలు శుభ్రం చేసేవాళ్లం. ఇపుడివన్నీ కూడా తల్లకిందులు చేసేశారు మనుషులు’ అని హేమంతం కళ్లు తుడుచుకుంది.
‘అవునే, ఫలానా కాలం వస్తే వాతావరణం ఫలానా విధంగా ఉంటుందని ప్రాణికోటికి తెలిసేది. ఇపుడది లేదు. ఏ కాలంలో ఏం జరుగు తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరో ఎందుకు మనమే చెప్పలేకపోతున్నాం. ఆ మధ్య మండు వేసవి కాలం కదా, నాకు పనిలేదు కదా అని విశ్రాంతి తీసుకుందా మనుకున్నా. అంతలోనే అల్పపీడన ద్రోణి వచ్చి అమాంతం తట్టి లేపి డ్యూటీ కెళ్లాలంది. అప్పటికప్పుడు కుండపోత వర్షం కురిపించి ఇంటికి వచ్చేసరికి తెల్లారి పోయింది’ అని వర్ష ఫిర్యాదు చేసినట్లు ఏకరవు పెట్టింది.
కూర్చున్న గ్రీష్మ ఉన్నట్లుండి లేచి నిలబడి, ‘నువ్వే నేంటి? నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? మొన్నా మొన్నటి వరకు నడి వేసవిలో 40 డిగ్రీల సెల్సియస్ దాటకుండా డ్యూటీ చేసేదాన్ని. ఈ మనుషుల పాపమా అని కొన్నేళ్లుగా ఆ వేడి కాస్తా పెరుగుతూనే వస్తోంది. ఈ ఏడాది చాలా దేశాల్లో 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయే ఎండలతో మండి పోయాను. ఆ ఒళ్లు మంట ఇప్పటికీ తగ్గలేదు తెలుసా?’ అని గ్రీష్మ కోపంగా అంది.
‘భూమ్మీద 84 కోట్లకు పైగా జీవరాశులు ఉన్నాయి. పాపం ఏ జీవరాశీ ప్రకృతికి విరుద్ధంగా చిన్న ఉల్లంఘనకు పాల్పడలేదు. మనుషులు మాత్రం తమ ఇష్టారాజ్యం అన్నట్లు వినాశనాన్ని తెచ్చిపెడుతున్నారు. అభివృద్ధి ముసు గులో పరిశ్రమలు పెట్టి లోకాన్ని విష కాలుష్యంతో నింపే స్తున్నారు. మన అమ్మ భూదేవి కడుపులో రసాయిన ఎరువులు పోసేసి దాని అరోగ్యం పాడు చేస్తున్నారు. మనల్ని చల్లగా చూస్తోన్న ఆకాశాన్నీ వదిలి పెట్టకుండా కర్బన వాయువులు ఊదరగొట్టి ఆకాశానికి చిల్లులు పెట్టేస్తున్నారు. మన ఋతువులు గతి తప్పి ఇలాగే తిరిగితే మానవాళి మిగిలి ఉంటుందా అసలు?’ అని శరత్ శాపనార్థాలు పెట్టింది.
ఆరు ఋతువుల మాటలు గమనిస్తోన్న భూదేవి బాధగా దగ్గి, ‘ఊరుకోండర్రా. వాళ్లూ మన బిడ్డలే కదా. మనం అలా శపిస్తే పాపం వాళ్లేమైపోతారు?’ అని అమ్మలా అడిగింది. ఆకాశం కూడా, ‘అవునర్రా, భూమి చెప్పింది నిజం’ అంది. ఋతువులకు మండుకొచ్చింది. ‘మీ ఇద్దరికీ ఉన్నంత సహనం మాకు లేదు. మనుషులు తమ తప్పు సరిదిద్దుకుంటే మేం చల్లగానే చూస్తాం. కానీ ఈ తప్పులపై తప్పులు చేస్తే మాత్రం తరుముకు వచ్చే విపత్తులకు మా బాధ్యత లేదు’ అని నిష్కర్షగా చెప్పాయి. సకల జీవరాశులూ ఔనన్నట్లు తలలూపాయి. కాకపోతే ఈ భాషే ఇంకా మనిషికి అర్థం కావడం లేదు.
– సి.ఎన్.ఎస్. యాజులు
మొబైల్: 95055 55384
ఋతు ఘోష
Published Fri, Nov 12 2021 1:47 AM | Last Updated on Fri, Nov 12 2021 1:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment