ఆర్థిక వృద్ధి రేటుపై ప్రపంచానికి మితిమీరిన వ్యామోహం ఉంది. దీనివల్ల పర్యావరణానికి సంబంధించిన క్రమశిక్షణ కనుమరుగైపోయింది. ఆర్థిక వృద్ధి రేటు ఒక్కటి మెరుగ్గా ఉంటే చాలు, ‘అంతా బాగానే ఉంది’ అనే స్థితి అదే వస్తుందనే నమ్మకానికి అనుగుణంగా మనల్ని మలిచారు. కానీ ఈ పేరుతో సహజ వనరుల దోపిడీ ఎంత జరుగుతున్నదో మనం విస్మరిస్తున్నాం. నిజానికి ‘సహజ వనరులు, పర్యావరణ సేవలు’ అనేవి పరిశ్రమలకు ఉచితంగా అందిస్తూ చాలా వస్తువుల ఖర్చును సమాజమే పరోక్షంగా భరిస్తున్నది. పైగా ఇప్పటి ఆర్థిక విధానాలన్నీ సంపద ఒక్కచోట పోగయ్యేలా మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే వాతావరణ ఉపద్రవానికి దారితీస్తున్న ఆర్థిక రూపకల్పనకు మరమ్మతు చేయగలిగిన నాయకత్వం ప్రపంచానికి అవసరం.
ఐర్లండ్ అధ్యక్షుడు మైఖేల్ డేనియల్ హిగ్గిన్స్, ఆర్థిక పురోగతిపై మితిమీరిన వ్యామోహాన్ని తీవ్రంగా విమర్శించారు. చాలామంది ఆర్థికవేత్తలు ఎడతెగని వృద్ధి కథనంలో చిక్కుకుపోయి ఉన్నారనీ, సంకుచితంగా నిర్వచించిన సామర్థ్యం, ఉత్పాదకత, శాశ్వతమైన వృద్ధి ఫలితంగా పర్యావరణానికి సంబంధించిన క్రమశిక్షణ కనుమరుగైందనీ, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న జీవావరణ విపత్తుకు అదే కారణమనీ ఆయన పేర్కొన్నారు.
ఇది, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ముందు ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ దశాబ్దం క్రితం చేసిన ప్రసంగంలో చెప్పిన విషయాన్ని నాకు మళ్లీ గుర్తుకు తెస్తోంది. ‘వాతావరణ ఉప ద్రవానికి దారితీస్తున్న ఆర్థిక రూపకల్పనను మరమ్మతు చేయగలిగిన నాయకత్వం ప్రపంచానికి అవసరం’ అని ఆయన అన్నారు. మరో మాటల్లో చెప్పాలంటే, ఆయన కూడా, ప్రపంచాన్ని ఆకస్మికమైన, కోరుకోలేని మార్పులకు సన్నిహితంగా ప్రమాదకరంగా తీసుకెళు తున్న ఆర్థిక వృద్ధి నమూనాను మరమ్మతు చేయాల్సిన అవసరముందని మాట్లాడుతూ వచ్చారు.
అయితే ఈ హెచ్చరికను ఎవరూ వినిపించుకోలేదు. వాతావర ణాన్ని తట్టుకోగల విధానాలను చేపట్టవలసిన ఆవశ్యతకతపై అంత ర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసినప్పటికీ, మార్పు తేగలిగేలా చేపట్టాల్సిన విధానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. చివరకు వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) తాజా సంశ్లేషణాత్మక నివేదిక కూడా అందరూ జీవించదగిన, స్థిరమైన భవిష్యత్తును పదిలపర్చే అవకాశాల గవాక్షం వేగంగా మూసుకు పోతోందని స్పష్టంగా చెబుతోంది. అయినా జంట బ్రెట్టన్ వూడ్స్ సంస్థలు లేదా విదేశీ సంస్థాగత మదుపుదారులు, వేళ్లమీద లెక్కించదగిన క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇంకా మేల్కొనలేదు. మార్పు ఎంత ఎక్కువగా అవసరమో, మరింత ఎక్కువగా పరిణామాలు అలాగే ఉన్నాయి.
ప్రధాన స్రవంతి ఆలోచనను సవాలు చేసేలా సముచిత ప్రశ్న లను ఎప్పుడు లేవనెత్తినా, ఆర్థిక సమాజం నుంచి వచ్చే సామూహిక స్పందన ఏమిటంటే, ఆర్థికాన్ని అర్థం చేసుకోని వ్యక్తుల ఊహగా వాటిని పేర్కొంటూ ఆ బలమైన స్వరాలను కొట్టి వేస్తుంటారు. కార్పొరేట్ మీడియా స్పష్టంగానే ఈ అభిప్రాయాన్ని చాటిచెప్పడాన్ని ఇష్టపడుతుంటుంది. నిజానికి ముఖ్యమైన వార్తాపత్రికలలో ప్రచురి తమైన కథనాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇంకా అత్యధిక వృద్ధి వైపు తరలివెళ్లడం వైపు వాదనను బహిరంగంగా మళ్లించే విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యావేత్తలు, బ్యాంకులకు చెందిన ప్రధాన ఆర్థిక వేత్తలు పత్రికల స్థలాన్ని ఆక్రమించడం పెరుగుతున్నట్లు కనబడుతుంది. ఇవి సాధారణ సమర్థనలను కలిగి ఉంటాయి. కానీ ప్రపంచం ఎదుర్కొంటున్న మనుగడకి సంబంధించిన ప్రమాదం రీత్యా వారి స్వరంలో కొంతైనా మార్పు ఉండాలని నేను ఆశించాను.
మీడియాలో ఒక వర్గానికీ, వీధుల్లోని విద్యావంతులకూ ఇది సాధారణ వ్యవహారమే. దీనికి ప్రధానంగా మన సామూహిక ఆలోచనలో పాతుకుపోయిన ‘టిఐఎన్‌ఏ’ (దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్– ప్రత్యామ్నాయం అనేది లేదు) భావనే కారణం. మనం దీన్ని ఇష్ట పడినా లేకున్నా చెప్పాల్సింది ఏమంటే– ‘అంతా బాగానే ఉంది’ అనే స్థితికి ఆర్థిక వృద్ధి దారి తీస్తుందనే నమ్మకానికి అనుగుణంగా మనం మల్చబడ్డాము. దిగజారే వాతావరణ పరిస్థితులకు కూడా ఆర్థిక వృద్ధి రక్షకురాలిగా ఆవిర్భవిస్తుంది అనే సాధారణ ఆలోచన ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఎందుకంటే పర్యావరణ విధ్వంసంలోనూ, సహజవన రుల క్షీణతలోనూ, వాతావరణ విపత్తులోనూ మనం చూస్తున్న ఆదాయ అసమానత్వ విస్ఫోటనంలోనూ, ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మనకు చెప్పడాన్ని ఆర్థికవేత్తలు మానుకున్నారు. ఇవన్నీ కాలం చెల్లిపోయిన ఆర్థిక సూత్రాల ఫలితమే. కానీ అభివృద్ధి అనే సంతోషంలో మనం వాటిని విస్మరిస్తున్నాం.
తరం తర్వాత తరం గ్రహిస్తున్న ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలకు కాలే జీలలో, యూనివర్సిటీలలో చెబుతూ వస్తున్న బోధనలే సంపూర్ణ బాధ్యత వహిస్తున్నాయని ఐరిష్ అధ్యక్షుడు భావిస్తున్నారు. ఆర్థిక శాస్త్రాన్ని ఎలా బోధిస్తున్నారు, ఎలా ప్రశ్నిస్తున్నారు అనే అంశం అతి ముఖ్యమైనది అంటున్న ఆయన, ‘ఆర్థిక శాస్త్ర బోధనలో విధానాల బహుళత్వానికి వీలు కల్పించడం అంటే విద్యార్థుల ప్రాథమిక హక్కు లను, నిజానికి పౌరుల హక్కుల్ని లేకుండా చేయడమే’ అని చెప్పారు.
ఈ రచయిత కూడా, వృద్ధిని ప్రజాకేంద్రకంగా మార్చేందుకు, ఆర్థిక అధ్యయనాలకు సామాజికంగా, పర్యావరణపరంగా ప్రాసంగి కతను చేకూర్చడం కోసం, పైవిధమైన ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడు గుతూ వచ్చాడు. కానీ ప్రజలకు, భూమండలానికి సంబంధించినంత వరకు ఆర్థిక శాస్త్రంపై పునరాలోచన చేసే దిశగా మన ప్రధాన స్రవంతి చొరవ చేపట్టడం చివరిసారిగా ఎప్పుడు జరిగింది?
మొత్తం వ్యవస్థ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఉచిత సహజ పెట్టుబడితో పాటు (అంటే సహజ వనరులు, పర్యావరణ సేవలు అని అర్థం) ప్రభుత్వం నుంచి కూడా పరిశ్రమలు భారీ స్థాయిలో లాభా లను పొందుతున్నాయి. అసలైన మూల్యాన్ని పరోక్షంగా భారీ స్థాయిలో సమాజం భరించాక ధరలు స్థిరపడు తున్నాయి. మనం
కొంటున్న డాలర్ ఆహారం ధర నిజానికి మూడురెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారం ధర చౌకగా ఉండాలని కోరుకుంటు న్నాము కాబట్టి మనం దాన్ని ప్రశ్నించము. ఐక్యరాజ్యసమితి తరఫున ‘ది ఎకనమిక్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ’ (టీఈఈబీ) ఇటీవల ఓ అధ్యయనం చేసింది.
దక్షిణాసియాలో వరి, గోధుమతో సహా ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రాథమిక ఉత్పత్తి, ప్రాసెసింగ్ రంగాలు, అలాగే అమెరికాలో పశువుల పెంపకం వంటి వివరాలను ఇది పరిశీలించింది. ప్రతి యేటా వీటి కోసం 7.3 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులను మింగేస్తున్నారని తెలిపింది. ఇదంతా కూడా అధిక వృద్ధి రేటు అన్వేషణ పేరుతో జరుగుతోంది.
మనం మౌలిక వసతులపై ఉచితాలు, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, గుణాత్మక సడలింపు (అదనపు డబ్బును ముద్రించడం). భారీ ఎత్తున పన్ను రాయితీలు, బ్యాంకుల బకాయిల రద్దు వంటివాటిని చూసినట్ల యితే, ఆర్థిక సమతూకం సంపన్నులకు సేవ చేయడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని తెలుస్తుంది. ప్రయోజనాలు కింది దాకా ప్రయాణించాయన్న ఊహ కూడా చాలావరకు నిరాధారమైనదే. ఉదా హరణకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ జరిపిన అధ్యయనం 50 సంవత్సరాల కాలంలో (1965–2015), 18 సంపన్న దేశాల్లో పన్ను రాయితీలు ఆర్థికాభివృద్ధిపై, నిరుద్యోగంపై ఏమంత గణనీయ ప్రభావం చూపలేదని తెలిపింది. సులభంగా చెప్పాలంటే, ప్రభుత్వ ఖజానా నుంచి అత్యంత సంపన్న వర్గాల జేబుల్లోకి ఆదాయాన్ని పంపిణీ చేయడంలోనే ఈ పన్ను రాయితీలు విజయం సాధించాయి.
ప్రపంచ సంపదలో 48 శాతాన్ని 1 శాతం అగ్రశ్రేణి వర్గం సొంతం చేసుకుందని క్రెడిట్ స్విస్ సంస్థ అంచనా వేస్తుండగా, బహుళ జాతీయ సంస్థల లాభాల్లో 40 శాతం ప్రతి సంవత్సరం పన్నులు లేని దేశాలకు తరలిపోతున్నాయని అంచనా వేశారు. ఈ మొత్తం 2019లోనే 1 ట్రిలి యన్ డాలర్లుగా ఉండేది. గత దశాబ్దంలో వాల్ స్ట్రీట్ బ్యాంకులుసంపాదించిన మరొక ట్రిలియన్ డాలర్ల లాభాలను కూడా దీనికి జోడించండి. అసమర్థ ఆర్థిక వ్యవస్థ ఒకేచోట సంపదను కూడగట్టడంలో సాయపడిందని తెలుస్తుంది. ఆర్థిక వృద్ధి నమూనాకు కాలం చెల్లిపోయింది. ముంచుకొస్తున్న వాతావరణ విపత్తు గురించిన భయం, ప్రపంచాన్ని వృద్ధిపై తప్పని సరి వ్యామోహాన్ని వదులుకునేలా చేస్తుందని ఆశిద్దాము.
దేవీందర్ శర్మ, వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment