ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు
2050 నాటికి చాలా నగరాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలే!
ప్రారంభ వేడుకల సందర్భంగా వర్షం...
తర్వాత వారంపాటు దంచి కొట్టిన ఎండలు...
వారం పాటేమో ఆహ్లాదకర వాతావరణం...
ముగింపు రోజు మరోసారి ఠారెత్తించిన ఎండలు...
ఇదీ పారిస్ ఒలింపిక్స్‌తో వాతావరణం ఆటాడుకున్న తీరు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడా వేడుకల నిర్వహణను దేశాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ 2050 నాటికి చాలా దేశాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలగానే మిగలనుంది. ఆయా దేశాల్లో ఎండలు ఇప్పటికే ఠారెత్తిస్తుండటం, 2050కల్లా ప్రమాదకర స్థాయిని దాటేలా ఉండటమే ఇందుకు కారణం.
ఒలింపిక్స్ జరిగేదే ప్రధానంగా వేసవిలోనే. కనుక ఉష్ణోగ్రతలు 27.8 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటి నిర్వహణను రద్దు చేయాలన్నది అంతర్జాతీయ క్రీడా నిపుణుల సిఫార్సు. ఆ లెక్కన గతంలో ఒలింపిక్ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా (అమెరికా), బీజింగ్ (చైనా), ఏథెన్స్ (గ్రీస్), టోక్యో (జపాన్) వంటి పలు నగరాలకు ఇంకెప్పటికీ ఆ అవకాశం దక్కబోదు. ఆ నగరాల్లో వేసవిలో ఎండలు మండిపోవడం పరిపాటిగా మారింది.
అంతేకాదు, వచ్చే (2028) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎండలపరంగా చూసుకుంటే ఏ మేరకు సురక్షితమన్న ఆందోళన ఇప్పట్నుంచే మొదలైంది. ఆదివారం అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటేయడమే ఇందుకు కారణం! పారిస్‌లో ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి!
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో, రోజురోజుకూ ప్రమాదం అంచులకు నెడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం మరో తార్కాణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో చాలావరకు 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉండబోవని ప్రఖ్యాత క్లైమేట్ సైన్స్, అనలిటిక్స్ స్వచ్ఛంద సంస్థ ‘కార్బన్‌ప్లాన్’ హెచ్చరించింది. వాటిలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల ధోరణి ఆధారంగా రూపొందించిన గణాంకాలతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ మేరకు పేర్కొంది.
ఎన్నో సమస్యలు...
ఎండలు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధిని దాటితే ఒలింపిక్స్ నిర్వహణకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు...
→ ప్రఖ్యాత అథ్లెట్లు చాలా మంది ప్రధానంగా చలి దేశాల నుంచే వస్తారు. ఈ స్థాయి ఎండలను వాళ్లు అస్సలు తట్టుకోలేరు
→ దాంతో క్రీడాకారులు ఎండకు సొమ్మసిల్లిపోవడం, వడదెబ్బ బారిన పడటం వంటి సమస్యలు పొంచి ఉంటాయి
→ ఇవి వారిలో తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది.
→ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి 100 మంది అథ్లెట్లలో ఒకరు ఎండలకు తాళలేక కళ్లు తేలేశారు!
→ దాంతో మారథాన్, వాకింగ్ వంటి ఈవెంట్లను పర్వతప్రాంత నగరమైన సపోరోకు మార్చినా లాభం లేకపోయింది. ఆరుగురు వాకర్లు, రన్నర్లు వడదెబ్బ బారిన పడ్డారు.
ఇలా కొలుస్తారు...
సమస్యలకు దారితీసే స్థాయి ఎండ వేడిమిని వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్‌గా పిలుస్తారు. వేడి, తేమ, గాలి వేగం, సూర్యుని కోణం, మేఘావరణం వంటి పలు అంశాల ప్రాతిపదికన దీన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఒలింపిక్స్ నిర్వహణకు సురక్షితమైన ఉష్ణోగ్రత
పరిధి 27.8 డిగ్రీ సెల్సియస్‌గా నిర్ణయించారు. ఎండలు అంతకు మించితే పోటీల వాయిదా, అవసరమైతే రద్దు తప్పనిసరని అంతర్జాతీయ క్రీడా నిపుణులు చెబుతారు.
వచ్చే ఒలింపిక్స్ సంగతి ఏమిటీ?
2028 ఒలింపిక్స్‌కు వేదిక అమెరికాలోని లాస్ ఏంజెలెస్. అక్కడ పసిఫిక్ గాలుల కారణంగా వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదని భావించారు. కానీ ఒకట్రెండేళ్లుగా లాస్ ఏంజెలెస్‌లో ఎండలు గట్టిగానే ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా ఆదివారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు అక్కడ క్రమంగా పరిపాటిగా మారుతుండటం ఒలింపిక్ కమిటీని ఇప్పటినుంచే ఆందోళనపరుస్తోంది. 2032 ఒలింపిక్స్‌కు ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ వేదిక కానుంది. వేసవిలో అక్కడ కూడా ఎండలు ఠారెత్తిస్తాయి. కానీ ఒలింపిక్స్ నిర్వహించే జూలై చివరి నాటికి శీతాకాలమే ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండబోదని భావిస్తున్నారు.
మనకు కష్టమే!
2036 ఒలింపిక్స్ వేదిక ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద పరీక్షగానే మారనుంది. అందుకు బిడ్స్ వేసిన ఆరు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడా సంరంభాన్ని నిర్వహించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఇండొనేసియా నూతనంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రాజధాని నుసంతర, దోహా (ఖతర్), ఇస్తాంబుల్ (తుర్కియే), వార్సా (పోలండ్), శాంటియాగో (చిలీ) కూడా బరిలో ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతల కోణంలో చూస్తే అహ్మదాబాద్, çనుసంతర, దోహాల్లో ఒలింపిక్స్ నిర్వహణ అస్సలు సాధ్యపడకపోవచ్చు. ఇది అంతిమంగా వార్సా, శాంటియాగోలకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. వాటి తర్వాత ఇస్తాంబుల్ కూడా ఉష్ణోగ్రతపరంగా కాస్త అనువుగానే ఉండనుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుమతించే పక్షంలో అహ్మదాబాద్‌కు చాన్సుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment