
న్యూఢిల్లీ/వాషింగ్టన్: సముద్ర తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ముంచుకొస్తోంది. ఇంకో 30 ఏళ్లలో ఒక్క భారత్‌లోనే సుమారు మూడున్నర కోట్లమంది ముంపు ముప్పును ఎదుర్కోనుండటం ఇందుకు కారణం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలాకాలంగా తెలిసినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం ఇప్పటివరకూ తక్కువ అంచనా వేశాం. అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ జరిపిన తాజా అధ్యయనం పాత అంచనాలను మార్చేస్తోంది. గతంలో కంటే కనీసం ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ స్థాయిలో నష్టం జరగనున్నట్లు చెబుతోంది. చైనాలో 9 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.3 కోట్ల మందికి ముంపు ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
అధ్యయనంలోని ముఖ్యాంశాలు
► భూతాపోన్నతి ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు ఎంత మేరకు పెరుగుతాయి? అదే సమయంలో తీరప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య ఎంత మేరకు ఎక్కువవుతుంది? అన్న రెండు అంశాల ఆధారంగా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.
► ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపు బారిన పడే చాన్సుంది. భారత్ విషయానికొస్తే.. సుమారు కోటిన్నర మంది ప్రజలు ఏటా వరద, ముంపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
► ముంబై, నవీ ముంబై, కోల్‌కతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ. గత అంచనాల ప్రకారం ఈ సంఖ్య కేవలం 50 లక్షలు.
► 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 11–16 సెంటీమీటర్లు పెరిగింది. కార్భన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించినప్పటికీ ఈ శతాబ్దంలో సముద్ర మట్టం మరో 0.5 మీటర్లు పెరగనుంది.
► 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది వార్షిక వరదల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉండగా.. శతాబ్దం చివరినాటికి ఈ సంఖ్య 63 కోట్లను దాటనుంది.
ఎత్తైన అల స్థాయిలో 25 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అలల ఎత్తుకంటే పదిమీటర్ల ఎక్కువ ఎత్తులో నివసిస్తోన్న తీరప్రాంత ప్రజలే వంద కోట్ల మంది ఉండగా.. మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉండేవారే 25 కోట్ల మంది ఉన్నారు. వరదల ప్రభావానికి గురయ్యేవారిలో 70 శాతం మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశస్తులేనని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment