Sea Level
-
‘పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలే జలసమాధి’
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’ అని హెచ్చరించారు. చదవండి: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి -
గ్రీన్‌ల్యాండ్ కరుగుతోంది!
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు పెరిగిపోతూ భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల (4,70 లక్షల కోట్ల టన్నులు) హిమం కరిగిపోయిందంటే ఏ స్థాయిలో కరిగిందో అంచనావేయొచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. ఆ అధ్యయనం విశేషాలు తెలుసుకుందామా..! 2002 నుంచి గ్రీన్లాండ్లో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమెట్ ఎక్స్పరిమెంట్ (గ్రేస్) ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్స్ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే ఫలకల మధ్యప్రాంతంలో మంచు పరిమాణం ఒకింత పెరిగిందని, ఇది పెరగడానికి కారణం హిమపాతమని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఉపరితల జలాలు పెద్దమొత్తంలో వేడెక్కుతున్న పశ్చిమ గ్రీన్లాండ్ తీరంలో ఎక్కువ మంచు కరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెప్పింది. అంటార్కిటికాలో కరిగితే.. అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్లాండ్లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాపస్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్లాండ్ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్ పేర్కొన్నారు. 2300 నాటికి 4 అడుగులు... ♦2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు నడుచుకున్నా 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ♦సముద్రమట్టాల పెంపుతో షాంఘై నుంచి లండన్ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్‌లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. ♦ఈ ముప్పు తప్పించాలంటే మనం కర్భన ఉద్గారాలను వీలైనంత త్వరగా నియంత్రించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ♦ఈ శతాబ్దం రెండో సగానికి వచ్చే నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకురావాలని పర్యావరణ ఒప్పందాలు ఇప్పటికే లక్ష్యం విధించాయి. ♦పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల మహాసముద్రాల మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. ♦పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 నాటికి సుమద్రమట్టాలు అదనంగా 20 సెం.మీ. మేర పెరుగుతాయి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సీఓ2 ఎఫెక్ట్.. సముద్రమట్టాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు అంతకంతకూ పెరిగిపోతున్న కారణంగా గత దశాబ్ద కాలంలో సముద్ర మట్టాలు ఏడాదికి సగటున 4.8 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయని అంతర్జాతీయ శాస్త్ర వేత్త డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. ఈ పెరుగుదల గత రెండు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉందని, పైగా సముద్రమట్టాల పెరుగుదల రేటు కూడా పెరిగిందన్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 60వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శేఖర్ సి మాండే, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వి.ఎం.తివారీ పాల్గొన్నారు. సూర్యుడి నుంచి భూమిని చేరుతున్న శక్తి ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి రూపంలో మళ్లీ అంతరిక్షంలోకి మళ్లే శక్తి తక్కువ కావడం వల్ల భూతాపోన్నతి పెరుగుతున్న విషయం తెలిసిందే. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలు భూతాపోన్నతి వేగాన్ని పెంచుతున్నాయని, 2010–2020 మధ్యకాలంలో వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు రికార్డు స్థాయికి చేరడం గమనార్హమని డాక్టర్ అనీ కాజనేవ్ తెలిపారు. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ ఏడాది మార్చిలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు తగ్గినప్పటికీ ఆ తరువాత షరా మామూలుగా మారిపోయిందన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850–2019 మధ్యకాలంలో ఒక డిగ్రీ సెల్సియస్ వరకు పెరగ్గా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఆమె వివరించారు. హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాల పెరుగుదలలో వేగం ఎక్కువైందని చెప్పారు. 1900–1990 మధ్యకాలంలో ఇది 15 సెంటీమీటర్లుగా ఉందని, ఆ తరువాత కాలంలో ఉపగ్రహాల సాయంతో సముద్రమట్టాలపై జరిపిన పరిశీలన కూడా ఇదే తీరులో కొనసాగుతోందన్నారు. -
50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
న్యూఢిల్లీ: 50 ఏళ్లలో భారత తీరం వెంబడి సముద్రమట్టం 8.5 సెంటీమీటర్లు పెరిగిందని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌తో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదు దశాబ్దాల్లో భారత తీరం వెంబడి సముద్ర మట్టం సగటున సంవత్సరానికి సుమారు 1.70 మిల్లీమీటర్లు పెరిగిందన్నారు. శాటిలైట్ అల్టిమెట్రి, మోడల్ సిమ్యులేషన్ ప్రకారం 2003–13 మధ్య ఉత్తర హిందూ మహా సముద్రం వైవిధ్యతను ప్రదర్శించిందని, సంవత్సరానికి 6.1 మి.మీ మేర పెరిగిందని రాతపూర్వకంగా బదులిచ్చారు. సునామీ, తుఫాను ప్రభావం, తీర ప్రాంతంలో వరదలు కూడా సముద్రమట్టం పెరుగుదలకు కారణమవుతాయని తెలిపారు. -
ముంపు ముప్పు ముంచుకొస్తోంది!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: సముద్ర తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ముంచుకొస్తోంది. ఇంకో 30 ఏళ్లలో ఒక్క భారత్‌లోనే సుమారు మూడున్నర కోట్లమంది ముంపు ముప్పును ఎదుర్కోనుండటం ఇందుకు కారణం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలాకాలంగా తెలిసినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం ఇప్పటివరకూ తక్కువ అంచనా వేశాం. అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ జరిపిన తాజా అధ్యయనం పాత అంచనాలను మార్చేస్తోంది. గతంలో కంటే కనీసం ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ స్థాయిలో నష్టం జరగనున్నట్లు చెబుతోంది. చైనాలో 9 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.3 కోట్ల మందికి ముంపు ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► భూతాపోన్నతి ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు ఎంత మేరకు పెరుగుతాయి? అదే సమయంలో తీరప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య ఎంత మేరకు ఎక్కువవుతుంది? అన్న రెండు అంశాల ఆధారంగా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ► ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపు బారిన పడే చాన్సుంది. భారత్ విషయానికొస్తే.. సుమారు కోటిన్నర మంది ప్రజలు ఏటా వరద, ముంపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► ముంబై, నవీ ముంబై, కోల్‌కతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ. గత అంచనాల ప్రకారం ఈ సంఖ్య కేవలం 50 లక్షలు. ► 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 11–16 సెంటీమీటర్లు పెరిగింది. కార్భన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించినప్పటికీ ఈ శతాబ్దంలో సముద్ర మట్టం మరో 0.5 మీటర్లు పెరగనుంది. ► 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది వార్షిక వరదల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉండగా.. శతాబ్దం చివరినాటికి ఈ సంఖ్య 63 కోట్లను దాటనుంది. ఎత్తైన అల స్థాయిలో 25 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అలల ఎత్తుకంటే పదిమీటర్ల ఎక్కువ ఎత్తులో నివసిస్తోన్న తీరప్రాంత ప్రజలే వంద కోట్ల మంది ఉండగా.. మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉండేవారే 25 కోట్ల మంది ఉన్నారు. వరదల ప్రభావానికి గురయ్యేవారిలో 70 శాతం మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశస్తులేనని వెల్లడించింది. -
లాహిరి.. లాహిరి..లాహిరిలో...
భూగోళం రోజురోజుకీ వేడెక్కిపోతోంది..హిమనీనదాలు కరిగిపోతున్నాయి..సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి ఇది మనం చాన్నాళ్ల నుంచీ వింటున్నదే.. దీని వల్ల భవిష్యత్తులో తీరప్రాంతాల్లోని నగరాల్లో దాదాపు 90 శాతం ముంపునకు గురవుతాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు..మరి దీనికి పరిష్కారం ఏమిటి? తేలియాడే నగరాలు అవును.. ఓషియానిక్స్ అని పిలిచే ఈ తేలియాడే నగరాలను నిర్మిస్తే ఎలాగుంటుందన్న విషయంపై ఐక్యరాజ్యసమితి కాస్త సీరియస్‌గానే ఆలోచిస్తోంది. ఐరాసకు చెందిన యూఎన్ హ్యాబిటాట్ సంస్థ ఇప్పటికే ఓషియానిక్స్ అనే ప్రైవేటు సంస్థతోపాటు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ది ఎక్స్‌ప్లోరర్ క్లబ్ అనే సంస్థతో కలిసి ఈ దిశగా పనిచేస్తోంది. ‘అటు వాతావరణ మార్పులు.. ఇటు తీర ప్రాంత నగరాల్లో జనాభా పెరుగుతోంది..ఈ సమస్య పరిష్కారాల్లో ఈ తేలియాడే నగరాలు కూడా ఒకటి’ అని యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ షరీఫ్ చెప్పారు. సముద్రంపై ప్లాట్ఫారంలాంటిదాన్ని ఏర్పాటు చేసి.. వాటిపై గృహసముదాయాలను నిర్మిస్తారు. నౌకకు లంగరు వేసినట్లు.. వీటన్నిటికీ అలాంటి ఏర్పాటు ఉంటుంది. ఒక వలయం తరహాలో ఇవన్నీ అనుసంధానమై ఉంటాయి. పంటలను ఇక్కడే పండించుకుంటారు. ఈ నగరాలకు కావాల్సిన విద్యుత్‌ను జల, పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే ఏర్పాట్లు కూడా ఉంటాయి. తొలి దశలో దీనికి సంబంధించిన ఓ నమూనాను ‘ఓషియానిక్స్’ సంస్థ నిర్మించనుంది. దీన్ని న్యూయార్క్‌లోని ఈస్ట్ రివర్ వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవనున్నాయి. ఇదిలా ఉండగా.. భూతాపం, వాతావరణ మార్పులు వంటి సమస్యల తాలూకు అసలు మూలాలను వదిలేసి.. ఇలాంటి తాత్కాలిక పరిష్కారాలు ఎంతవరకూ సబబని ప్రశ్నించేవారూ ఉన్నాయి. ఇలాంటివాటి వల్ల అసలైన సమస్య నుంచి మన దృష్టి మరలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇలాంటి తేలియాడే నగరాలు సంపన్నులకు మాత్రమే పరిమితమవుతాయని.. సామాన్యుల గతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నీటి ముప్పు తప్పదా?
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్, గ్రీన్హౌస్ ఉద్గారాలు, ఇంధన వనరుల వినియోగంతో భూతాపం రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ధృవ ప్రాంతాల్లోని మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సముద్రతీర ప్రాంతాలు నీట మునగడానికి ఇవే ప్రధాన కారణాలు. అయితే రోజురోజుకీ పెరిగిపోతున్న ప్రకృతి విధ్వంసం కారణంగా 2100 నాటికి సముద్ర మట్టం 8 అడుగులు పెరగనుండగా, ఇది 2300 నాటికి ఏకం గా 50 అడుగులకు చేరుకోనుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల తాజా అధ్యాయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘ఈ శతాబ్ధం ప్రారం భం నుంచి ప్రపంచ వ్యాప్తంగా సరాసరి సముద్ర మట్టాలు 0.2 అడుగులు పెరిగాయని అమెరికాలోని రూట్జర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ జనాభాలో సుమారు 11 శాతం మంది ప్రజలు సముద్ర మట్టానికి 33 అడుగుల లోపుఉన్న ప్రాంతాల్లో నివిసిస్తున్నారు. నీటి మట్టాల పెరుగుదల వల్ల ఇలాంటి ఎంతో మంది మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
కడలి కబళిస్తోంది!
- ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు - 1901–2010 మధ్య 19 సెంటీమీటర్లు పెరుగుదల - 2100 నాటికి మీటరు నుంచి 7 మీటర్లకు పెరిగే అవకాశం - భారత్ సహా చాలా దేశాల్లో తీర ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం అలలు అలలుగా ఎగసిపడే సాగర కెరటాలు నెమ్మదిగా భూమిని కబళిస్తున్నాయి. భూవాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తోంది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇటీవల ఈ పెరుగుదల వేగం బాగా పెరిగిందని చెబుతున్నారు. 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరు వరకూ పెరగవచ్చని.. అదే ధ్రువప్రాంతాల్లోని మంచుదుప్పటి కరిగితే ఏడు మీటర్ల వరకూ కూడా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే చాలా దేశాల్లో తీర ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోతాయని చెబుతున్నారు. సుదీర్ఘ తీరం ఉన్న భారతదేశానికి, ఇందులోనూ లోతట్టు ప్రాంతమైన తూర్పు తీర ప్రాంతానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఎలా ఉంటాయి, ఎంత మేర పెరుగుతాయి, దాని పర్యవసానాలేమిటనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ అధ్యయనాలు, పరిశోధనలపై ఈ వారం సాక్షి ‘ఫోకస్’.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ సాధారణంగా సముద్ర మట్టాలు స్థిరంగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ భూమి చరిత్రను చూస్తే సముద్ర మట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతోంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామాలతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనిస్తూ ఉంది. మధ్యలో ఉష్ణకాలం వస్తూంటుంది. అయితే చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండంలో అత్యధిక భాగం మంచుతోనే నిండి ఉండేది. అప్పుడు సముద్ర మట్టం ఇప్పటికన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణకాలంలో ఉన్నాం. అంటే.. ఇప్పుడు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతూపోతాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పులు ఈ చక్రాన్ని మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో సముద్ర మట్టాల్లో మార్పులు చాలా నెమ్మదిగా సంభవించేవని, కొన్ని వేల ఏళ్లు పట్టేవని.. కానీ ఇప్పుడు భూతాపం పెరుగుతుండటం సముద్ర మట్టాలు వేగంగా పెరగడానికి కారణమవుతోందని అంటున్నారు. శరవేగంగా పెరుగుతున్న మట్టాలు భూతాపం పెరిగి ధ్రువాల్లో మంచు దుప్పటి కరిగిపోతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు కరుగుతుండటం వంటి పరిణామాల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901–2010 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పులపై ప్రపంచ సంఘం (ఐపీసీసీ) ఐదో అంచనా నివేదిక ఇటీవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 1901–2010 మధ్య ఏటా సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు అంచనా. అయితే 1971–1993 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లుగా ఉండగా.. 1993–2010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ లెక్కన గత రెండు దశాబ్దాల్లో సముద్ర మట్టం వేగంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల ద్వారా పరిశీలనతో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇక ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుంచి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ మేగజైన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అంతకుముందు దశాబ్దకాలంలో ఇక్కడి సముద్ర మట్టం పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ హవాయి సీలెవల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే బంగ్లాదేశ్‌లో నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పలు తీరప్రాంతాలూ మునిగాయి. ఇక మన దేశంలోని పశ్చిమ బెంగాల్లో కోల్‌కతా వద్ద రివర్ డెల్టా సుందర్బన్ మడ అడవులు నీటి మునిగిపోయాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగినట్టయితే సముద్ర మట్టం 4.7 మీటర్లకు.. 4 డిగ్రీలు పెరిగితే 9 మీటర్ల వరకు పెరిగే అవకాశముంది. 2050 నాటికి 4 కోట్ల మందికి ముప్పు ఈ శతాబ్దం చివరి నాటికి.. అంటే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరగవచ్చని ఐపీసీసీ అంచనా. గ్రీన్‌ల్యాండ్ మంచు దుప్పటి పూర్తిగా కరిగినట్లయితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే లండన్ నగరం సముద్రంలో మునిగిపోతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని అంచనా.. అదే నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్ ఆఫ్ త్రెటెన్డ్ టాక్సా మేగజైన్లో ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణా మడ అడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ వనాలు సగానికిపైగా మునిగిపోతాయి. సముద్ర మట్టం ఆరు మీటర్లకు పైగా పెరిగితే గోదావరి, కృష్ణా మడ అడవులు, సుందర్బన్ అడవులతో పాటు గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్ర గర్భంలో చేరుతాయి. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి. సముద్రమట్టం పెరుగుదల వల్ల 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గతేడాది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా ముంబై, కోల్‌కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. తూర్పు తీరానికే ముప్పు ఎక్కువ భారతదేశంపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావంపై ఇటీవల రాజ్యసభలో ఒక సభ్యుడు ప్రశ్నించగా.. కేంద్ర భూగోళశాస్త్రాల శాఖ మంత్రి జవాబిచ్చారు. ఈ అంశంపై అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నామని.. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాలు వరద ముంపునకు గురవడం పెరుగుతోందని పేర్కొన్నారు. గత పాతికేళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందని వెల్లడించారు. ఈ కోతను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని, కేంద్రం సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. వందేళ్లలో విశాఖ సగం మునుగుతుంది! ఇక రాబోయే వందేళ్లలో మన దేశంలోని కోల్‌కతా, ముంబై, కొచ్చి, విశాఖపట్నం తదితర తీర ప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే అవకాశముందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన కోల్‌కతా వద్ద సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది. అక్కడ ఏటా సగటు సముద్ర మట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లుగా నమోదైంది. దాని తర్వాతి స్థానంలో కొచ్చి ఉంది. ఇక్కడ సముద్ర మట్టం ఏటా 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇక ముంబై వద్ద 1.25 మిల్లీమీటర్ల చొప్పున, ఆంధ్రప్రదేశ్‌లోని తీర నగరం విశాఖపట్నంలో 1.09 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. దేశంలో సముద్ర ముంపు ప్రమాదమున్న నాలుగో నగరం విశాఖ పట్నమే కావడం గమనార్హం. మొత్తంగా భారతదేశపు సముద్ర మట్టాలు ఏటా సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. సముద్రమట్టం పెరగడానికి కారణాలేమిటి..? కరుగుతున్న మంచు ఖండాలు భూగోళం ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామీకరణ ముందు నాటికన్నా ఇప్పడు ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది. వాతావరణంలో కర్బన శాతం పెరగడం ఇదే రీతిలోనే కొనసాగితే.. ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే భూమి మీదున్న మంచు అంతా కరిగిపోవడానికి మరో ఐదు వేల సంవత్సరాల సమయం పడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడెక్కుతున్న సముద్ర జలాలు ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు అవి పైకి ఉబికిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు వ్యాకోచించి.. నీటిమట్టం పెరుగుతోంది. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే ‘థర్మల్ ఎక్స్పాన్షన్’అని వ్యవహరిస్తున్నారు. దేశాలకు దేశాలే మాయమవుతాయి భూమిపై ఉన్న మంచు మొత్తం కరిగితే చాలా దేశాల రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే మునిగిపోతాయి. ఇక సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలైతే పూర్తిగా నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచు అంతా కరిగి సముద్ర మట్టం పెరిగితే వివిధ ఖండాల రూపురేఖలు ఎలా మారతాయో అంచనాలతో మ్యాపులు తయారు చేశారు. అందులో ఆసియా ఖండం మ్యాపు ఇది. దీని ప్రకారం.. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్ మొత్తం సముద్ర గర్భంగా మారుతుంది. భారత తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారిపోతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా తీర ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి. భూమి కూడా నిస్సారమవుతుంది చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కింద ముగిసింది. అప్పట్లో సముద్ర మట్టాలు పెరగడం మొదలైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్ర మట్టాల పెరుగుదల ఇంతవరకు మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి. కోట్లాది మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్ర మట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మందికిపైగా జీవితాలు ముంపు బారిన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫానులు భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంట భూముల కిందకు ఉప్పు నీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరిణామాలూ సంభవిస్తాయి. నివారించడానికి ఏం చేయాలి? ఇప్పటికే భారీ మొత్తంలో కర్బన వాయువులు వాతావరణంలో చేరిపోయాయి. వాటిని తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఆ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. అంటే మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. అయితే ఈ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్ మొక్కలు చనిపోకుండా చూడాలి. ఉన్న మంచు అంతా కరిగిపోతే..? భూమి మీద ప్రస్తుతం దాదాపు యాభై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అందులో అత్యధికంగా అంటార్కిటికా, గ్రీన్లాండ్లలోనే ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు 230 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. భారతదేశం కన్నా రెట్టింపు ఉన్న అంటార్కిటికా ఖండం మొత్తాన్ని ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగితే సముద్ర మట్టం ఏకంగా 200 అడుగులు పెరుగుతుంది. అయితే అంటార్కిటికా ఖండంలోని చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుందని అంచనా. ఇక గ్రీన్లాండ్లో విస్తరించి ఉన్న మంచు అంతా కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లలో కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా వేగంగా కరుగుతోంది. దాంతో చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి. -
వందేళ్లలో నీట మునగనున్న మహానగరాలు
లండన్: రానున్న వందేళ్ల కాలంలో సముద్రపు నీటి మట్టాలు మూడు మీటర్ల కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటివరకు భావిస్తున్న దాని కన్నా ఇది అర మీటరు మేర ఎక్కువని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం మాదిరిగానే ఇకపై కూడా కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలు విడుదల అయితే ప్రపంచానికి జరిగే నష్టాలను అంచనా వేసేందుకు యూకేలోని సౌత్‌హాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. అంటార్కిటికా ప్రస్తుతం కోల్పోతున్న ద్రవ్యరాశి, నూతన గణాంక పద్ధతి ప్రకారం 2100 సంవత్సరం నాటికి సముద్ర నీటి మట్టాలు మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రొఫెసర్ సైబ్రేన్ డ్రిజ్ఫౌట్ తెలిపారు. అంతేగాక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని శతాబ్దాల్లోనే ప్రపంచవ్యాప్తంగా లోతట్టు నదీ డెల్టాల్లో నిర్మించిన అనేక మహానగరాలు ముంపుకు గురవుతాయన్నారు.