
భూగోళం రోజురోజుకీ వేడెక్కిపోతోంది..హిమనీనదాలు కరిగిపోతున్నాయి..సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి ఇది మనం చాన్నాళ్ల నుంచీ వింటున్నదే.. దీని వల్ల భవిష్యత్తులో తీరప్రాంతాల్లోని నగరాల్లో దాదాపు 90 శాతం ముంపునకు గురవుతాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు..మరి దీనికి పరిష్కారం ఏమిటి? తేలియాడే నగరాలు అవును.. ఓషియానిక్స్ అని పిలిచే ఈ తేలియాడే నగరాలను నిర్మిస్తే ఎలాగుంటుందన్న విషయంపై ఐక్యరాజ్యసమితి కాస్త సీరియస్‌గానే ఆలోచిస్తోంది. ఐరాసకు చెందిన యూఎన్ హ్యాబిటాట్ సంస్థ ఇప్పటికే ఓషియానిక్స్ అనే ప్రైవేటు సంస్థతోపాటు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ది ఎక్స్‌ప్లోరర్ క్లబ్ అనే సంస్థతో కలిసి ఈ దిశగా పనిచేస్తోంది. ‘అటు వాతావరణ మార్పులు.. ఇటు తీర ప్రాంత నగరాల్లో జనాభా పెరుగుతోంది..ఈ సమస్య పరిష్కారాల్లో ఈ తేలియాడే నగరాలు కూడా ఒకటి’ అని యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ షరీఫ్ చెప్పారు. సముద్రంపై ప్లాట్‌ఫారంలాంటిదాన్ని ఏర్పాటు చేసి.. వాటిపై గృహసముదాయాలను నిర్మిస్తారు. నౌకకు లంగరు వేసినట్లు.. వీటన్నిటికీ అలాంటి ఏర్పాటు ఉంటుంది. ఒక వలయం తరహాలో ఇవన్నీ అనుసంధానమై ఉంటాయి. పంటలను ఇక్కడే పండించుకుంటారు.
ఈ నగరాలకు కావాల్సిన విద్యుత్‌ను జల, పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చే ఏర్పాట్లు కూడా ఉంటాయి. తొలి దశలో దీనికి సంబంధించిన ఓ నమూనాను ‘ఓషియానిక్స్’ సంస్థ నిర్మించనుంది. దీన్ని న్యూయార్క్‌లోని ఈస్ట్ రివర్ వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవనున్నాయి. ఇదిలా ఉండగా.. భూతాపం, వాతావరణ మార్పులు వంటి సమస్యల తాలూకు అసలు మూలాలను వదిలేసి.. ఇలాంటి తాత్కాలిక పరిష్కారాలు ఎంతవరకూ సబబని ప్రశ్నించేవారూ ఉన్నాయి. ఇలాంటివాటి వల్ల అసలైన సమస్య నుంచి మన దృష్టి మరలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ఇలాంటి తేలియాడే నగరాలు సంపన్నులకు మాత్రమే పరిమితమవుతాయని.. సామాన్యుల గతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment