కిల్లర్ రోబోలతో గేమ్స్ వద్దు
సాక్షి, సిడ్నీ: కిల్లర్ రోబోలతో చెలగాటం వద్దని, వాటిని తక్షణమే నిలిపివేసేందుకు చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు, ప్రముఖ టెక్నాలజీ లీడర్లు ఐక్యరాజ్యసమితికి పిలుపు ఇచ్చారు. కృత్రిమ మేథతో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేయడం ఆపాలని, ఒకసారి ఈ తరహా వ్యవస్థకు ఆజ్యం పోస్తే దాన్ని ఆపడం కష్టమని, అది విశృంఖలతకు దారితీస్తుందని హెచ్చరించారు. కృత్రిమ మేథపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ఈ మేరకు ఐరాసకు విజ్ఞప్తి చేసింది. యుద్ధంలో రసాయన, బయలాజికల్ ఆయుధాలతో సమానంగానే వీటిని పరిగణించాలని పేర్కొంది.
ఒకసారి కిల్లర్ రోబోట్స్‌ను అభివృద్ధి చేస్తే అవి రెప్పపాటులో శత్రుమూకలపై విరుచుకుపడతాయని ఉగ్రవాదుల చేతుల్లోకి ఇవి వెళితే అమాయక ప్రజలపై వారు ప్రయోగిస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. కిల్లర్ రోబోల అభివృద్ధిని తక్షణమే నిలిపివేయాలని ఐరాసను కోరుతూ ఈ సదస్సు బహిరంగ లేఖ రాసింది. ఈ తరహా ఆయుధాలతో యుద్ధంలో పోరాడటానికి అనుమతించడం అత్యంత ప్రమాదకరమని, ప్రపంచాన్ని అస్థిరపరిచేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.