వందేళ్లలో నీట మునగనున్న మహానగరాలు
లండన్: రానున్న వందేళ్ల కాలంలో సముద్రపు నీటి మట్టాలు మూడు మీటర్ల కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటివరకు భావిస్తున్న దాని కన్నా ఇది అర మీటరు మేర ఎక్కువని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం మాదిరిగానే ఇకపై కూడా కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలు విడుదల అయితే ప్రపంచానికి జరిగే నష్టాలను అంచనా వేసేందుకు యూకేలోని సౌత్‌హాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
అంటార్కిటికా ప్రస్తుతం కోల్పోతున్న ద్రవ్యరాశి, నూతన గణాంక పద్ధతి ప్రకారం 2100 సంవత్సరం నాటికి సముద్ర నీటి మట్టాలు మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రొఫెసర్ సైబ్రేన్ డ్రిజ్ఫౌట్ తెలిపారు. అంతేగాక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని శతాబ్దాల్లోనే ప్రపంచవ్యాప్తంగా లోతట్టు నదీ డెల్టాల్లో నిర్మించిన అనేక మహానగరాలు ముంపుకు గురవుతాయన్నారు.