Climate Central
-
కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?
రాబోయే కాలం మానవులకు అత్యంత కష్టకాలంగా మారనుంది. కరోనా తరువాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో వంద కోట్ల మంది బలికానున్నారు. ఈ వంద కోట్ల మంది ఏదో ఒక ప్రాంతానికే చెందినవారేమీ కాదు.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృదంగంలో సమిధలు కానున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. భయపెడుతున్న గణాంకాలు యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఇటీవల వాతావరణ మార్పులపై పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు మానవుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు రాబోయే తరానికి పెను ముప్పుగా పరిణమించనున్నాయని ఈ పరిశోధన నిర్వాహకులు జాషువా పియర్స్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మానవుల మరణాల సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఇది 100 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మనిషి బతకాలంటే ఏం చేయాలి? ఈ విపత్తును నివారించడానికి మనుషులంతా ముందుగా వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దీనితో పాటు కర్బన ఉద్గారాలను తీవ్రంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు చేపట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏటా భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో ప్రపంచం నిప్పుల కొలిమిలా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు గల కారణాలలో ప్రధానమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వాలు కార్బన్ వేస్ట్ మేనేజ్మెంట్, కార్బన్ డయాక్సైడ్ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తే, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఐబీఎంలో కూర్చుని రెజ్యూమ్ రూపొందించిన రతన్ టాటా -
ముంపు ముప్పు ముంచుకొస్తోంది!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: సముద్ర తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ముంచుకొస్తోంది. ఇంకో 30 ఏళ్లలో ఒక్క భారత్‌లోనే సుమారు మూడున్నర కోట్లమంది ముంపు ముప్పును ఎదుర్కోనుండటం ఇందుకు కారణం. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలాకాలంగా తెలిసినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం ఇప్పటివరకూ తక్కువ అంచనా వేశాం. అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ జరిపిన తాజా అధ్యయనం పాత అంచనాలను మార్చేస్తోంది. గతంలో కంటే కనీసం ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ స్థాయిలో నష్టం జరగనున్నట్లు చెబుతోంది. చైనాలో 9 కోట్లు, బంగ్లాదేశ్‌లో 4.3 కోట్ల మందికి ముంపు ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు ► భూతాపోన్నతి ప్రభావం కారణంగా సముద్ర మట్టాలు ఎంత మేరకు పెరుగుతాయి? అదే సమయంలో తీరప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య ఎంత మేరకు ఎక్కువవుతుంది? అన్న రెండు అంశాల ఆధారంగా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ► ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది తీరప్రాంత ప్రజలు ముంపు బారిన పడే చాన్సుంది. భారత్ విషయానికొస్తే.. సుమారు కోటిన్నర మంది ప్రజలు ఏటా వరద, ముంపు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► ముంబై, నవీ ముంబై, కోల్‌కతాల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ. గత అంచనాల ప్రకారం ఈ సంఖ్య కేవలం 50 లక్షలు. ► 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం 11–16 సెంటీమీటర్లు పెరిగింది. కార్భన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించినప్పటికీ ఈ శతాబ్దంలో సముద్ర మట్టం మరో 0.5 మీటర్లు పెరగనుంది. ► 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది వార్షిక వరదల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉండగా.. శతాబ్దం చివరినాటికి ఈ సంఖ్య 63 కోట్లను దాటనుంది. ఎత్తైన అల స్థాయిలో 25 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అలల ఎత్తుకంటే పదిమీటర్ల ఎక్కువ ఎత్తులో నివసిస్తోన్న తీరప్రాంత ప్రజలే వంద కోట్ల మంది ఉండగా.. మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉండేవారే 25 కోట్ల మంది ఉన్నారు. వరదల ప్రభావానికి గురయ్యేవారిలో 70 శాతం మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశస్తులేనని వెల్లడించింది. -
ముంపు ముంచుకొస్తోంది!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోల్‌కతా మహానగరం తాలూకూ రెండు మ్యాప్‌లు. రెంటికీ మధ్య తేడా ఏమిటో తెలుసా? నీలిరంగు ఎక్కువగా ఉన్నదేమో నగరం సగం సముద్రంలో మునిగిపోతే ఎలా ఉంటుందో చూపుతుంది. బూడిదరంగు ఎక్కువగా ఉన్నదేమో అక్కడక్కడా నీటమునిగితే ఏమవుతుందో చెబుతుంది. కోల్‌కతా నగరం సముద్రంలో మునిగిపోయేంత ప్రమాదం ఇప్పుడు ఏమొచ్చిందబ్బా అని అనుకోవద్దు. మనం ఇప్పటిలానే విచ్చలవిడిగా పెట్రోలు, డీజిల్ మండించేస్తూ... అడవులను కొట్టేస్తూ పోతే భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతుందని వింటూనే ఉన్నాం కదా... దాని పర్యవసానం ఇలా ఉండబోతుందని అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ అనే స్వచ్ఛంద సంస్థ తన తాజా నివేదికలో హెచ్చరించింది. భూతాపం నాలుగు డిగ్రీల వరకూ పెరిగితే సముద్రతీరాల్లో ఉన్న అనేకానేక మహా నగరాలు ముంపు బారిన పడక తప్పదని ఈ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా న్యూయార్క్ మహానగరంతోపాటు దక్షిణ అమెరికాలోని రియో డి జెనీరో, యూరప్‌లోని లండన్, ఆసియాలోని ముంబై, కోల్‌కతా, షాంఘై, దక్షిణాఫ్రికాలోని డర్బన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలతోపాటు ఇతర నగరాల్లో దాదాపు 47 నుంచి 76 కోట్ల మందిని నిర్వాసితులను చేస్తుందని హెచ్చరించింది ఈ నివేదిక. ఈ నెల 30న ప్రారంభం కానున్న ప్యారిస్ వాతావరణ సదస్సు తరువాతైనా ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వచ్చి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తే... భూతాపోన్నతిని రెండు డిగ్రీలకు పరిమితం చేయగలిగితే ప్రమాద తీవ్రతను కొంతవరకూ తగ్గించవచ్చునని సూచించింది. ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలకు పరిమితమైనా కనీసం 13 కోట్ల మంది నిర్వాసితులవుతారని అంచనా.