తిరుపతి : హంద్రీ- నీవా కాలువ పెండింగ్ పనులను టెండర్లు లేకుండానే కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాల మేరకు పనులు వేగంగా జరగలేదనే సాకు చూపి కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పజెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 53, 52, 8, 11, 25, 26 ప్యాకేజీ పనులను అప్పగించారు. నిబంధన 63సీ ప్రకారం ఈ పనులను కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పారు. ఈమేరకు ముఖ్యమంత్రి సైతం నాలుగు నెలల క్రితమే మెమో జారీ చేసినట్లు సమాచారం.
కట్టబెట్టిన పనులు ఇవే....
ఆడవిపల్లె రిజర్వాయర్, టన్నెల్-20 పెండింగ్ పనులను ఆర్‌కె ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించారు. 8, 53 ప్యాకేజీలను ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌కు కట్టబెట్టారు. 11, 52 ప్యాకేజీలలో పెండింగ్ పనుల్లో కొంత భాగాన్ని ఆర్‌కె ఇన్‌ఫ్రాకు ఇచ్చారు. 25, 26 ప్యాకేజీల్లో కొంత భాగం పనులను ఎంఆర్‌కెఆర్‌కు అప్పజెప్పారు. ఇంతకు మునుపు ఉన్న పాత రేట్లకే, వేగంగా పనులు చేస్తామని ముందుకు వచ్చిన కొత్త సంస్థలకు పనులు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అప్పగించిన పనులకు ఎంత బిల్లు అవుతుందో, దానిని పాత ఏజెన్సీ నుంచి రాబట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంత మంది తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం చూపి పనులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పనుల పంపకంలో సీఎంతో సన్నిహితంగా మెలిగే వైఎస్సార్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. పనులు తనకు అనుకూలమైన వారికే కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల తిరుపతి సీఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
భూమి అప్పగిస్తేనే పనులు చేస్తామని మెలిక...
భూసేకరణ పూర్తి కాకుండానే నవంబర్ 15వ తేదీలోపు పనులు చేస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఇప్పటికీ 59 ప్యాకేజీకి పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు ప్రారంభించలేదన్న సాకుగా చూపి వేరే కాంట్రాక్టు సంస్థలకు అప్పజెబుతుండడంతో కొన్ని ఏజెన్సీలు నామమాత్రంగా పని చేస్తున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొన్ని పనులు అప్పజెప్పాం...
పనులు వేగంగా చేయని ప్యాకేజీలకు నిబంధన 60సీ ప్రకారం కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పాం. 9 ప్యాకేజీలకు కొత్త రేట్ల ప్రకారం టెండర్లను పిలిచాం. పనులు సీఎం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
-సుధాకర్, తెలుగంగ సీఈ, చిత్తూరు
టెండర్లు లేకుండానే హంద్రీ-నీవా పనులు
Published Tue, Aug 4 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement