చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నరకానికి నకళ్లు. మంచాలు, బెడ్లు, దుప్పట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఉండే వారు కాదు. కంపు కొట్టే వార్డులు, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఆస్పత్రులు ఉండేవి. చిన్నపాటి మందు బిళ్లలకు కూడా కొరతే. అన్ని మందులూ బయట కొనుక్కోవాల్సిందే.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్పత్రుల రూపురేఖలే మార్చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అధునాతన వైద్య సౌకర్యాలతో తీర్చిదిద్దారు. నిరంతర వైద్య సేవలందేలా వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. మందులకు కొరతే లేదు. ఏ మందు కావాలన్నా ప్రభుత్వాస్పత్రుల్లో దొరుకుతుంది. మొత్తంగా వైద్య రంగం ముఖచిత్రాన్నే మార్చిన సీఎం వైఎస్ జగన్. అందుకే ఇప్పుడు ప్రజలంతా నిర్భయంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు.
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న ఆస్పత్రులు ఈనాడు అధిపతి రామోజీరావుకు కనిపించలేదు. ఎందుకంటే.. ఆయనకు అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా కనిపించాయి. మరి ఇప్పుడు.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు నిరంతర వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులపై అబద్ధాలు ఆచ్చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత అంటూ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే...
కొరతకు తావివ్వకుండా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో 608 రకాల మందులకుగాను 229 రకాలే సరఫరా చేసేవారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 357 రకాలకు గాను 232 మాత్రమే అందుబాటులో ఉండేవి. రీఎజెంట్స్ అసలు సరఫరా చేసేవారే కాదు.
ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అరకొరగా సరఫరా చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో 608 రకాల మందులకు గాను 566 రకాలు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా చేస్తున్నారు. మిగిలిన 42 మందులు డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల ద్వారా నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 377 కు గాను 326, రీఎజెంట్స్ 449 కు గాను 172 అందుబాటులో ఉంటున్నాయి.
తక్కువ వినియోగం ఉన్న మందులు, రీఎజెంట్స్, సర్జికల్ కన్జ్యూమబుల్స్‌ను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఎమ్మార్పీపై 35.60 శాతం డిస్కౌంట్‌తో సరఫరా చేస్తున్నారు. రీఎజెంట్స్‌ను రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వంలోనే సెంట్రల్ టెండర్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నారు.
2023–24 ఆర్ధిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్స్‌కు డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద బోధన, జిల్లా ఆస్పత్రులకు రూ.14.59 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 3.44 కోట్లు వినియోగించారు. భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఏపీఎంస్‌ఐడీసీ మందులు, సర్జికల్స్ నిల్వలను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఉంచుతోంది. ప్రస్తుతం 13 డ్రగ్ స్టోర్స్‌లలో వచ్చే మూడు నెలలకు సరిపడా రూ.117.10 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్ నిల్వ ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో మందుల కొరత అంటూ రామోజీరావు కథనాలు ప్రచురించడం ప్రభుత్వ వైద్య రంగం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలనే కుట్రకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 229 రకాల మందులు అందుబాటులో ఉండి, ఇతర వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రభుత్వాస్పత్రులకు జనాలు పోటెత్తుతున్నారని ఇదే ఈనాడులో ప్రచురించారు.
గతంతో పోలిస్తే గణనీయంగా మందులు, సర్జికల్స్, మానవ వనరులు పెరిగిన సందర్భంలో నేడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని రాతలు రాయడం దిగజారుడుతనానికి నిదర్శనమని వైద్య రంగ నిపుణులు వాపోతున్నారు.
బడ్జెట్ గణనీయంగా పెరుగుదల
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ పుష్కలంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2015–18 మధ్య మందుల కోసం రూ. 1080 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ.235.94 కోట్లు చొప్పున రూ.1,315.94 కోట్లు ఖర్చు చేశారు.
అదే 2019 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మందుల కోసం రూ.2,229.99 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ. 458.33 కోట్లు వెచ్చించింది. ఇలా 2019–23 మధ్య రూ.2,688.32 కోట్లు ఖర్చు చేశారు. అంటే గత ప్రభుత్వం కన్నా రూ.1372.38 కోట్లు అదనంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వెచ్చించింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లిన రూ. 150 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.
రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రూ. 8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 5 వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల్లో వసతుల కల్పనతో పాటు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను కూడా బలోపేతం చేశారు. గ్రామాల్లో ప్రతి 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటిలోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వైద్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఇప్పటి వరకు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment