పల్నాడు జిల్లా లింగంగుంట్లలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
సామాన్యుడికి వైద్యం అందించే విషయంలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టాం. ఇంటింటా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని.. ఆరోగ్య భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. ఈ రోజు పెన్షన్లు ఏ మాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తున్నాయో.. అదే మాదిరి వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాల్లో మీ ఇంటికి కూడా కదిలి వచ్చే కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి,గుంటూరు: ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే రోల్ మోడల్‌గా, వైద్య ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ విధానం రాబోయే రోజుల్లో దేశం మొత్తం మన వద్ద కాపీ చేసుకుని, అమలు చేసే రోజు వస్తుందని ఆకాంక్షించారు. మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఆయన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు.
అక్కడి విలేజ్ క్లినిక్‌ను సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అందుబాటులో ఉన్న మందుల గురించి వైద్య సిబ్బందితో ఆరా తీశారు. గ్రామంలో ఎంత మందిని స్క్రీనింగ్ చేశారు.. ఎంత మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి.. వాటిని యాప్‌లో ఎలా నమోదు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘ఇక డాక్టర్ కోసం మీ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు పోవాల్సిన అవసరం లేదు. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు. మీ ఇంటి చేరువకే వస్తాడు. మీ కుటుంబం కోసం, మన పేదల కోసం అక్కడికే వైద్యుడితో పాటు వైద్య సేవలు కూడా వస్తాయి. అక్కడే మీ జబ్బుల గురించి తెలుసుకుని, అక్కడే మందులు ఇచ్చే గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తదితరులు
తొలి దశలోనే జబ్బులను గుర్తించవచ్చు
► పేదలు, పేద సామాజిక వర్గాల వారు హాస్పిటల్స్ చుట్టూ, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరీక్షలు చేయించుకోవడం కోసం పరీక్ష కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆధునిక వైద్యాన్ని మీ గ్రామంలోనే ఉచితంగా అందించడానికే ఈ విధానం తీసుకువచ్చాం. గ్రామంలో మంచానికే పరిమితమైన రోగుల గడప వద్దే అవసరమైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం.
► ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అని ఒక నానుడి. జబ్బులు ముదరకుండా.. రాకుండా కాపాడేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకువచ్చాం. దీనివల్ల బీపీ, షుగర్, ఇతరత్రా రోగాలను తొలి దశలోనే కనుక్కోగలుగుతాం. వాళ్లకు వెంటనే వైద్యం అందించి, ముదరకుండా కాపాడగలుగుతాం. ఇది ఒక్క బీపీ, షుగర్‌లకు మాత్రమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ వరకూ ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రంగా నిలుస్తుంది.
మన గ్రామానికి నడిచి వచ్చిన గొప్ప వ్యవస్థ
► ఇదే లింగంగుంట్ల వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో ఏకంగా 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేయడం కోసం డయాగ్నస్టిక్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియో కాన్ఫ్‌రెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఎవరికి బాగా లేకపోయినా విలేజ్ క్లినిక్‌కు వెళితే స్పెషలిస్టు డాక్టర్లు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యం అందించే గొప్ప వ్యవస్థ ఈ రోజు మన గ్రామానికే నడిచి వచ్చింది.
► ప్రతి 2,000–2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ఇందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన వ్యక్తి కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)గా ఉంటారు. మరో ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది. వీళ్లిద్దరే కాకుండా ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లో రిపోర్టు చేసే వ్యవస్థ ఆవిర్భవించింది. తద్వారా ప్రతి పేదవాడికి 24 గంటలపాటు వైద్యం అందించవచ్చు.
► విలేజ్ క్లినిక్‌లను మండలానికి రెండు పీహెచ్‌సీలకు అనుసంధానం చేస్తున్నాం. ప్రతి హీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఇందులో ఒక డాక్టర్ ఓపీ చూస్తుంటే.. రెండో డాక్టర్ కదిలే వైద్యశాల అయిన 104 వాహనం ఎక్కి, ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్తాడు. అక్కడి విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై సేవలు అందిస్తాడు.
మండలానికి నలుగురు డాక్టర్లు
► మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు.. అంటే ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరు డ్యూటీలు మార్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు. ప్రతి డాక్టరు కూడా తనకు కేటాయించిన గ్రామానికే తాను వెళ్తాడు కాబట్టి.. ఆ డాక్టర్ పేరు, మొబైల్ నంబరు ప్రతి విలేజ్ క్లినిక్‌లో, ప్రతి గ్రామ సచివాలయంలో పెద్ద అక్షరాలతో డిస్‌ప్లే చేస్తారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డాక్టర్ మీకు అందుబాటులో ఉంటాడు అనే భరోసా ఉంటుంది.
► నెలకు రెండు నుంచి నాలుగుసార్లు అదే గ్రామానికి వచ్చి వైద్యం అందిస్తాడు. తద్వారా ఆ డాక్టరుకు ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు, పేరున పిలిచే పరిచయం ఏర్పడుతుంది. అదే ఫ్యామిలీ డాక్టర్ విధానం. ఈ కాన్సెప్ట్ట్‌ను అమలు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక పద్ధతి ప్రకారం ముందు చూపుతో 104 వాహనాలు కొనుగోలు చేయడం, విలేజ్ క్లినిక్‌లు స్థాపించడం, ముందుగానే వైద్యులు, సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్స్ తయారు చేయడం, అవి డౌన్లోడ్ చేసి వినియోగించే విధానం వీళ్లందరికీ నేర్పించాం.
రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు
► ఆరోగ్యశ్రీ అనగానే దివంగత నేత రాజశేఖరరెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి చేరువగా, ఉచితంగా తీసుకువచ్చారు. వైఎస్సార్ తదనంతరం ఈ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈ పథకంలోని ప్రొసీజర్స్‌ను 1000కి కట్టడి చేశారు. రూ. 800 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు.
► మనందరి ప్రభుత్వం రాగానే ఆ బకాయిలను చెల్లించడమే కాకుండా, ప్రొసీజర్స్‌ను ఏకంగా 3,255కు విస్తరించాం. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆస్పత్రులు గతంలో కేవలం 919 మాత్రమే ఉంటే, ఇవాళ వాటి సంఖ్య 2,261. మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో 35,71,596 మంది సేవలు అందుకున్నారు.
► నిరుపేద ప్రాణం, నిస్సహాయుల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఒక్క ఆరోగ్యశ్రీ మీద చేసిన ఖర్చు రూ. 9 వేల కోట్లు. ఇది కాకుండా ఆరోగ్య ఆసరా కింద మరో రూ.990 కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం.
తేడా మీరే గమనించండి..
► గత ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 46 నెలల కాలంలో ఏకంగా 48,639 ఉద్యోగాలు ఇచ్చాం.
► దేశ వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 33 శాతం, స్టాఫ్ నర్సులు 27%, జనరల్ íఫిజీషియన్ 50% ఖాళీలు ఉంటే మనం వంద శాతం భర్తీ చేశాం. స్పెషలిస్టు డాక్టర్లకు సంబంధించి దేశ వ్యాప్తంగా 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో 96.04 శాతం పూర్తి చేశాం.
► దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ స్థాపించాం. అక్కడ 10,032 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంతేమంది ఏఎన్‌ఎంలను నియమించాం. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేల జీతం ఉంటే ఇప్పుడు రూ.పది వేలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వమే కొత్తగా 560 అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాం. ప్రతి 2,500 జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉన్న ఏకైక రాష్ట్రం మనదే. చంద్రబాబునాయుడు వైద్య రంగంపై ఏటా రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే మనం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం.
► రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉంటే, కొత్తగా 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్నాం. పాత కళాశాలలను నాడు–నేడు కింద తీర్చిదిద్దుతున్నాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. 104, 108 వాహనాలు కొత్తగా 1,514 కొనుగోలు చేశాం.
► గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 229 రకాల మందులు, అవి కూడా నాసిరకం అందుబాటులో ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక 562 రకాల డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్లు, తలసేమియాతో బాధ పడుతూ మంచానికే పరిమితమైన వాళ్లకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం.
► ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఆ మనిషి ఇంటికి వెళ్లి తిరిగి పనులు చేసుకునే వరకు అండగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేలు చొప్పున వైద్యుల సలహా మేరకు విశ్రాంతి సమయంలో సాయం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 46 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2,05,108 కోట్లు జమ చేశాడు. వివక్ష, లంచాలు లేని పాలన సాగుతోంది. ఇదీ.. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. మీరే గమనించండి.
బాబుకు స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియవు
స్కామ్‌లు చేయడమే తప్ప స్కీంలు తెలియని బాబులు ఉన్నారు. వారికి అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. మాత్రమే తెలుసు. లంచావతారాలు, గజ దొంగలు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలు, సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు.. ఇలా ఒకరు చంద్రబాబు రూపంలో, ఒకరు ఈనాడు రూపంలో, ఒకరు ఆంధ్రజ్యోతి, మరొకరు టీవీ5 రూపంలో.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు రూపంలో కనిపిస్తారు.
ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని వీరికి మిగిలింది జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు మాత్రమే. వీటితో మాత్రమే వీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తుంటే, దీనికి అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతు చూసి తట్టుకోలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. నాకు అంగబలం, అర్థబలం, మీడియా బలం లేకపోయినా.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి.
నేను పొత్తులపై ఆధార పడను. నాకు ఎవరితోనైనా పొత్తు ఉందంటే అది ప్రజలతో మాత్రమే. నాకు కుయుక్తులు చేతకాదు. అబద్ధాలు చెప్పలేను. మోసం చేయలేను. పన్నాగాలు, జిత్తులు చేత కాదు. నేను ఏది చెప్తానో అదే చేస్తాను. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా.. అన్నది కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా సైనికుల్లా నిలబడండి.
చిలకలూరిపేటకు వరాలు
చిలకలూరిపేటలో రూ.150 కోట్లతో తాగునీటి కోసం పనులు జరుగుతున్నాయి. దీనికి మున్సిపల్ వాటాగా ఖర్చు పెట్టాల్సిన రూ.63 కోట్లు కావాలని మంత్రి విడదల రజిని అడిగింది. దీన్ని మంజూరు చేస్తున్నా. అంబేడ్కర్ కమ్యూనిట్ హాల్, బీసీ భవన్, కాపు భవనాలను మంజూరు చేస్తున్నా. ముస్లిం శ్మశానం, దర్గా నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నా. లిఫ్ట్ ఇరిగేష¯న్ స్కీం మరమ్మతులకు ప్రతిపాదనలు రాగానే వాటిని కూడా పూర్తి చేస్తాం.
జగనన్నా.. ఇది మీరు పెట్టిన భిక్ష
బీసీ మహిళనైన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన జగనన్నకు రుణపడి ఉంటాను. అన్నా.. నా రాజకీయ జీవితం నీవు పెట్టిన భిక్ష. చిలకలూరిపేట లాంటి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మంత్రిగా ఉండటమే మీ చిత్తశుద్ధికి నిదర్శనం. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఆరోగ్య రంగానికి ఏం మేలు చేశారో చెప్పాలి. ఆయన ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారు.
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధం అంటూ కాలక్షేపం చేశారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చు.. నాలుగు టీవీలు, నాలుగు పత్రికలు, నాలుగు పార్టీలతో పొత్తులు కలిగి ఉండొచ్చు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం మా జగనన్నదే. రాబోయే ఎన్నికల్లో మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, మీ దుష్టచతుష్టయం ఎన్ని అరాచకాలు చేసినా మిమ్మల్ని ఓడించడం ఖాయం.
– విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
మీ వల్లే బతికున్నా..
నేను కూలి పనులు చేసుకునే వాడిని. నా కిడ్నీలు పాడయ్యాయని, వెంటనే డయాలసిస్ చేయాలన్నారు. చాలా డబ్బు ఖర్చవుతుందని నేను భయపడ్డాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని డాక్టర్ అడిగారు. ఉందని చెప్పాను. ఆ కార్డు ఆధారంగా నా వద్ద నుంచి ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా నన్ను బతికిస్తున్నారు.
వలంటీర్ వచ్చి నీకు రూ.10 వేలు ఫించన్ జగనన్న పంపారని ప్రతి నెలా ఇస్తున్నారు. ఆ డబ్బుతో, ఇతరత్రా మీ పథకాలతో నా కుటుంబం ముందుకెళ్తోంది. మా నాన్నకు గుండె సమస్య వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా స్టంట్ వేశారు. ఇప్పుడు తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం మాలాంటి పేదలకు వరం. మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాం.
– ఎం.రమేష్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, లింగంగుంట్ల
Comments
Please login to add a commentAdd a comment