టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్‌ | Andhra Pradesh ranks first in telemedicine services | Sakshi
Sakshi News home page

టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్‌

Published Sun, Feb 4 2024 4:09 AM | Last Updated on Sun, Feb 4 2024 4:09 AM

Andhra Pradesh ranks first in telemedicine services - Sakshi

సాక్షి, అమరావతి :  రోగులకు టెలిమెడిసిన్‌ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్‌ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాల్లో తెలిపింది.

అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్‌ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్‌ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్‌ 2.94 కోట్ల  సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  

గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు
ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్‌ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ–సంజీవని టెలిమెడిసిన్‌ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్‌ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
హబ్, స్పోక్‌ మోడల్‌ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు టెలిమెడిసిన్‌ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్‌ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య హెల్త్‌ క్లినిక్స్, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లను అనుసంధానం చేశారు.

ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు  సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు.   

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా సేవలు.. 
ఇక స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్‌ ఫేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్‌ సేవలందించడంతో పా­టు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారు­మూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్‌ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement