గాందీలో సరైన వైద్యం అందడంలేదు
ఓ కన్నతల్లి ఆవేదన
సోషల్ మీడియాలో వైరల్
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్‌పేట తిరుమల నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.
వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్‌సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్‌లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది.
సీఎం రేవంత్‌రెడ్డికి చేరేవరకూ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్‌లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment