పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో వైద్య సేవలు
టీడీపీ హయాంలో యూపీహెచ్‌సీలపై నిర్లక్ష్యం
అప్పట్లో చిన్న అనారోగ్యమైనా ప్రైవేట్ ఆస్పత్రులకే జనం
ఇప్పుడు సకల పరీక్షలు, మందులు, ఇద్దరేసి వైద్యులతో బలోపేతం
భారీగా పెరిగిన ఔట్ పేషెంట్ సేవలు
542 యూపీహెచ్‌సీల్లో 11 నెలల్లో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలు
ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతంతో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్‌సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాడు–నేడు పేరుతో యూపీహెచ్‌సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్‌సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం
చంద్రబాబు హయాంలో యూపీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్‌సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్‌సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి.
ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు.
ఇంతలోనే.. ఎంతో మార్పు
సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్‌సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు.
అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్‌సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు.
ఖరీదైన పరీక్షలు ఉచితం
గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య
కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్‌కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం
నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి
పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు.
చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్‌పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment